భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్ అమలు ఎప్పటి నుంచంటే..?
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నదన్న ఒకే ఒక్క కారణంతో.. అమెరికా ఇండియాపై పగబట్టినట్లే ప్రవర్తిస్తోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు.. ఇంకొన్ని గంటల్లోనే అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి అమెరికా గవర్నమెంట్.. భారత్‌కు అధికారికంగా నోటీసులు పంపింది. ఆగస్ట్ 27 ఉదయం 10 గంటల నుంచి.. ఈ అదనపు టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఈ టైమ్ దాటిన తర్వాత నుంచి.. అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్‌లు వర్తిస్తాయి. ఈ మేరకు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ నోటీసుల్లో తెలిపింది. ప్రస్తుత్తం అదే వ్యాపార, వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది.
భారత్‌పై ఇప్పటికే.. అమెరికా 25 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవి.. అమల్లోకి వచ్చాయి. అయితే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో.. మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు ప్రెసిడెంట్ ట్రంప్. దాంతో కలిపి.. ఇండియాపై అమెరికా సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తే.. టెక్స్‌టైల్, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడుతుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతికొద్ది వస్తువులకే.. ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. ఇప్పటికే.. ఈ అదనపు టారిఫ్‌లపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది.. కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో.. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు.. ప్రధాని మోడీ కూడా ఈ సుంకాల విషయంలో స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో.. రాడీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో.. కేంద్రంపై ఒత్తిడి పెరిగినా.. భరిస్తామని స్పష్టం చేశారు.
ఈ అదనపు సుంకాల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రంప్ టారిఫ్‌ల వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దానిని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎగుమతి - ఆధారిత యూనిట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలవడంపై దృష్టి పెట్టనున్నారు.
సుంకాల వల్ల ప్రభావితమయ్యే కొన్ని పరిశ్రమలకు.. ప్రత్యేక మద్దతు అందించే విషయంపైనా చర్చ జరిగింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ లాంటి పథకాలని అమలు చేసే ప్రతిపాదనలపైనా చర్చించారు. 50 శాతం సుంకాలు.. భారతీయ ఎగుమతిదారుల మార్జిన్‌లని మరింత దెబ్బతీయడంతో పాటు సప్లై చైన్‌కి కూడా అంతరాయం కలిగిస్తుందనే వాదనలున్నాయి. టెక్స్‌టైల్, ఇతర ఉత్పత్తులు, కెమికల్స్ వరకు.. కీలక రంగాల్లో పోటీని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో.. ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంలో.. భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది.