27 రోజులలో శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం(ఆగస్టు 20)  అధికారులు లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో 4 కోట్ల 51 లక్షల 62 వేల 522 రూపాయల వచ్చాయని ఆలయ ఈవో  శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు 164.500 గ్రాముల బంగారం, 5.840 కేజీల వెండి వస్తువులు కూడా మల్లన్నకు కానుకలుగా అందాయని వివరించారు. ఇవే కాకుండా..   598 అమెరికా డాలర్లు, 20 కెనడా డాలర్లు, 100 న్యూజిలాండ్ డాలర్లు, పది ఇంగ్లండ్‌ పౌండ్స్, 100 సింగపూర్ డాలర్లు, 100 ఈరోస్, 115 సౌదీ అరేబియా రియాల్స్, 102 కత్తార్ రియాల్స్, 300 ఒమన్‌ బైసా, ఒకటి కువైట్‌ దినార్‌ కూడా మల్లన్న సమేత భ్రమరాంబికా దేవికి  భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారని తెలిపారు.  పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు,  నిఘా నేత్రాల పర్యవేక్షణలో చంద్రావతికల్యాణ మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితోపాటు శివసేవకుల సహాయంతో ఈ లెక్కింపు లెక్కింపు జరిగినట్లు తెలిపారు.    

మహోగ్రరూపం దాల్చిన గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న వానలకు గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం (ఆగస్టు 21)  ఉదయానికి గోదావరి నీటి మట్టం 50.8 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద కూడా వరదగోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కూడా 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల  ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.   ఇలా ఉండగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. కాళేశ్వరం సరస్వతీ ఘట్ వద్ద ఏర్పాటు చేసిన జ్ణాన జ్యోతులు నీట మునిగాయి. ఇక్కడ గరిష్ఠ ప్రవాహం 13.460 మీట్లకు కాగా ప్రస్తత పప్రవాహం 12.220 మీటర్లుగా ఉంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం తీరం వద్ద ఉన్న దుకాణాలను అధికారులు ఖాళీ చేయించారు. అలాగే ములుగు జిల్లా  రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  

తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.4.45 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం భక్త జనసందోహంతో కిటకిటలాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు తిరమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. గురువారం (ఆగస్టు 21) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (ఆగస్టు 20) శ్రీవారిని మొత్తం 75 వేల 688 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 99 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 45 లక్షల రూపాయలు వచ్చింది. 

కేంద్ర వ్యవసాయ మంత్రి జేపీ నడ్డాట.. వైసీపీ ఎంపీ అజ్ణానానికి ఇంత కంటే ఆధారం కావాలా?

వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలన్న అత్యుత్సాహంతో తప్పులో కాలేశారు. తన అజ్ణానాన్నా తానే బయటపెట్టుకున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ కు, తెలుగుదేశం శ్రేణుల ఎద్దేవాలకు గురౌతున్నారు. ఎంపి అయి ఉండి కూడా కేంద్రంలో ఏ మంత్రిది ఏ శాఖ అన్నది కూడా అవగాహన లేదని ఎంపీ తన విమర్శలతో తనను తానే పలుచన చేసుకున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందంటూ వైసీపీ ఎంపి మద్దిల గురుమూర్తి పెట్టిన ఒక పోస్టు ఎంపి అజ్ణానాన్ని బట్టబయలు చేయడమే కాకుండా వైసీపీని కూడా నవ్వుల పాలు చేసింది.   ఆంధ్రప్రదేశ్ లో యూరిగా కొరత కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేసిన వైసీపీ ఎంపీ గురుమూర్తి అక్కడితో ఆగకుండా.. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, రైతుల ఇబ్బందులను తాను స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రి  జేపీ నడ్డా దృష్టికి తీసుకువెళ్లాననీ, ఆయన సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారనీ పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఆయన అవగాహనారాహిత్యం, అజ్ణానం ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. ఏలా అంటే జేపీ నడ్డా వ్యవసాయ మంత్రి కాదు. ఆయన నిర్వహిస్తున్న శాఖ కేంద్ర రసాయనాలు, ఎరువులు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ గురుమూర్తిని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు అయితే అసలు గురుమూర్తి నిజంగా కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర సమస్య గురించి ప్రస్తావించారా? అలా ప్రస్తావించి ఉంటే తాను ఏ శాఖ మంత్రిని కలిశారో కూడా అవగాహన లేకుండానే కలిశారా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఈత సరదాకు ఆరుగురు చిన్నారులు బలి

  సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు మృత్యువు వడిలోకి చేరారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి 6 గురు విద్యార్థులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. స్కూల్ వదిలిన తరువాత సరదాగా ఈతకు వెళ్దామని ఐదవ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఊరికి దగ్గరలో ఉన్ననీటికుంటలో ఈతకువెళ్ళారు. వెళ్లిన ఏడుగురు విద్యార్థులుఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా ఒక విద్యార్థి ఒడ్డున నిలబడ్డాడు.  నీటికుంటలో ఆరుగురు విద్యార్థులు మునిగి పోవడంతో ఒడ్డున ఉన్న విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ఊరి పెద్దలకు విషయం తెలిపాడు. గ్రామ పెద్దలంతా హుటాహుటిన కుంట దగ్గరకు వెళ్లారు. వారంతా వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరుగురు విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు. నీటికుంటలో నుండి ఒక్కొక్కరి మృతదేహం బయట పడుతుంటే  పిల్లల తల్లిదండ్రుల ఆర్తనాదాలు అందరి కంట కన్నీరు తెప్పించాయి. స్కూల్ నుండి ఇంటికి రావాల్సిన పిల్లలు విగత జీవులుగా మారడంతో అయ్యో దేవుడా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థుల మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, కర్నూలు ఎంపీ నాగరాజు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. స్థానిక ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి మృతదేహాలకు నివాళి అర్పించి తల్లిదండ్రులను ఓదార్చారు.

హైదరాబాద్‌లో బేకరీ ఫ్లేవర్స్ కేంద్రం సీజ్

  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తపడియా డయాగ్నొస్టిక్స్ బిల్డింగ్‌లో గల రాజ్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రన్సెస్ తయారీ కేంద్రంపై జిహెచ్ఎంసి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు  దాడి చేశారు. ఓ ఫ్లోర్‌లో గోదాంలా ఏర్పాటుచేసి, బేకరీ ఉత్పత్తులకు అవసరమైన ఫ్లేవర్స్, ఫ్రాగ్రన్సెస్‌ను అక్కడ తయారు చేస్తున్న నిర్వాహకులు అధిక మోతాదులో రసాయనాలు కలిపి ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  అంతేకాకుండా, ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా పర్మిషన్ లేకుండా ఉత్పత్తులు కొనసాగిస్తున్నట్లు తేలింది. దీని వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలగవచ్చని అధికారులు స్పష్టం చేశారు. చుట్టుపక్కల స్థానికుల ఫిర్యాదుతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించడంతో గోదాంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి బృందం చర్యలు తీసుకుంటున్న సమయంలో నిర్వాహకులు గొడవకు దిగినట్టు తెలిసింది.  

