ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎన్డీయే అభ్యర్థికి జగన్ మద్దతుపై చంద్రబాబు ఏమన్నారంటే?
posted on Aug 23, 2025 @ 10:54AM
ఉపరాష్ట్రపతి ఎన్నిక జాతీయ రాజకీయాల్లో ఊహించని సమీకరణాలకు, అనూహ్య పరిణామాలకూ తావిచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై పలు రకాల విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్, జగన్ తొడబుట్టిన సోదరి షర్మిల సహా పలువురు జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. రాజకీయంగా ఓ సిద్ధాంతమంటూ లేని పార్టీగా వైసీపీని అభివర్ణిస్తున్నారు. పార్టీ అధినేత స్వప్రయోజనాల పరిరక్షణ వినా వైసీపీకి మరో సిద్ధాంతం లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
జగన్ సోదరి షర్మిల అయితే ఒక అడుగు ముందుకు వేసి జగన్ ను ప్రధాని మోడీ దత్తపుత్రుడిగా పేర్కొన్నారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం పవన్ కల్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ విమర్శలు గుప్పించేవారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జగన్ ను ఆయన సోదరి షర్మిల మోడీ దత్తపుత్రులు అంటూ విమర్శలు గుప్పించారు. రహస్య ఒప్పందాలు, సీక్రెట్ డీల్సే జగన్ రాజకీయం అని దుమ్మెత్తి పోశారు.
ఆ విమర్శలు, వ్యాఖ్యలు పక్కన పెడితే.. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. తన వ్యాఖ్యలతో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. హస్తిన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై సునిశిత విమర్శలు చేశారు. నేరుగా జగన్ ను విమర్శించకుండానే ఆయన సిద్ధాంత రాహిత్యాన్నీ, అవకాశవాద రాజకీయాన్నీ ఎండగట్టారు.
మీడియా సమావేశంలో ఓ విలేకరి వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వడంపై అడిగిన ప్రశ్నకు చంద్రబాబు.. ఆ విషయం తనను కాదు జగన్ ను అడగాలని బదులిస్తూనే.. తెలుగుదేశం ఎన్డీయేలో కీలక భాగస్వామి. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటమి ఏకగ్రీవంగా రాథాకృష్ణన్ ను ఎంపిక చేసింది. అందుకే మరో మాటకు అవకాశం లేకుండా తమ పార్టీ ఆయనకు మద్దతు ప్రకటించిందని స్పష్టం చేశారు. ఈ ఒక్క మాటతో చంద్రబాబు జగన్ పార్టీ మద్దతు రాజకీయపరమైనది కాదని ఎండగట్టేశారు.
అదే సమయంలో జగన్ రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించడం పూర్తిగా వ్యక్తిగత అజెండా అనీ, అవకాశవాదమనీ చెప్పకనే చెప్పేశారు. జగన్ నిర్ణయం గురించి తాను మాట్లాడనని చెబుతూనే.. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కీలక భాగస్వామి అని, ఆ కూటమితో జగన్ కు కానీ వైసీపీకి కానీ ఎలాంటి సంబంధం లేదనీ చెప్పకనే చెప్పేశారు. తద్వారా జగన్ మద్దతు వెనుక ఆయన స్వార్థ ప్రయోజనం వినా మరో కారణం లేదని పరోక్షంగా తేల్చేశారు.