హస్తినలో చంద్రబాబు, లోకేష్ హవా.. అడిగిందే తడవుగా కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్లు
posted on Aug 23, 2025 @ 12:23PM
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఎవరికైనా సరే ఢిల్లీలో కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ లు లభించడం అంత తేలికైన విషయం కాదు. ఇదేమీ రహస్యం కాదు. అందరికీ తెలిసిన విషయమే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ల కోసం ఎన్ని తిప్పలు పడ్డారో తలియంది కాదు. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి కూడా మోడీ అప్పాయింట్ మెంట్ లభించడం గగనంగా మారిన పరిస్థితులు చూశారు. గతానికీ, ఇప్పటికీ హస్తినలో కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్లు పొందడమనే విషయంలో పెద్ద మార్పేమీలేదు.
అదే కష్టం. అదే జాప్యం. అయితే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల విషయంలో మాత్రం లేదు. వారికి వెంటవెంటనే అప్పాయింట్ మెంట్లు దొరుకుతున్నాయి. ప్రధాని మోడీ అయితే లోకేష్ అడగకుండానే అప్పాయింట్ మెంట్ ఇస్తున్నారు. దీనిని బట్టే ఎన్డీయేలో తెలుగుదేశం ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటో అర్ధమౌతుంది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 15 నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనీసం 12 సార్లు హస్తినలో పర్యటించారు. ఆయా సందర్భాలలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తాజా హస్తిన పర్యటనలో కూడా చంద్రబాబు పలువురు కేందర్ మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై చర్చించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు నిదులు కేటాయించాలని కోరారు.
చంద్రబాబు తాజా పర్యటనకు కేవలం రెండుమూడు రోజుల మంత్రి ఏపీ మంత్రి నారా లోకేష్ హస్తినలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా లోకేష్ ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దంపడుతోందనడంలో సందేహం లేదు. ఈ ప్రాధాన్యత, ప్రాముఖ్యతకు ప్రధాన కారణం ఎన్డీయేలో తెలుగుదేశం పాత్ర అత్యంత కీలకం కావడమే. కేంద్రంలోని మోడీ సర్కార్ మనుగడకు తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యవసరయన్న సంగతి తెలిసిందే.