చంద్రబాబు నేలవిడిచి సాము : మాజీమంత్రి డిఎల్

  సీఎం చంద్రబాబు  పి 4 పిచ్చిలో వున్నట్లు వున్నట్లు అనిపిస్తోందని,  నేల విడిచి సాము చేస్తున్నట్లు వుందని మాజీమంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు.  కాజీపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.  సమాజంలో జరుగుతున్న పరిణామాలను నోరు విప్పకపోతే తప్పు చేసిన వారము అవుతామన్నా ఉద్దేశ్యంతో  చెప్పాల్సి వస్తోందన్నారు.       టీడీపీ నాయకులు  జగన్ పాలనలో అభివృద్ధి లేదు అన్నారు, మా ప్రభుత్వంలో అభివృద్ధికి రూ.1000 కోట్లు నిధులు ఇచ్చామని చెబుతున్నారన్నారు. అభివృద్ధి ఏం జరిగిందనేది నా ఇంటి ముందు ఉండే రోడ్డును, మైదుకూరు సర్వయపల్లి రోడ్డు చూస్తే అర్థమవుతుందన్నారు. నా ఇంటి వద్దే ఇలా ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంటుందని నేను అనుకుంటానన్నారు. నా దృష్టిలో గత పాలకుల పాలనకు నేటి పాలకుల పాలనకు తేడా ఏమి లేదన్నారు.   అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, నిధులు ఎక్కడికి పోతున్నాయి, పేరుకే చెబుతున్నరా అన్నది తెలియాల్సి వుందన్నారు. ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరము నాలుగు నెలలు అవుతున్న ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. అధికారులను అడిగితే వచ్చే మార్చినాటికీ మంజూరవుతాయని చెబుతున్నారని ప్రజలు అంటున్నారన్నారు.. చేనేత కార్మికులు మగ్గాల ద్వారా వస్త్రాలు నేసి ఆప్కో  కు ఇచ్చే పనిచేయడం లేదన్నారు. క్వాంటమ్  వ్యాలీ ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ,వాట్సప్ గవర్నెన్స్ లను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.  వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఒక్క రూపాయి లంచం లేకుండా పనిచేయడం అన్నారు. అది  అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండదన్నారు. చంద్రబాబుకు  పేరు రావాలని పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ చేపట్టారున్నారు. చంద్రబాబు రాజోలు నుండి నీరు ఇస్తానని రూ.3000 కోట్ల విలువ చేసే హామీలు ఇచ్చారన్నారు. రాజోలుకి ఇచ్చే రూ.1000 కోట్లు లేనప్పుడు 80 వేల కోట్ల బనకచర్ల ఎలా పూర్తి చేస్తారని డి.ఎల్ ప్రశ్నించారు.  ప్రజలకు అవసరమైన పనులు ఏమీ జరగడం లేదన్నారు. అలగనూరు ప్రాజెక్టు గురించి ఒప్పుకుంటాము కానీ ముందు రాజోలి గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు. పోలవరం బనకచర్ల మరో కాళేశ్వరం అవుతుందన్నారు. రిజర్వాయర్లలో నీళ్లు పెడితే సరిపోదు ఆయకట్టు అభివృద్ధి చెందాలన్నారు. రిజర్వాయర్లు నిండితే మీ ప్రాంతంలో చెరువులకు నీటిని నింపుతామని జీవో ఇవ్వాలన్నారు. పారాసెటమాల్ కరువే.  నాకు తెలిసిన ఒక వ్యక్తి తాసిల్దార్ ఆఫీస్ కు ఓ పని కోసం వెళ్తే లక్ష యాభై వేల రూపాయలు లంచం అడిగితే అడ్వాన్స్ గా కొంత ఇచ్చాన్నారు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇంటి దగ్గర బల్బు పోతే అది పోయిందని చెప్పడం అని ఒక ఐఏఎస్ అధికారి అంటున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో పారాసిటమల్ మాత్ర లేక చనిపోయిన పరిస్థితి వుందన్నారు. పారాసిటమాల్ మాత్ర ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఓ వార్తా పత్రిక  చెప్పకనే చెపుతోందన్నారు. ఈ విషయం పై ప్రభుత్వానికి లేఖ రాశాను, మెయిల్ చేశా స్పందన లేదని డి.ఎల్ పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి గిరిజన ప్రాంతాల్లో తొంగి చూసిన పరిస్థితి కూడా లేదన్నారు. ఒక్క కొత్త పించన్ అయినా ఇచ్చారా! ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడ మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం కనీస పథకాలను అమలు చేయాలని డి.ఎల్ డిమాండ్ చేశారు. 44 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై ధర్నా చేద్దామనుకున్నానన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఊరిలో పెన్షన్ ఇవ్వడానికి వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. నాడు జగన్ కూడా అదే చేశారన్నారు.  గ్రీవెన్స్ సెల్ లో ఒక్క  సమస్య కూడా పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. అసలైన వికలాంగుల పెన్షన్లు తీసేసి అనర్హుల పెన్షన్లు కొనసాగిస్తున్నారని విమర్శించారు. పెన్షన్లు కొనసాగించేందుకు బ్రోకర్లు కూడా ఉన్నారున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలది తప్పా. . ప్రభుత్వానిది తప్పా.  ఓట్లు వేసిన ప్రజలది తప్పా ఆలోచించుకోవాలని కోరారు. ఓట్లు వేసిన పాపానికి ప్రజలు రోజు ఎందుకు ఏడవాలని ఆయన ప్రశ్నించారు.  అధికారపార్టీ లో వైసీపీ నేతలు చెలామణి  వైసిపి లో చలామణి అయిన నేతలు నేడు అధికార పార్టీలో చేర్చుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ఫ్యాక్స్ మిషన్ పెట్టి ఫిర్యాదులను పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదుని,మంచి పనులు చేస్తేనే ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యానని డి.ఎల్ పేర్కొన్నారు.  

