తెలివి మీరిన ఎర్ర చందనం దొంగలు...ఎందుకంటే?
posted on Aug 23, 2025 @ 8:47PM
రకరకాల మార్గాల్లో అటవీ, టాస్క్ ఫోర్స్ పోలీసుల కన్నుగప్పి ఎర్రచందనాన్ని కొల్లగొట్టే ఎర్ర దొంగలు మరీ తెలివి మీరు పోతున్నారు .ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు ఒక దారిలో వెళుతూ మరో దారిలో ఎర్రచందనం తరలిపోతుందని వీరే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి వారిని డైవర్ట్ చేయడం, ఎర్రచందనాన్ని వివిధ రకాల సరుకులు,కూరగాయలు, ఇతర వస్తువుల మాటున పెట్టుకొని తరలించడం లాంటివి చూస్తుంటాం. అంతేకాదు వాహనాల నెంబర్లు మార్చి కూడా అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు.
ఇటీవల కొందరు మరీ తెలివి మీరిన పోయారు. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం వాహనాన్ని తీసుకొని ఆవాహంనంలో ఎర్రచందనాన్ని తరలించే ప్రయత్నం లో పట్టుబడ్డ ఉదంతం టాస్క్ఫోర్స్ పోలీసులను విస్మయానికి గురిచేసింది.సొంత వాహనాలు అయితే పట్టుపడితే కేసులు ఎదుర్కోవాలి ,బాడుగ వాహనాలు తెలిసి ఎవరు వారికి వచ్చేందుకు సాహసించరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొత్త ఐడియా తట్టిందేమో సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో వాహనాన్ని బాడుగకు తీసుకుని ఎర్రచందనం తరలించేందుకు సిద్ధమైన ఎర్రచందనం దుంగల వైనం ఒకటి వెలుగు చూసింది.
కడప ఫారెస్ట్ డివిజన్ సీకే దిన్నే మండలం పరిధిలోని అటవీప్రాంతంలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 26 ఎర్రచందనం దుంగలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని అందులో ఎర్రచందనం అక్రమ రవాణా చేయడం జరిగిందని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ ఎండీ షరీఫ్ నేతృత్వంలో కడప సబ్ కంట్రోల్ ఆర్ఎస్ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్ సీకే దిన్నే మండలం లోని మద్దిమడుగు ఫారెస్ట్ సెక్షన్ లో స్థానిక అటవీ సిబ్బంది షకీల్ అహ్మద్, నారాయణరెడ్డి తో కూంబింగ్ చేపట్టారు.
కొలుములపల్లి సమీపంలో కొంతమంది వ్యక్తులు ఒక కారు వద్ద కనిపించారు. వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకో గలిగారు. ఆ పరిసర ప్రాంతాల్లో వెతకగా 26 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని ఎర్రచందనం దుంగలు, కారుతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డిఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ వారిని విచారించగా ఆ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని వచ్చి అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కార్లు బాడుగకు ఇచ్చేముందు విచారించారు కోవాలి
కార్లు కిరాయికి ఇచ్చేముందు వారి పూర్తి వివరాలు తెలుసుకుని ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సూచించారు. ఆ కార్లను ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించే పక్షంలో కారు యజమాని కూడా భాధ్యుడు అవుతారని, వారిపై కూడా కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు.