సుఖేష్’ సంచలనం.. ఇక కవిత అరెస్టేనా?
posted on Apr 14, 2023 @ 9:59AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు హాలీవుడ్, బాలీవుడ్; సస్పెన్సు థ్రిల్లర్ సినిమాలను మరిపించే ట్విస్టులతో నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కుంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా రాజకీయ సంబందాలున్న ఓ ఆరడజను మందికి పైగా ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. ఇదే క్రమంలో అనుమనితురాలుగా ఇప్పటికే మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా రేపో మాపో అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.
అదలా ఉంటే తాజాగా మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఈ కేసుకు సంబంధించి వరుస లేఖలతో సంచలనాలకు తెర తీస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి జైలు నుంచి సుఖేష్ లేఖను విడుదల చేశారు. అయితే ఈసారి లేఖతో పాటు వాట్సప్ చాటింగ్ ను బయటపెట్టాడు. కవితక్క..టీఆర్ఎస్ అనే నంబర్ తో సుఖేష్ చాట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ లేఖలో కవితతో చాట్ చేసిన విషయాలు అంటూ సుఖేష్ పేర్కొనడం గమనార్హం. ఇక తాజాగా సుఖేష్ తో పరిచయం, చాటింగ్ పై సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీపై కావాలనే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. సుఖేష్ తో తనకు ఎలాంటి పరిచయం లేదన్న కవిత..కేసీఆర్ ను ఎదుర్కొలేకే తనపై దాడి చేస్తున్నారన్నారు. ఫేక్ చాట్ లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తమ కుటుంబాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారని కవిత అన్నారు.
తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఇటీవల వరుస లేఖలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. కాగా సుఖేష్ ఇలా లేఖ రిలీజ్ చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా తన న్యాయవాది ద్వారా సుఖేష్ పలు లేఖలను రిలీజ్ చేశారు. తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో వాట్సప్ , టెలిగ్రామ్ లో చాట్ చేసిన 700 పేజీల లేఖను రిలీజ్ చేశాడు. అందులో సీఎం కేజ్రీవాల్ చెప్పినట్టు రూ.75 కోట్లను హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏకే అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.
ఆ రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు. అయితే సుఖేష్ కేజ్రీవాల్ చాట్ ను బయటపెట్టిన కొన్నిరోజులకు ఎమ్మెల్సీ కవితతో చాట్ అంటూ సుఖేష్ లేఖతో పాటు చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తుంది.కాగా, ఈలేఖ పై బీజేపీ ఎమ్మెల్యే ఈడీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మరో మలుపు తిరిగింది. మరింత సంచలనంగా మారింది.