పెద్దిరెడ్డి కుటుంబాన్ని వైసీపీ వదిలేసిందా?
వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ జగన్ సర్కార్ లో అప్రకటిత నంబర్ 2 పొజిషన్ ను ఎంజాయ్ చేసిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పార్టీలో ఏకాకి అయిపోయారా అంటే పరిస్థితులను బట్టి చూస్తే ఔననే అనిపించక మానదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పార్టీలోనూ, జిల్లాలోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డిది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరు కావడంతో చిత్తూరు జిల్లాపై వైసీపీ ఆధిపత్యం కోసం జగన్ కూడా పెద్దిరెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.
చిత్తూరు ఎంత చంద్రబాబు సొంత జిల్లా అయినా.. తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం గతంలో ఎన్నడూ లేదు. 2014 ఎన్నికలను తీసుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా చిత్తూరు జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ 14 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఆరింటిలోనే విజయం సాధించగలిగింది. అదే 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుప్పం వినా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పరాజయం పాలైంది. అలాగే జిల్లాలోని చిత్తూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలలోనూ ఓడిపోయింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితిపూర్తిగా తిరగబడింది. ఆ ఎన్నికలలో వైసీపీ కేవలం రెండంటే రెండు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది.
వాస్తవానికి చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుల బలం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మిథున్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి వంటి బలమైన నాయకులు ఉన్నారు. అయితే అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో 2019, 2024 మధ్యా కాలంలో జిల్లాలో పార్టీ బలహీనపడటానికి వీరే కారకులయ్యారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య ధోరణి కారణంగా పార్టీకి చెందిన జిల్లా నాయకులంతా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు.
ఇక 2024లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసి.. కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని దయనీయ స్థతికి పతనమయ్యాకా.. చిత్తూరులో వైసీపీ ఉనికి మాత్రంగా మిగిలిపోయిందని చెపవచ్చు. సరే ఇదంతా పక్కన పెట్టి విషయానికి వస్తే.. మద్యం కుంభకోణంలో ఇరుక్కుని మిథున్ రెడ్డి జైలు పాలైన తరువాత జిల్లాకు చెందిన నాయకులెవరూ ఇంత వరకూ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన కోసం తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నినా ఎవరూ వెళ్లి పరామర్శించి పలకరించిన పాపాన పోలేదు. ఒకప్పుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టిన రోజా కూడా ఆ తరువాత కాలంలో పెద్దిరెడ్డితో విభేదాల కారణంగా మిథున్ రెడ్డిని పరామర్శించే ఆలోచన కూడా చేయడం లేదంటారు. ఇక జిల్లాలో మరో బలమైన నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా మద్యం కుంభకోణంలో జైలు పాలైన సంగతి తెలిసిందే. ఇక జిల్లాలోని ఇతర నాయకుల పరిస్థితి చూస్తుంటే.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను చూసి లోలోన ఆనందిస్తున్నారా అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టునకు వ్యతిరేకంగా తొలి రోజులలో జరిగిన నామమాత్రపు నిరసనలు వినా.. వైసీపీ నేతలు, కార్యకర్తలు అసలాయనను పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు.
ఇక మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి విషయానికి వస్తే ఆయన తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో తనకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదన్న ఆక్రోశాన్నీ, ఆగ్రహాన్నీ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిట్ ఆయనను విచారించినప్పుడు కూడా ఆయన మద్యం కుంభకోణం విషయంలో తనకు ఇసుమంతైనా సంబంధం లేదనీ, ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టి వ్యవహారమంతా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలే నడిపారని చెప్పినట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇక జిల్లాకే చెందిన మరో నాయకుడు భూమన కరుణాకరరెడ్డి విషయానికి వస్తే ఆయన తిరుపతి, టీటీడీ విషయాలు తప్ప మరేమీ పట్టించుకునే పరిస్థితులు లేవు.
ఇక ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గీయులు రోజా, భూమనల అరెస్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో మాజీ మంత్రి రోజా, టీడీఆర్ కుంభకోణంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిలు త్వరలోనే అరెస్టు కాకతప్పదని వైసీపీ వర్గాలే చెబుతుండటం.. చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎంతగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్ధమౌతుందని పరిశీలకులు అంటున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే.. మద్యం కుంభకోణం తన మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళనతో అసలు ఆ కుంభకోణంలో అరెస్టైన వారిని కనీసం పరామర్శించడానికి కూడా ఇష్టపడని పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. ఎలా చూసినా వైసీపీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని వదిలేసినట్లే కనిపిస్తోందని చెబుతున్నారు.