యూరియా కొరత...రంగంలోకి మంత్రి తుమ్మల
posted on Aug 23, 2025 @ 4:04PM
తెలంగాణలో యూరియా కొరత నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగారు.. యూరియాను ఎప్పటికప్పుడు సరఫరా కేంద్రాలకు తరలించేలా అధికారులను మంత్రి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో లారీ అసోసియేషన్స్ మధ్య ఏర్పడిన పోటీతో యూరియా రవాణా నిలిచిపోవడంతో.. ట్రాన్స్‌పోర్ట్ సమస్యను స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తున్నారు మంత్రి తుమ్మల. రామగుండం యూరియా ఫ్యాక్టరీతోనూ మంత్రి నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు.
రామగుండం ఫ్యాక్టరీ ఎండీతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపా. కాగా, సాంకేతిక సమస్య కారణంగా రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉత్పత్తి ప్రారంభం అయితే యూరియా సమస్య కొంతైనా తీరే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతు పీఏసీఎస్ సెంటర్ మీద రాళ్లతో దాడి చేశారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో గళమెత్తారు. యూరియా సమస్యను పరిష్కరించాలంటూ.. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. కాంగ్రెస్ అగ్ర నేత్రి ప్రియాంక గాంధీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే బీఆర్ఎస్ ఎంపీలు కూడా యూరియా సమస్యను పరిష్కరించాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రి జేపీనడ్డాను కలిసి.. తెలంగాణలో యూరియా సమస్యను పరిష్కరించాలని కొరారు.