జగన్‌కు సవాల్ విసిరిన బీటెక్ రవి

  జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు చూసే పులివెందుల ప్రజలు జగన్‌ను  చీ కొట్టారని, అని,అసెంబ్లీకి వెళ్ళని నీవు కూడా రాజీనామా చేయి నా భార్యతో జడ్పీటీసీకి రాజీనామా చేయిస్తా రెండు ఉపఎన్నికలు కేంద్ర బలగాల మధ్య నిర్వహిద్దాం ఎవరికి  బలం ఉందో తేల్చుకుందాం. అని, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, పులివెందుల నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జగన్‌కి సవాల్ విసిరారు.  బుధవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీటెక్ రవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వివేకా హత్య కేసును కోల్డ్ స్టోరేజ్ లో వేశారని అనుకుంటున్నారని, నిందితులు బెయిల్ పై బయట తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని,జగన్ చెల్లెలు సునీతా రెడ్డి న్యాయ పోరాటం చేస్తోందని దీనితో  కేసు పురోగతి దిశగా సాగుతోందన్నారు. అధికార బలముతో నాడు వైఎస్ జగన్ చెల్లీ సునీతపై  బావ రాజశేఖర్ రెడ్డిపై , సీబీఐ అధికారి రాంసింగ్ పైన కృష్ణారెడ్డి అనే వ్యక్తితో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసును పెట్టించిన కేసులగా భావించి సుప్రీం కోర్టు క్వాష్ చేయడం జరిగిందని అని బీటెక్ రవి  అన్నారు. సాక్షాలు తుడిపేసి కేసును తప్పు దోవ పట్టించడం వలనే విచారణ ఆలస్యం అవుతుందన్నారు. సీబీఐ కి గడువు ఇవ్వడం వలనే పూర్తి అయినట్టు నివేదిక ఇవ్వడం జరిగిందని దీని వెనుక పెద్ద కుట్ర దాగివుందన్నారు.  బెయిల్ పై ఉన్న వారిని కస్టోడియన్ విచారణ చేస్తేనే పలితం వస్తుందని సీబీఐ తరుపున లాయర్లు  కోర్టుకి తెలిపారన్నారు .ఈ కేసును కూలంకుషంగా పరిశీలిస్తే కథ అంతా మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి కారణమని కావున మరింత గడువు ఇచ్చి బెయిల్ రద్దుచేసి కస్టోడియన్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరారనీ దీన్ని బట్టి వివేక హత్య ఎవరు చేసారో ఎవరు నిందితులో అర్థమవుతోందన్నారు.  త్వరలో నిజా నిజాలు బయటకు వస్తాయన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల పైన, పులివెందులలో జడ్పిటిసి ఓడిపోతే రిగ్గింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారని, నాడు కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని టిడిపిని ఓడిస్తే ఏ విధంగా చేసినా గెలుపు గెలుపే అని నాడు చెప్పాడని అన్నారు .మరి నేడు ఆ మాటలకు మీరు ఏమి చెప్పగలరని ప్రశ్నించారు.  పులివెందుల లో ఎన్నికలు రెడీనా! నా భార్య చేత జెడ్పిటిసి కి రాజీనామా చేయిస్తానని అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలు తీర్చకుండా ఉన్న నీవు కూడా రాజీనామా చేయాలని రెండు ఉప ఎన్నికలను కేంద్ర బలగాల మధ్యనే నిర్వహిద్దాం ఎవరు బలం ఏమిటో తెలుస్తుందని అన్నారు. పులివెందులలో జగన్ అరాచకాలను చూసి ప్రజలు తాలలేక టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ల పర్యవేక్షణలో ఒక ప్రణాళిక బద్ధంగా మున్సిపాలిటీని టిడిపి కైవసం చేసుకుంటుంద న్నారు.

