నిందితుడిని కఠినంగా శిక్షించాలని...సహస్ర పేరెంట్స్ డిమాండ్
posted on Aug 23, 2025 @ 4:51PM
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె పేరెంట్స్ ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి హత్య చేశాడని సరికాదన్నారు. ఈ క్రమంలోనే బంధువులు, స్థానికులతో కలిసి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్‌పల్లి నుంచి ఎర్రగడ్డ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు సహస్ర తండ్రి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. సహస్ర హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉంది. న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు మరోసారి దర్యాప్తు చేయాలి' అని సహస్ర తండ్రి కృష్ణ డిమాండ్ చేశారు. మరోవైపు ఒక్క బ్యాట్ కోసమే ఆ బాలికను హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. అయితే సహస్ర హత్యకు కారణమైన బ్యాట్‌ను పోలీసులు మీడియా ముందు ప్రదర్శించారు. ఇక ఆ బ్యాట్‌పై రెడ్ కలర్ గుర్తులో ఎంఆర్ఎఫ్ అని రాసి ఉంచారు. సహస్ర తమ్ముడు రెగ్యులర్‌గా ఈ బ్యాట్‌తో క్రికెట్ ఆడేవాడని, దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతోనే సహస్ర ఇంటికి దొంగతానికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలిందని సీపీ పేర్కొన్నారు.
కిచెన్‌లో ఉన్న బ్యాట్‌ను చోరీ చేసే క్రమంలో శబ్ధం రావడంతో.. సహస్ర అప్రమత్తమై ఎదురించింది. దీంతో ఆమెను బెడ్‌రూంలోకి తోసేసి కత్తితో 18 సార్లు పొడిచి మర్డర్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని. అయితే ఈ నేరాన్ని అంగీకరించేందుకు ముద్దాయి.. రకరకాల కట్టుకథలు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు అతని ఇంట్లో ఉన్న రక్తపు మరకలతో కూడిన బట్టలు, కత్తి అతన్ని పట్టించాయిని సీపీ అవినాష్ తెలిపారు.