మార్చేస్తారా? మందలించి సరిపెడతారా?
posted on Apr 13, 2023 @ 11:58AM
తెలంగాణ గవర్నర్ తమిళి సై గురువారం (ఏప్రిల్ 13) హస్తినలో పర్యటించనున్నారు. పెండింగ్ బిల్లుల వివాదం సుప్రీం కోర్టులో ఉన్న తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రిపబ్లిక్ డే వేడుకల వివాదం, ఆ తర్వాత బడ్జెట్ ఆమోదం విషంయలో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించటం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తదితర విషయాలను ఆమె ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించే అవకాశాలు ఉన్నాయి.
గత వారం రోజుల్లో తెలంగాణలో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణామాల ఆమె ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాలలో ఆసక్తి వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. అన్నిటికీ మించి గత కొన్నేళ్లుగా ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ అన్నట్లుగా ఉన్న పరిస్థితులు మారినట్లుగా అనిపించినా, ఆ గ్యాప్ అలాగే ఉందనడానికి 7 కీలక బిల్లులకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకుండా పెండింగ్ లో ఉంచడం, తాజాగా మంత్రి కేటీఆర్ గవర్నర్ వ్యవస్థ అవసరమా అంటూ కొత్త చర్చకు తెరలేపడం నేపథ్యంలో గవర్నర్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ తర్వాత పెండింగ్ లో ఉంచిన బిల్లులపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాలలో నెలకొంది.
ఇదలా ఉంటే ఏడాది కిందట తెలంగాణ గవర్నర్ గా తమిళిసై మార్పు తప్పదన్న వార్తలు జోరుగా వినిపించాయి. చీటికీ మాటికీ గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంతో తగవుల కారణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిష్ట మసకబారుతోందన్న భావన కు వచ్చిన కేంద్రం ఆమెను తెలంగాణ గవర్నర్ గా తప్పించడమే మేలన్న భావనకు వచ్చిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు.
ఇక ఇప్పుడు పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లడం.. సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడటం నేపథ్యంలో ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చే రోజున గవర్నర్ ఒక మెట్టు దిగి మూడు బిల్లులకు ఆమోదం తెలిపినా మిగిలిన వాటిని పెండింగ్ లోనే ఉంచడం వంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై తాజా హస్తిన పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్లుల విషయంలో అనవసర రగడ వద్దన్న మందలింపుతో సరిపెడతారా లేక ఆమెను మార్చే నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.