దేశంలో సంపన్న సీఎం జగన్‌రెడ్డి
posted on Apr 13, 2023 @ 9:38AM
సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. మన దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల (ఢిల్లి, పుదుచ్చేరి) సీఎంలలలో అందరికంటే సంపన్నుడు ఏపీ సీఎం. (మరో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము-కాశ్మీర్ గవర్నర్ పాలనలో ఉన్నందున అక్కడ ముఖ్యమంత్రి లేరు.) కాగా, 30 ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రమే ఇందుకు మినహాయింపు.
ఆమె ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమే. ఎన్నికల సందర్భంగా ఆయా నేతలు సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. దీనిపై రూపొందించిన నివేదికను బుధవారం (ఏప్రిల్ 12)విడుదల చేసింది. దీని ప్రకారం, 29 మంది సంపన్న సీఎంల సగటు ఆస్తుల విలువ రూ.33.96 కోట్లు. అదే సమయంలో 30 మంది సీఎంలలో 13 మంది (43శాతం) పై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.
కొందరు ముఖ్యమంత్రులు హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్ వంటి నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. నాన్‌బెయిలబుల్ పరిధిలోకి వచ్చే తీవ్రనేరాపణలను ఎదుర్కొంటున్నారు. వీరు దోషులుగా తేలితే వీరికి కనీసం ఐదేల్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
అత్యధిక ఆస్తులు కలిగిన మొదటి ముగ్గురు ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి -ఆంధ్రప్రదేశ్ (రూ.510 కోట్లకుపైగా), పెమాఖండూ - అరుణాచల్ ప్రదేశ్ (రూ.163కోట్లు ఆపైన), నవీన్ పట్నాయక్ - ఒడిశా (రూ. 63.87కోట్లు) ఉన్నారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిపియు రియో ఆస్తుల విలువ రూ.46 కోట్లు, పుదుచ్చేరి సీఎం రంగస్వామికి రూ.38 కోట్ల విలువైన స్థిర,చరాస్తులు ఉన్నాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు రూ.17 కోట్లు, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మాకు రూ.14 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.
ఇక బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆస్తుల విలువ రూ.23.5 కోట్లు కాగా, ఆయనకు రూ.8.8 కోట్లు అప్పులు కూడా ఉన్నాయి. ఎక్కువ అప్పులున్న సీఎంల జాబితాలో కేసీఆర్ మొదటి స్థానంలోనూ, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై రెండవ స్థానంలో ఉన్నారు. బొమ్మైకి రూ.4.9 కోట్ల అప్పులున్నాయి. బొమ్మై ఆస్తుల విలువ రూ.8.92కోట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు రూ.11.6 కోట్ల ఆస్తులు, రూ.3.75 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక ఏడీఆర్ నివేదికపై ఆయా రాష్డ్రాలలోని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో ఎలా స్పందించాలా అని ప్రణాళికలు రూపొందించడంలో తలమునకలవుతున్నట్టు సమాచారం.. సందు దొరకటమే మొదలు దీనిపై రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలకు ఎలా పదును పెట్టాలి..? అని ఆలోచిస్తూ ఉన్నారని సమాచారం. రాజకీయాలలో క దేది విమర్శకులకు అనర్హం?