రౌడీషీటర్ శ్రీకాంత్‌ను విశాఖ జైలుకు తరలింపు
posted on Aug 23, 2025 @ 2:52PM
రౌడీషీటర్ శ్రీకాంత్‌ను నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విశాఖకు తరలించారు. తన ప్రేయసి అరుణతో కలిసి దౌర్జన్యాలు, సెటిల్మెంట్లకు పాల్పడి జైలులో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అతడితో సంబంధాలున్న రౌడీల కోసం పోలీసులు విస్త్రృతంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతాకారణాల దృష్ట్యా అతడిని విశాఖకు తరలిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. రాజకీయ నేతల అండతో ప్రియురాలు అరుణతో కలిసి శ్రీకాంత్ దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. జైలులో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు.
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో వైసీపీ తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని, భవిష్యత్తులో ఎవరికీ పెరోల్ కోసం సిఫారసు లేఖలు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు. అతడికి పెరోల్ ఇవ్వాల్సిందిగా తానూ, ఎమ్మెల్యే పాశం సునీల్ సిఫార్సు లేఖలు ఇచ్చినప్పటికీ వాటిని హోంశాఖ పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.
శ్రీకాంత్‌కి వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా గతంలో సిఫార్సు లేఖలు ఇచ్చారు. వారిని నేను తప్పుబట్టడం లేదని.. ప్రజాప్రతినిధుల వద్దకి రకరకాల బాధల్లో ప్రజలు వస్తుంటారని అన్నారు. కానీ, జీవితంలో ఇకగా నేను ఎవరికీ పెరోల్‌కి సిఫార్సు లేఖ ఇవ్వనని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యో కోటంరెడ్డి సిఫార్సు లేఖ ఇచ్చిన 15 రోజులకు రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ బెయిల్ మంజూరు కావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఇది ఎలా జరిగిందనే దానిపై స్వయానా హోంశాఖ మంత్రి అనిత విచారణకి ఆదేశించారు.