అభ్యర్థులు ఎంపికే అగ్నిపరీక్ష అన్ని పార్టీలదీ అదే స్ధితి
బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి అధికార కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడుతుందా? ఆ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా, అంటే సమాధానం చెప్పడం కష్టం. కానీ, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్’ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక మాత్రం ఖాయంగా జరిగి తీరుతుంది.
అది కూడా రెండు మూడు నెలల్లోనే జరుగుతుంది. నిజానికి, కేంద్ర ఎన్నికల సంఘం,ఓటర్ల జాబితా సవరణతో ఉప ఎన్నిక కసరత్తుకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జూబ్లీ హిల్స్’ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల దశదిశను నిర్దేశిస్తాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అలాగే, ఎవరి కారణాలు వారికి ఉన్నా జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక నుంచే మూడు ప్రధాన పార్టీలకు, ముగ్గురు ముఖ్య నేతలకు అగ్ని పరీక్ష కానున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా,అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఘోర పరాజయంతో పాటుగా, ఇప్పటికే జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్’కు మరీ ముఖ్యంగా, పార్టీ పగ్గాలను తమ గుప్పిట్లోకి తీసుకున్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీ రామరామా రావు (కేటీఆర్’) కు జూబ్లీ ఉప ఎన్నిక అగ్ని పరీక్షే అంటున్నారు.
వరస ఓటములతో పాటుగా, బజారుకు ఎక్కిన కుటుంబ కలహాలతో సతమతమవుతున్న, గులాబీ పార్టీ, మరో సిట్టింగ్ స్థానంలో ఓటమి ఎదురైతే, పార్టీ భవిష్యత్’ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరో వంక, ప్రత్యర్ధుల విషయం ఎలా ఉన్నా, కేటీఆర్’ నాయకత్వాన్ని ఇప్పటికే డిస్కార్డ్’ చేసి తిరుగుబాటు జెండా ఎగరేసిన సోదరి కవిత’ అన్నకు వ్యతిరేకంగా మరింతగా విజృంభించడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.నిజానికి., కవిత అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, సో.. అవకాశం వస్తే .. ఆమె తగ్గేదేలే ..అన్నట్లు రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు.
అలాగే, కారణాలు ఏవైనా, పార్టీ అధినేత కేసీఆర్’ క్రియాశీల రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉంటున్నారు. సో .. జూబ్లీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’ కు అగ్ని పరీక్ష కానుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అదలా ఉంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజరినా, బీఆర్ఎస్’ హైదరాబాద్ నగరంలో తిరుగులేని ఆధిక్యతను నిలబెట్టుకుంది.అయితే,ఇప్పడు ఆ పరిస్థతి కనిపించడం లేదని అంటున్నారు.ముఖ్యంగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్’కు అండగా నిలిచిన ఎంఐఎం’ ఇప్పడు కాంగ్రెస్ పక్షాన చేరింది.
అలాగే, 2022 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 కి 44 డివిజన్లలో విజయ సాధించి, ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానం సొంతం చేసుకున్న కారు పార్టీ కథ, అసెంబ్లీ ఓటమితో పాటుగా తిరగబడింది. మేయర్, మాజీ మేయర్ సహా కారు పార్టీ కార్పొరేటర్లు’ చాలా వరకు అధికార పార్టీ గూటికి చేరి పోయారు. మరోవంక దానం నాగేందర్ సహా కొందరు నగర ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. సో.. జూబ్లీ సీటు నిలుపుకోవడం బీఆర్ఎస్’ కు అంత తేలికైన వ్యవహారం కాదని, పరిశీలకులు భావిస్తున్నారు.
అందుకే .. జూబ్లీ ఉప ఎన్నిక కారు పార్టీకి ..అంతకంటే ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు అగ్ని పరీక్ష కానుందని పరిశీలకులు అంటున్నారు. ఇక అధికార కాంగ్రెస్’ పార్టీ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీ ఉపఎన్నిక సవాలు కానుందని అంటున్నారు.కంటోన్మెంట్ సీటుకు సొంత చేసుకున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీ సీటును కూడా కైవసం చేసుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాకర్షక నేతగా తమ స్థానాన్ని, పదిల పరచు కుంటారు.
కానీ, ఓటమి ఎదురైతే మాత్రం, ఆయన ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చినట్లు అవుతందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, అధికార పార్టీగా కాంగ్రెస్’ పార్టీకిగెలుపు అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి,అయితే, అభ్యర్ధి ఎంపిక విషయంలో పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్లు చెపుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ క్రికెటర్’ అజారుద్దీన్’ పేరు మరో మారు ప్రముఖంగా వినిపిస్తున్నారు.
బీసీ నామ జపం చేస్తూ ముస్లింకు టికెట్ ఇస్తే, హిందూ ఓటు పోలరైజ్’ అయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా,బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున నేపధ్యంలో, అజారుద్దీన్’కు మరో ఛాన్స్’ ఇవ్వడమా, బీసీ అభ్యర్ధిని బరిలో దింపడమా , సెలబ్రిటీని పోటీ చేయించాలా అనే విషయంలో హస్తం పార్టీ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకు కూడా ఇది తొలి పరీక్ష కాగలదని అంటున్నారు.