కన్ఫూజన్ లో కాంగ్రెస్.. తప్పులో కాలేసిందా?
పహల్గాం ఉగ్రదాడి మొదలు కాంగ్రెస్ పార్టీ ఆచారానికి భిన్నంగా ఆచి చూచి అడుగులు వేస్తూ వచ్చింది. వ్యూహతంకంగా పావులు కదిపింది. అక్కడ ఇక్కడ ఒకటి రెండు అపశ్రుతులు వినిచ్పించినా.. అందరిదీ ఒకటే మాట అన్నట్లుగా ప్రభుత్వానికి అండగా, ఒకే మాటపై నిలిచింది. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ, అనంతర పరిణామాల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించింది. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా కాంగ్రెస్ మద్డతు ఉంటుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు ప్రకటించారు.
నిజానికి పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచిన పాకిస్తాన్‌కు తగిన గుణ పాఠం చెప్పవలసిన సమయం ఆసన్నమైందని తీర్మానంలో పేర్కొంది. అలాగే.. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తీర్మానంలో పేర్కొంది. కేవలం తీర్మానం చేయడం మాత్రమే కాదు, ఆచరణలోనూ నిబద్దత చూపింది. 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పహల్గాం దాడి సంఘటనలో భద్రతా లోపాలు వంటి వైఫల్యాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ విజ్ఞత చూపింది. సమన్వయంతో వ్యవహరించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని అనుసరించాయి.
అంతవరకు అంతా బాగుంది. అయితే.. ఎప్పుడైతే కాల్పుల విరమణ అంశం తెరపైకి వచ్చిందో, అక్కడి నుంచి కథ అడ్డ తిరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అతి ఉత్సాహంతో చేసిన ప్రేలాపనలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పై విరుచుకు పడేందుకు అస్త్రాన్ని అందిచాయి. ఇక అక్కడి నుంచి కథ మారింది. కాంగ్రెస్ గొంతు సవరించుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించింది. ఇండియా కూటమి పార్టీలు అదే దారిలోకి వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర ఏమిటని నిలదీశాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో, భారత్-పాకిస్థాన్ దేశాలు తటస్థ ప్రదేశంలో విభిన్న అంశాలపై విస్తృత స్థాయి చర్చలకు అంగీకరించాయని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివరణ కోరారు. అలాగే.. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ఇచ్చిన హామీ, ఏమిటి, పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసేందుకు పాక్ అగీకరించిందా, అని ప్రశ్నించారు. ఒక విధంగా చూస్తే ప్రభుతాన్ని గట్టిగానే కార్నర్ చేశారు. ఇరకాటంలోకి నెట్టారు. అయితే.. ఓ వంక పార్టీలోని ఒక వర్గం, మోదీ ప్రభుత్వం పై ప్రశ్నలతో విరుచుకు పడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతోంది. అలాగే మరోవంక ముఖ్యనాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీ తప్పులో కాలేసిందని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణ అనంతరం మోదీ ప్రభుత్వం ఒక దాని వెంట ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్నచర్యలు కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. అలాగే.. కాల్పుల విరమణ విషయంలో మోదీ ప్రభుత్వం అమెరికా మధ్యవర్తిత్వాన్ని తప్పు పట్టడం కూడా,తప్పే అవుతుందని కాంగ్రెస్ లోని ఒక వర్గం నాయకులు పార్టీలోని కొందరు ముఖ్యనాయకులు పార్టీ స్టాండ్ ను తప్పు పడుతున్నారు. ఉభయ దేశాలూ అణ్వాయుధ దేశాలు అయినప్పుడు పట్టువిడుపులు అనివార్యమవుతాయని, అందుకే మోదీ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని సీనియర్ నాయకులు అంటున్నారు.
అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంగళవారం(మే12) ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి, ఆపరేషన్ సిందూర్ ద్వారా కొత్త లక్ష్మణ గీతను గీయడంతో పాటుగా, ఆ వెంటనే బుధవారం ( మే 13) అదంపూర్ ఎయిర్ ఫోర్సు బేస్ సందర్శన ద్వారా కొత్త సాధారణ స్థితి ని అండర్లైన్ చేయడం జరిగింది. మరోవంక ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఉన్నత స్థాయి సైనిక అధికారులు, వివిధ దేశాల సైనిక అధికారులకు వివరించడం, బీజేపీ దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర, ఇప్పడు తాజాగా మే 24 న ముఖ్యమంత్రులు అందరూ పాల్గొనే జాతీయ భద్రతా మండలి సమావేశం, ఆవెంటనే మే 25 న ఎన్డీఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం.. ఇలా ఒకదాని వెంట ఒకటిగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రధాని మోదీ, దేశంలో రాజకీయ చర్చను చాకచక్యంగా జాతీయ వాదం వైపుకు తీసుకు పోతున్నారని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణలో అమెరికా పాత్ర తదితర అంశాలను చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ లో హేతుబద్దత ఉన్నా, మోదీ వాక్ ధాటికి తట్టుకోవడం కష్టమవుతుందనీ.. ఒక విధంగా కాంగ్రెస్ డిమాండ్ బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.
ఈ అన్నిటినీ మించి కాంగ్రెస్ పార్టీలో ఆపరేషన్ సిందూర్ విషయంలోనే కాదు.. అందుకు సంబందించిన ఏ ఒక్క వివిషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. మల్లికార్జున ఖర్గే మొదలు శశి థరూర్ వరకు ఎవరికి తోచిన దారిలో వారు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరో మారు తప్పులో కాలేసిందనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్త మవుతున్నాయి.