చిలకలూరిపేటలో స్థల వివాదం...విడదల రజిని మామపై ఫిర్యాదు

  పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన బూరుగపల్లి రామకృష్ణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ పట్టణ పరిధిలో 15వ బ్లాకులో 578.66 గజాల స్థలాన్ని 2012లో రిజిస్ట్రేషన్ నంబర్లు 8840/2012, 8657/2012 ద్వారా కొనుగోలు చేశాను. ఆస్తిలో భాగంగా 2014–2015లో బైరా శేషయ్య, మెట్టు శేషగిరిబాబు, గట్టా పూర్ణచంద్రరావుల వద్ద తనఖాగా పెట్టి అప్పు తీసుకున్నాను. అప్పు తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు అధిక వడ్డీ కోరారు.  ఆ వివాదం కారణంగా మాజీ మంత్రి విడదల రజిని మామ విడదల లక్ష్మీనారాయణ, గ్రంధి ఆంజనేయులు, తోట బ్రహ్మస్వాములు ప్రభావంతో తోట వెంకటరత్నం నాయుడు పేరుమీద 2016లో బలవంతంగా జనరల్ పవర్ అఫ్ అటార్నీ వ్రాయించారు. దీనికి సంబంధించిన ఎటువంటి చెల్లింపు తనకు జరగలేదు. పైగా పూర్ణచంద్రరావుకు ఇవ్వాలని చెప్పి రూ. 8 లక్షలు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు తన ఆస్తి హక్కులు తిరిగి రాలేదు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కిడారి శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం లేళ్లగరువు గ్రామానికి చెందిన పుప్పాల వెంకటేశ్వరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలో తమ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 722లో 34 సెంట్ల భూమి ఉంది. తమ బంధువులైన పుప్పాల నాగభూషణం, అతని కుమారుడు పుప్పాల హరికిరణ్ లకు తమ భూమిని కౌలుకు ఇచ్చాం. తమ తెలియకుండా వారు అధికారులతో కలిసి సర్వే చేయించుకోని భూమిని ఆన్‌లైన్‌లో ఇతరుల పేరుపై మార్చి మాస పద్మావతి పేరుతో విక్రయించారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావునా తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్ధించాడు.  చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమందా గ్రామానికి చెందిన ఎం. ఈశ్వరయ్య గ్రీవెన్స్ లో  అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్ 457/8లో 1.19 సెంట్లు భూమి ఉండగా, రీసర్వేలో 0.99 సెంట్లుగా చూపించారు. రీసర్వేలో తగ్గిన భూమిని ఎం. నాగరాజు వైసీపీ బూత్ ఎజెంట్ గా పనిచేస్తూ గత ప్రభుత్వంలో భూమిని కబ్జా చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా తమనే అడ్డుకుంటున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని  అభ్యర్ధించాడు.    తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం నెలటూరు గ్రామానికి ఈదర సావిత్రి గ్రీవెన్స్ లో  అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తాళ్ళూరి శ్రీనివాస్ అనే బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, అమ్మమ్మ అయినా తన సంరక్షణలో జీవిస్తున్నాడు. నెలటూరు గ్రామంలో తన మనవడికి సంబంధించి 110చ.గ. ఆస్తి ఉంది. తమ ఇల్లు ఎదురుగా భార్యభర్తలు అయినా తాళ్ళూరి రమేష్, తాళ్ళూరి సమంత ఉన్నారు. వీరు ప్రతి రోజు ఆస్తి అమ్మలాని వేధిస్తున్నారు. అమ్మకపోతే తమ మనవడిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రాణ భయంతో ఆ ఇంటికి తాళం వేసి చాగల్లులో నివాసం ఉంటున్నాం. వారిపై చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.  చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం మంగుంట గ్రామానికి చెందిన ఎన్. జనార్ధన్ రెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..మంగుంట గ్రామం నుండి దిగువ మంగుంట గ్రామానికి సుమారు రూ.70 లక్షలతో సిమెంట్ రోడ్డు, కల్వర్ట్, రివెట్‌మెంట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించగా, వైసీపీ జడ్పీటీసీ రమణ ప్రసాద్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రహదారిని తమ భూముల వరకు మాత్రమే వేసుకుని, దిగువ మంగుంట గ్రామానికి చేరకముందే సుమారు 50 అడుగుల దూరంలో రోడ్డు నిలిపివేశారు.  ఈ అంశంపై గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే గ్రామానికి ఇప్పటికే మూడు రోడ్లు ఉన్నాయి. 4వ రోడ్డు అవసరం లేదన్నారు. జడ్పీ ఫండ్స్ ద్వారా రోడ్డు వేసి తన కోడలు సర్పంచ్ బి.రూప ద్వారా గ్రామసభ ఆమోదం పొంది. తన భార్య టీ. సరస్వతి ద్వారా కాంట్రాక్టర్లలకు బిల్లులు వచ్చిన తర్వాత రోడ్డును నిలిపివేశారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదు. కావునా దీనిపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించాడు.

