టీడీపీ ఎమ్మెల్యేల అతి.. బాబు ఆగ్రహం!
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతుంటారు. అధినేత చంద్రబాబు కనుసైగలతో పార్టీ నడుస్తుంటుంది. అందరిదీ ఒకే లైన్. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి లైన్ వారిదే అన్నట్లుగా కొందరు తెలుగదేశం మ్మెల్యేలు వ్యవహరిస్తుండడం టీడీపీ హైకమాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నా సమస్యలు వస్తాయనడానికి ఇదే ఎగ్జాంపుల్ కావొచ్చు. గత ఎన్నికల్లో తెలుగుదేశం 144 సీట్లలో పోటీ చేస్తే 135 స్థానాలలో గెలిచింది. అంత పెద్ద స్ట్రైక్ రేట్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అయితే ఇంతమందిని మెయింటేన్ చేయడం వీలు కావట్లేదా? లేదంటే భారీ మెజార్టీ ఉందన్న ధీమా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోందా? ఓవైపు కూటమి ఇమేజ్ ను పెంచడం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పని చేస్తున్నారు. ఇంకోవైపు డ్యామేజ్ చేయడంలో టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకువెళ్తున్నారన్న చర్చ జరుగుతోంది. దారి తప్పుతున్న వారందరికీ సెట్ రైట్ చేసే ప్రోగ్రామింగ్ ను సీఎం చంద్రబాబు రెడీ చేయాల్సిన టైం వచ్చేసిందా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది.
శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి. పార్టీలో ఈయన సీనియర్ లీడర్. మొన్నటిదాకా పెద్దగా వివాదాల జోలికి వెళ్లని బుడ్డా లేటెస్ట్ గా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న తన అనుమతి లేకుండా తన సెగ్మెంట్ లో కార్యక్రమాలు నిర్వహించారంటూ పార్టీ ఎంపీ శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విషయంలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొందరు అనుచరులు ఏరాసు ఇంటిపై దాడి కూడా చేశారు. ఆ పంచాయితీ చంద్రబాబు దగ్గరకు చేరింది. అది చల్లారక ముందే లేటెస్ట్ గా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ లో అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా చేయి చేసుకోవడం పెను వివాదంగా మారింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమే అని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నట్లుగానే కేసు ఫైల్ అయింది.
ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. గొడవేంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడారన్నది అభియోగం. 3 నిమిషాల 8 సెకన్లు ఉన్న ఆడియో రికార్డింగ్ చుట్టూ ఏపీలో పెను దుమారమే చెలరేగింది. వార్ 2 సినిమా బెనిఫిట్ షోలకు అనంతపురంలో పర్మిషన్లు లేవని, ఆపించేస్తున్ననట్లు ఎమ్మెల్యే చెప్పడం, పర్మిషన్లు ఉన్నాయని ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడు అంటున్నట్టు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యంతరకర కామెంట్స్ చేసినట్లు ఆ ఆడియోలో వినిపించింది. అంతే ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టి, ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించేశారు. ఇది అనంతపురానికే పరిమితం కాలేదు. విజయవాడ, తిరుపతి, నెల్లూరుకూ పాకింది. దీనిపై రియాక్ట్ అయిన దగ్గుపాటి, ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని, ఏఐ అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఫేక్ ఆడియో సృష్టించారని వాదించారు. తాను నందమూరి, నారా కుటుంబాల అభిమానినని, ఎన్టీఆర్ అభిమానుల భావోద్వేగాలను గాయపరిచినట్లయితే క్షమాపణలు చెబుతున్నానని వీడియో రిలీజ్ చేశారు. అయినా సరే అభిమానుల ఆగ్రహం తగ్గలేదు.
నిజానికి అనంతపురం అర్బన్ లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో దగ్గుపాటి ప్రసాద్ కు చాలా కాలంగా అంతర్గత విబేధాలు ఉన్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం గతంలోనూ జరిగాయి. దమ్ముంటే రాజీనామా చేసి రా... ఎవరు గెలుస్తారో చూద్దాం అని ప్రభాకర్ చౌదరి ఇప్పటికే సవాల్ చేశారు. ఇన్ని గొడవల మధ్యలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై ఆడియో ఇష్యూ ప్రసాద్ మెడకు చుట్టుకుంది. ఈ మ్యాటర్ అటు పార్టీ పరంగా, సామాజికపరంగా సున్నితమైంది కావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు కూడా. లేనిపోని వివాదాలు ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారని చివాట్లు పెట్టారంట.
ఇక ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్ కు అర్ధరాత్రి వీడియో కాల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో కాల్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. అయితే కూన రవికుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను అర్ధరాత్రి కాల్ చేయలేదని, ఆ కాల్‌లో ప్రిన్సిపాల్‌తో పాటు మరికొందరు ఉన్నారని, తనపై అసత్య ప్రచారం జరుగుతోందని వాదించారు. పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ ఎపిసోడ్ కూడా రకరకాల మలుపులు తిరుగుతోంది.
గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడిన సీన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి మార్ఫింగ్ వీడియోలు అని క్లారిటీ ఇచ్చుకున్నా.. ఈ ఘటనపై విమర్శలు రావడంతో టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అటు నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో కీ రోల్ పోషించారన్న మ్యాటర్ లో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత, మరో ఎమ్మెల్యే ఇరుక్కున్నారు. తన తప్పేమీ లేదని ఒకరు వివరణ ఇచ్చుకుంటే మరో ఎమ్మెల్యే చుట్టూ హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఒక్కరూ మాట్లాడడం లేదు. సో ఈ ఘటనలు ఏపీలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యేల వ్యక్తిగత వివాదాలు కాస్తా పార్టీకి మైనస్ గా మారే పరిస్థితులు తీసుకొచ్చాయి.
ఈ విషయంపై పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ అయ్యింది. గురువారం (ఆగస్టు 21) కేబినెట్ భేటీకి కొద్ది ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి మరీ వారి పట్ల ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే హోంమంత్రి అనితను పెరోల్ ఆర్డర్లపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని కూడా సున్నితంగా మందలించారు. మరో వైపు పార్టీ ఇన్ చార్జ్ ల తీరు కూడా కొండకచో వివాదంగా మారుతోంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అతి చేస్తున్నారన్న విషయంలో పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవన్న హెచ్చరికలూ చేసింది.