ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ : మంత్రి లోకేశ్
ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతు గత 14 నెలల్లో అమలు చేసిన సంస్కరణలు ఫలితాల దిశగా నడిపి బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదని అన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక సదుపాయలు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అమరావతిలో ఏడాదిలోగా లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్ తెలిపారు.
రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశాం, చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ.325కోట్లు విడుదల చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి, ఉత్తమమైన ప్రీస్కూల్ పాలసీని సిద్ధంచేయండి. నిర్ణీత క్యాలండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్ & స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించాలని మంత్రి తెలిపారు.
రాజమండ్రి గ్రంథాలయానికి రూ.87లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వ లైబ్రరీల్లోని పుస్తకాలతో ప్రిపేరైన 350మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు లభించాయి. లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలపై పెద్దఎత్తున క్యాంపెయిన్ నిర్వహించాలి. పోటీ పరీక్షలకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలు లైబ్రరీల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయ రామరాజు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి సిఎన్ దీవెన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరక్టర్ కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.