జగన్ మీడియాపై టీటీడీ చైర్మన్ పరువు నష్టం దావా

  టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో జగన్ మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై ఆ చానల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్‌ నోటీసులో తెలిపారు. తక్షణమే సదరు మీడియా టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో టీటీడీ చైర్మన్  మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను తొమ్మిది నెలల నుంచి పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తిరుమల కొండపై అన్న ప్రసాదం సుమారు రోజుకు రెండు లక్షల మంది సేవిస్తున్నారని వివరించారు. అన్న ప్రసాదంలో వడలాంటి కొత్త పదార్థాలను చేర్చామని వెల్లడించారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా అన్న ప్రసాదం సరఫరా జరుగుతోందని తెలిపారు. తిరుపతిలో స్థానికంగా ఉన్నవాళ్లకి నెలకు ఒకసారి శ్రీవారి దర్శనం గతంలో ఉండేదని.. మళ్లీ ఆ దర్శనాన్ని తాము పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు. టీటీడీలో అన్యమతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లని వేరే డిపార్ట్‌మెంట్‌కి పంపించామని.. కొంతమందికి వాలంటరీ రిటైర్ట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు బీఆర్ నాయుడు. టీటీడీలో అన్యమతస్థులపై ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమల కొండపైన క్యాంటీన్‌లను వైసీపీ నేతలు తీసుకొని మాఫియాలాగా చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవాణి దర్శనం సమయం మార్చామని.. ఉదయం నుంచి రాత్రి వరకు కాకుండా వెంటనే జరిగేలా చూశామని వెల్లడించారు. వీఐపీ దర్శన టైమింగ్ కూడా మార్చామని తద్వారా సామాన్యులకు దర్శనం సులువు అవుతుందని వివరించారు. అలిపిరి వద్ద భద్రత కొంత ఆలస్యం అవుతుందని.. వాటి కోసం కొత్త ఎక్విప్‌మెంట్ సమకూర్చుకుంటున్నామని చెప్పుకొచ్చారు. టీటీడీ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ల‌ను పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా టీటీడీ దేవాలయాలు ఉండాలని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవించామని గుర్తుచేశారు బీఆర్ నాయుడు. టీటీడీలో మత మార్పిడిని నివారించడానికి కృషి చేస్తున్నామని.. అందుకు కొత్త దేవాలయాలు నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రత్యేక పుస్తకాన్ని భక్తులకు ఇస్తున్నామని వెల్లడించారు. సిమ్స్‌లో 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. శ్రీవారి ప్రసాదం నాణ్యత కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాము ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్న కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  జగన్ మీడియా హిందూ మతం మీద దాడి చేస్తోందని ఫైర్ అయ్యారు బీఆర్ నాయుడు. జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఎప్పుడైనా తిరుపతికి వచ్చి శ్రీవారికి తలనీలాలు ఇచ్చారా..? వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిన్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ ధర్మం అంటే వారికి పడదని.. అందుకే దాడులు చేస్తున్నారని.. వారు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. తాము తప్పు చేస్తే చెప్పాలి కానీ ఇలా నిందలు వేయడం సరికాదని హితవు పలికారు.  మీరు ఎవరితో అయినా పెట్టుకోండి తనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. తన మీద దాడి చేయండి.. కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారం చేయొద్దని హితవు పలికారు. వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి అవినీతి సామ్రాట్, డెకాయిట్ అని ఆరోపించారు. రూ.1600 వందల కోట్లు టెండర్లు ఇచ్చి పది శాతం పర్సెంట్ తీసుకున్నారని బీఆర్ నాయుడు విమర్శించారు.

లేడీ డాన్ అరుణకు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు

లేడీ డాన్ అరుణకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నెల్లూరు కోర్టు నుంచి జైలుకు తరలించారు. తన ప్రియుడు, రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయడంలో చక్రం తిప్పిందన్న ఆరోపణలపై అరుణను పోలీసులు బుధవారం (ఆగస్టు 20)అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్టు చేస్తారని ముందుగానే ఊహించిన అరుణ హైదరాబాద్ కు పరారౌతుండగా ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద అదుపులోనికి తీసుకున్నారు.   ఈ సందర్భంగా అరుణ తన కారులో గంజాయి పెట్టి  తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉందంంటూ కారులోంచే సెల్పీలు తీసుకుంటూ  మీడియా, సోషల్ మీడియాకు విడుదల చేశారు. ఆ సందర్భంగా పోలీసులపై పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఆమెను పోలీసులు నెల్లూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.  

మేడారం జాతరకు రూ.150 కోట్లు విడుదల

  ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు పాటు ఈ జాతర జరగనుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది.  మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం  రూ.150 కోట్ల మంజూరు చేయడం, గిరిజనులపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని పేర్కొన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరను అత్యంత కన్నుల పండుగగా జరుపుకుంటారు. సమ్మక్క సారక్కను దర్శనం చేసుకునేందుకు కోట్లాది సంఖ్యలో భక్తులు మేడారంకి వెళతారు.  

మంత్రి కొండా సురేఖకు కల్వకుంట్ల కవిత బర్త్ డే విషెస్!

అమెరికా పర్యటనలో ఉన్నా కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో సంచలనాలను సృష్టించే విషయంలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ ఒక బొకే పంపిచారు. ఆ విషయాన్ని కొండా సురేఖ ధృవీకరిస్తూ కవితకు కృతజ్ణతలు తెలుపుతూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు షేర్ చేశారు. ఇప్పుడు ఈ విషయమే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. కారణమేంటంటే.. కొండా సురేఖ, కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. కొండా సురేఖ చేసిన విమర్శలపై కేటీఆర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో కోర్టు కొండా సురేఖను తప్పుపట్టింది కూడా. ఈ విషయంలో కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది కూడా.  ఇలా ఉండగా  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆమె సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్ని అంగీకరించే ప్రశక్తే లేదని కవిత కుండబద్దలు కొట్టారు. అన్నా చెళ్లెళ్ల మధ్య విభేదాలు పీక్స్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవితను కల్వకుంట్ల కుటుంబం దూరం పెడుతోందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత కొండా సురేఖకు బర్త్ డే విషెస్ తెలుపుతూ బొకే పంపించడం రాజకీయంగా ప్రాథాన్యత సంతరించుకుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా కవిత కేటీఆర్ వ్యతిరేకుంలందరినీ మిత్రులుగా భావిస్తున్నారా? అందులో భాగంగానే కొండా సురేఖకు బర్త్ డే విషెస్ తెలుపుతూ బొకే పంపారా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్‌‌ అరెస్ట్

  వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్‌‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దాసరి కిరణ్‌ను విజయవాడకు తరలించారు. కాగా ఈ సినిమాకు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ  దర్శకత్వం వహించారు. వైఎస్ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిస్థితుల్ని వ్యూహం మూవీలో ఆర్జీవీ చూపించారు గతంలో రామ్ గోపాల్ వర్మపై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యూహం మూవీ ట్రైలర్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను అవమానించినందుకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు టి.గంగాధర్ ఫిర్యాదు చేశారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాక మన దేశమంతా, శాంతి, భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న ‘వ్యూహం’మూవీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనా, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పైనా, నటులు అజ్మల్ అమీర్‌పైనా,నటి మానసా రాధాకృష్ణన్ పైనా, ఆ సినిమాలో నటించిన మొత్తం నటీ, నటుల పైనా,ఆ సినిమాకు పనిచేసిన 24 క్రఫ్ట్స్ సిబ్బంది మొత్తం పైనా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి తగు చర్యలు తీసుకొనమని పోలీసులను టి.గంగాధర్ కోరారు.   

ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 71 మంది సజీవ దహనం

  ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు, ట్రక్కును ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 17 మంది చిన్నారులతో సహా 71 మంది సజీవ దహనమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు  అధికారికంగా ధ్రువీకరించారు. ప్రావిన్షియల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ ఈ ఘటనపై స్పందించారు. హెరాత్‌లో బస్సు, ట్రక్కు, మోటార్‌సైకిల్ ఢీకొన్నాయన్నారు. ఈ దుర్ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోవడం, సమీపంలోని ప్రజలు భయాందోళనలకు గురవ్వడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఇరాన్ నుంచి తిరిగి వ‌స్తున్న‌ ఆఫ్ఘన్ వలసదారులని ప్రావిన్షియల్ అధికారి మహ్మద్ యూసుఫ్ సయీదీ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. ఇరాన్‌తో కీలక సరిహద్దు ప్రాంతమైన ఇస్లాం ఖాలాలో వీరంతా బస్సు ఎక్కి రాజధాని కాబూల్‌కు బయలుదేరారని ఆయన వివరించారు. స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘోరం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.

అమరావతి మునిగిపోతుంటే.. జగన్ ఎందుకు పర్యటించరు?

ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకోవడమే తప్ప.. ఆ ఆరోపణలకు రుజువులు చూపించాలన్న బాధ్యతను మాత్రం ఇసుమంతైనా పట్టించుకోరు  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ .  ఇక అమరావతి విషయంలో ఆయితే ఆయన వెళ్లగక్కే విద్వేషానికి, చేసే విమర్శలు, ఆరోపణలకు అంతే ఉండదు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని అనాథ రాష్ట్రంలా మార్చారు. మూడు రాజధానులంటూ కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చకుండా.. విశాఖలో రుషికొండకు బోడిగుండు కొట్టి మరీ ప్యాలెస్ నిర్మిచారు. 151 స్థానాలతో అధికారం చేజిక్కించుకున్న వైసీపీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి 11 స్థానాలతో కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా నోచుకోని విధంగా దిగజారిపోవడానికి అధికారంలో ఉండగా అనుసరించిన ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు.  నాడు అంటే 2014-19 మధ్య కాలంలో అమరావతికి జై కొట్టిన జగన్.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిని నిర్వీర్యం చేయడానికి చేయగలిగినంతా చేశారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను వేధించారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక అప్పటి ప్రతిపక్ష నేతపై అవమానక వ్యాఖ్యలు చేయించారు. అక్రమ కేసులో 52 రోజుల పాటు జైలుకు పంపారు.  సరే ఇవన్నీ పంటి బిగువున భరించి ఆగ్రహాన్ని పెదవి బిగింపులో దాచుకుని ఎన్నికల వేళ ప్రజలు తన సత్తా చాటి జగన్ కు ఘోరాతి ఘోరమైన పరాభవాన్ని, పరాజయాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణం జోరందుకుంది. అయితే జగన్, ఆయన పార్టీ నేతలూ మాత్రం అమరావతిపై విషం కక్కడం మానలేదు. తాజా వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఫేక్ వీడియోలతో సోంత మీడియా, సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. ఇక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాబాహుల్యంలో ఓ సందేహం వ్యక్తం అవుతున్నది. నిజంగానే అమరావతి మునిగిపోతుంటే.. అక్కడి ప్రజలకు అండగా నిలబడి పోరాడేందుకు తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటి జగన్ ఎందుకు పర్యటించడం లేదు అన్నదే ఆ సందేహం.  జగన్ అమరావతిలో ముంపునకు గురైన ప్రాంతాలు నిజంగా ఉంటే.. ఆయా ప్రాంతాలలో పర్యటించవచ్చు కదా.. గతంలో బుడమేరు వరద ముంపులో బెజవాడ చిక్కుకున్నప్పుడు పర్యటించారు కదా? ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నదేమిటి? అడ్డుకుంటున్నదెవరు?  ఇక్కడే జగన్ తీరు,  అమరావతిపై వైసీపీ చేస్తున్న విమర్శలు నమ్మశక్యంగా లేవని జనం అంటున్నారు. పరిశీలకులు కూడా అమరావతి ముంపు అంటూ వైసీపీయులు చేస్తున్న రాద్ధాంతం అసత్య ప్రచార మేనని విశ్లేషిస్తున్నారు. నిజంగా అమరావతిలో ముందు ప్రాంతాలు ఉన్నట్లైతే.. జగన్ కచ్చితంగా పర్యటించేవారనీ, కానీ ఇప్పుడు పర్యటిస్తే అమరావతిలో వరద ముంపు కాకుండా, నిటారుగా నిలబడిన నిర్మాణాలు కనిపిస్తాయనీ తెలుసుకనుకనే ఫేక్ ప్రచారాలను నమ్ముకుని జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.  

