సురవరం సుధాకరరెడ్డి అస్తమయం
సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకరరెడ్డి శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. ఆయనకు భార్య డాకర్ బివి విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. ఆయన సతీమణి కూడా కమ్యూనిస్టు నాయకురాలే. ఏఐటీయూసీలో పని చేస్తున్నారు. సురవరం ఆరోగ్యం క్షీణించడంతో గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్ది సేపటికే సురవరం మరణవార్త తెలియడంతో కమ్యూనిస్టు నాయకులు, శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి. నరసింహ, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, పల్లా నర్సింహారెడ్డి, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ హుటాహూటిన ఆసుపత్రికి వెళ్లి సురవరం భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షనేత కేసీఆర్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు, సినీ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఒంగోలు నుంచి సంతాపం తెలియజేశారు.
సురవరం కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆయన తుది సంస్కారం ఆదివారం (ఆగస్టు 24)న జరగనుంది. సురవరం భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధంఆదింవారం ఉదయం పది గంటలకు మగ్ధుంభవన్ తరలిస్తారు. మధ్యాహ్నం అంతిమ యాత్ర జరగనుంది. అదే రోజు సాయంత్రం సురవరం పార్థీవ దేహాన్ని గాంధీ బోధానాసుపత్రికి అప్పగించనున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాన్‌రేవ్‌పల్లిలో 1942, మార్చి 25న జన్మించిన సురవరం సుధాకరరెడ్డికి తెలంగాణ వైతాళికుడు, గోల్కోండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి పెదనాన్న. సుధాకరరెడ్డి ప్రాథమిక విద్య కంచుపాడులో జరిగింది. ఆ తరువాత కర్నూలులోని కోల్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. కర్నూల్‌లోనే ఉస్మానియా డిగ్రీ కాలేజీలో బిఎ చదివారు. అదే సమయంలో ఆయనకు విద్యార్థి ఉద్యమాలతో సంబంధాలు ఏర్పడి, ఎఐఎస్‌ఎఫ్‌లో చేరారు. ఆయన హాస్టల్ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేశారు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు విశాలంధ్ర విలేకరిగా హైదరాబాద్‌కు వచ్చారు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి అడ్మిషన్ లభించింది. ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, అనంతరం కాలంలో ఎస్‌ఎఫ్, వైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో పని చేశారు. ఆ సమయంలోనే దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు కలకత్తా, ఢిల్లీ, లక్నో జైళ్లలో శిక్షలు అభవించారు. సురవరం సుధాకరరెడ్డి చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్.
రాష్ట్రానికి తిరిగి వచ్చి పార్టీ నిర్మాణంలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తూ కర్నూలు జిల్లా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో, మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకొత్త పల్లి మండలంలో, మెదక్ జిల్లా సంగారెడ్డిలో పాటియాల రాజా భూముల ఆక్రమణ పోరాటాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుదల వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన సమయంలో గుర్రాలతో తొక్కించడంతో గాయపడ్డారు. ఆయనపై ప్రభుత్వం పలు కేసులు బనాయించింది. అయినా ఎక్కడా వెరవలేదు. ప్రజా ఉద్యమాలలో మమేకమయ్యారు. సురవరం సుధాకరరెడ్డి ప్రాజెక్టుల కోసం పదిరోజులు పాదయాత్ర నిర్వహించారు. అలాగే విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగ్‌బాడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకవర్గ సభ్యుడిగా యువజన మాసపత్రిక, యూత్ లైఫ్ మాసపత్రిక, న్యూ జనరేషన్ వారపత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ దర్శిని ఎడిటోరియల్ బోర్డ్ సభ్యునిగా పనిచేశారు. 1995 ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి సహాయ కార్యదర్శిగా పనిచేశారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపిగా విజయం సాధించారు.
2004 యుపిఎ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల సంక్షేమ ముసాయిదా బిల్లును రూపొందించడంలో సురవరం సుధాకరరెడ్డి కీలక పాత్ర పోషించారు. అలాగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో భారత పార్ల మెంట్ తరుపున ప్రతినిధిగా వెళ్లారు. 2008 నుండి సిపిఐ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన సుధాకరరెడ్డి ఆ తరువాత 2012లో పాట్నాలో పార్టీ 21వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు. 2019 జులై 24న అనారోగ్యం కారణంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు.