టీడీపీ పార్లమెంట్ కమిటీలపై పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం
తెలుగుదేశం పార్టీ కమిటీల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఒక్కో పార్లమెంట్ కమిటీలో 34 మంది సభ్యులు అనుబంధ విభాగల్లో 28 మందితో పార్లమెంట్ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీలపైనా అభిప్రాయాల సేకరణ చేయనున్నారు. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులు..కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, మీడియా కార్యదర్శులకూ ఇందులో స్థానం కల్పించారు. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి పార్లమెంట్ స్థాయిలో 54 సాధికార సమితిలు ఏర్పాటు కానున్నాయి.
పార్లమెంట్ పరిధిలోని పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ తీసుకోనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్లమెంట్ పార్టీ కమిటీలపై సమీక్షించారు. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నేత వర్ల రామయ్యతోపాటు టీడీపీ నేతలు హాజరయ్యారు.