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష... రూ.6 లక్షల జరిమానా

  ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ముగ్గురు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పు నిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ   పీ. శ్రీనివాస్  పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.  పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 72/2017 కేసులో ఈ  ముద్దాయిలు తిరుపతి జిల్లా నాగపట్ల ఈస్ట్ బీట్ చామల రేంజి పరిధిలో అరెస్టయ్యారు. వీరు తమిళనాడు తిరువన్నామలై జిల్లా కు చెందిన 1.పి. మురుగన్, 2. ఎస్. సురేష్, 3 ఎం. చిన్నపయ్యన్, కాగా  వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు అతనిని  నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది.   ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులోని అతి విలువైన సహజ సంపద ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమంగా ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు ఎస్పీ  పీ. శ్రీనివాస్  తెలిపారు. నిందితులకు శిక్షలు పడేలా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని ఆయన  అభినందించారు.

ఇక 21 ఏళ్లకే అసెంబ్లీలోకి?

  రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త కామెంట్ చేశారు. అదేంటంటే గతంలో రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు వచ్చేలా చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం 21 ఏళ్లకే అసెంబ్లీలో అడుగు పెట్టేలా తాము చట్ట సవరణ చేయాలని భావిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి 18 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలను ఎంపిక చేసుకుంటున్నపుడు.. 21 ఏళ్లకు మాత్రం ఎందుకు ఎమ్మెల్యే కాకూడదని అన్నారు రేవంత్. ఇప్పటికి ఈ వయసు 25 ఏళ్లుగా ఉందని.. మీరంతా సమ్మతిస్తే తామీ నిర్ణయం తీసుకోవడం ఏమంత కష్టం కాదని అన్నారాయన. అయితే అలా జరగాలంటే, రాహుల్ గాంధీ పీఎం కావల్సి ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే మిగిలిన వన్నీ అలవోకగా జరిగిపోతాయని అన్నారు. రాజీవ్ గాంధీ ప్రేరణతో చట్ట సభల్లో యువరక్తం అడుగు పెట్టేలా తామంతా సిద్ధంగా ఉన్నామని.. కాంగ్రెస్ కి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయగలిగితే ఇదంతా సాధ్యమేన్నారు రేవంత్. ఓకే గానీ ఇదంతా చూస్తుంటే పెళ్లి వయసును తలపిస్తోందని అంటున్నారు. పెళ్లిలో 18 ఏళ్ల అమ్మాయి- 21 ఏళ్ల అబ్బాయిని అధికారికంగా అర్హమైన వయసుగా చెబుతుంటారు. ఇప్పుడు పద్దెనిమిదేళ్లకు ఓటు హక్కు, 21 ఏళ్లకు అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత రావడం ఒక రకంగా కొత్త రాజకీయం చూసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఇక బీజేపీకి మల్లే కాంగ్రెస్ లో కూడా 75 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి విరమణ తీసుకునే విధానం కూడా తెస్తే బావుంటుందని.. అప్పుడు ఆటోమేటిగ్గా.. రాజకీయాల్లో యువ రక్తం ప్రవేశిస్తుందని కామెంట్ చేస్తున్నారు కొందరు.