హస్తం నేతల నోట... ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతం
బీజేపీ మాతృ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ఆర్ఎస్ఎస్’ పై ఆయన కారాలు మిర్యాలు కాదు ఏకంగా నిప్పులే చెరుగుతారు. అంతే కాదు బీజేపీ, ఆర్ఎస్ఎస్’ లపై బహిరంగంగా యుద్దాన్నే ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంతమొందించే వరకు, తమ సైధాంతిక పోరాటం కొనసాగుతుందని కూడా రాహుల్ గాంధీ, పదే పదే చెపుతూవస్తున్నారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల సంధ్రభంగానూ, రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు,ఇది గెలుపు ఓటముల సంగ్రామం కాదు సైద్ధాంతిక పోరాటం’ గా పేర్కొంటున్నారు. నిజానికి, రాహుల్ గాంధీమ ఒకటి రెండుసార్లు కాదు, వందల సార్లు ‘ఐ హేట్ ఆర్ఎస్ఎస్’,అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా, రాహుల్ గాంధీ తమ వ్యతిరేకతను, ద్వేషాన్ని ఏ కొంచెం దాచుకోలేదు.
నిజానికి, రాహుల్ గాంధీని మీరు బీజీపీ, మోదీలను ఎక్కువ వ్యతిరేకిస్తారా? ఆర్ఎస్ఎస్’ను ఎక్కువ వ్యతిరేకిస్తారా అంటే అనుమానం లేకుండా, ఆయన నోటి నుంచి ఆర్ఎస్ఎస్’ అనే సమాధానమే వస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఆయన, బీజేపీ, ఆర్ఎస్ఎస్’లతో పాటుగా దేశం పైన, సనాతన ధర్మపై కూడా ద్వేషాన్ని పెంచుకున్నారు. అందుకే, ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా,రాహుల్ గాంధీ భగ్గుమంటారు, వంద ఓటములకు అయినా సిద్ధమే కానీ,ఆర్ఎస్ఎస్’ భావజాలంపై యుద్ధం మాత్రం ఆగదని అంటారు.
కొద్ది రోజుల క్రితం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సందీప్ దీక్షిత్’ (ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు)తో జరిపిన సంభాషణలోనూ రాహుల్ గాంధీ అదే చెప్పారు. అంతే కాదు, ఆర్ఎస్ఎస్ పట్ల తమకున్న వ్యతిరేకత తమ జీన్స్’ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. అవును..‘మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కలలో కనిపిస్తే,,మీరు ఆయన్ని ఏమి అడుగుతారు? అని సందీప్ దీక్షిత్’ సరదాగా అడిగిన ప్రశ్నను రాహుల్ గాంధీ చాలా సీరియస్’గా తీసుకున్నారు. తాను (రాహుల్) అడిగే ప్రశ్నతో పాటుగా నెహ్రూ చెప్పే సమాధానం కూడా చెప్పారు.
మా ముత్తాత నెహ్రూ కలలో కనిపిస్తే.. ‘నేను జీవితంలో ఎప్పటికీ ఏది చేయకూడదో చెప్పమని అడుగుతానని’సమాధానం ఇచ్చారు .అంతే కాదు, ఆవెంటనే, తన ప్రశ్నకు నెహ్రూ .. ఇచ్చిన సమాధానం కూడా చెప్పనా? అంటూ,’, ఆర్ఎస్ఎస్’తో ఎప్పుడు రాజీ పడద్దు’ అని నెహ్రూ చెప్పారని రాహుల్ చెప్పారు. ఈ సభాషణను గమనిస్తే, రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత వెనక జన్మజన్మల వైరం ఏదో ఉందని పిస్తుంది. అలాగే,ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, ద్వేషం ఏస్థాయిలో వుందో, ఆ ద్వేషం మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా స్పష్టంగా, అర్థం అవుతుంది.
అంతే కాదు, కొంతకాలం క్రితం గుజరాత్’ లో పర్యటించిన సందర్భంగాను రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌లోని ఒక వర్గం, బీజేపీ,ఆర్ఎస్ఎస్ లతో కుమ్ముక్కైందని, అలాంటి వారిని ఏరి వేస్తామని హెచ్చరించారు.
అంటే రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్’ ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో వేరే చెప్పనక్కర లేదు. అయినా, కొన్ని నెలల క్రితం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ కార్యకర్తలు,ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అడుగుజాడల్లో నడవాలని పిలుపు నిచ్చారు.
అదలా ఉంటే ఇప్పుడు, పొరుగు రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్’లోని ఒక వర్గం ఆర్ఎస్ఎస్’ భావజాలం పట్ల ఆకర్షితులు అవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏకంగా అసెంబ్లీలో, ఆర్ఎస్ఎస్’ ప్రార్ధన గీతం ( నమస్తే సదా వత్సలే మాతృ భూమే..) ఆలపించారు.అంతే కాకుండా, ఆర్ఎస్ఎస్ పనితీరును అధ్యయనం చేస్తున్నానని, ఆర్ఎస్ఎస్ నడుపుతున్న పాఠశాలలు బాగున్నాయని, మెచ్చుకున్నారు.
అదలా ఉంటే తాజగా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్’డి రంగనాథన్’ తమ సొంత నియోజక వర్గం తునుకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో,డీకే అడుగుజాడల్లో ఆర్ఎస్ఎస్, ప్రార్థన గీతాన్ని అలపించడమే కాకుండా, అర్థ తాత్పర్యాయాలను, విడమరిచి చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రార్ధనా గీతంలో తనకు తప్పేమీ కనిపించలేదని, జన్మ భూమికి వందనం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇక ఆర్ఎస్ఎస్’ బడిలో, టీడీపీ కాలేజీలో, చదువుకుని, కాంగ్రెస్ పార్టీలో కొలువు చేస్తున్నాని స్వయంగా చెప్పుకున్న రేవంత్ రెడ్డి గురించి వేరే చెప్పనక్కర లేదు.
అయితే,ఆర్ఎస్ఎస్’ భావజాలం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న వ్యతిరేకత తెలిసి కూడా మీనాక్షి నటరాజాన్ మొదలు,డీకే శివకుమార్ వరకు, డీకే మొదలు,కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథన్’వరకు కాంగ్రెస్’ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు మొగ్గు చూపడం లేదా లేదా కొంత సానుకూలంగా స్పందించడం దేనికి సంకేతం ? అన్నిటిని మించి ఈ ఇంటి మీద వాలిన కాకి ఆ ఇంటి మీద వాలరాదన్నట్లుగా ఆర్ఎస్ఎస్’ ద్వేషించే కాంగ్రెస్ సుప్రీం బాస్ రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారు, అనేది మరింత ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.