బైరెడ్డి.. ఇంట్లోనే దీక్ష.. ఎన్నిరోజులు బంధిస్తారు?

  రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తలపెట్టిన రైతు  రైతు బతుకు దెరువు యాత్రను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భాగంగా కర్నూలు జిల్లా తంగడంచ మండలంలో పరిశ్రమల కోసం భూసేకరణకు పూనుకుంది. అయితే దీనికి వ్యతిరేకంగా బెరైడ్డి తగడంచ నుంచి కర్నూలు వరకు ఈ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పాదయాత్రకు అధికారుల అనుమతి లేదని ముందుగానే అతనిని గృహనిర్బంధం చేశారు. అయితే పోలీసులు బైరెడ్డిని గృహనిర్భందం చేయడంతో ఆయన ఇంటి వద్దనే తన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతకాలం ఇలా నన్ను ఇంటిలో బంధిస్తారు.. ఏ రోజైనా బయటకు వస్తానని అప్పుడు మళ్లీ పాదయాత్ర నిర్వహిస్తానని అన్నారు. ప్రభుత్వ ఈ రకంగా రైతుల మీద తమ వ్యతిరేకతని చూపించిందని.. వారి భూములు తీసుకొని వారి పొట్టలు కొట్టొద్దని చెప్పారు. ఇప్పటికైనా భూ సేకరణను ఆలోచన మానుకొని దానిని ఆపేస్తే తాను కూడా పాదయాత్రను విరమించుకుంటానని, లేకపోతే పాదయాత్ర ఒక్కటే కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపడతామని హెచ్చరించారు.

భిక్షాటన చేసిన ఎంపీ..

  రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని పలువురు విమర్సలు చేస్తున్నారు.  దీనికి తోడు ఇప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా తోడైనాయి. రైతల ఆత్మహత్యలు చేసుకోవడమేమోకాని వారివల్ల ప్రతిపక్షాలకు మాత్రం అధికార పార్టీమీద విమర్శలు చేయడానికి మంచి పాయింట్ దొరికింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదోలా తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సైలెంట్ గా ఉంటే వర్కవుట్ కాదకున్నారేమే కాని ఈమధ్య బాగానే మీడియా సమావేశాలు గట్రా పెట్టి.. ఏదో కారణంతో ప్రతిపక్ష నేతలను నాలుగు తిట్లు తిడుతూ ఫోకస్ అవుతున్నారు.  అలాంటిది ఇప్పుడు రైతుల ఆత్మహత్యలను అంత తేలికగా వదిలిపెడతారా.. మంచి పాయింట్ దొరికింది కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్లు అధికార ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందరూ ఒకేలా చేస్తే ఏం బావుంటుంది అని అనుకున్నారేమో ఎంపీ రాపోలు ఆనందభాస్కర్.. రాజకీయాల్లో తన విలక్షణ పోకడను కనబరిచారు. తెలంగాణ లోని భూదాన్ పోచంపల్లిలో ఒక చేనేత కార్మికుడు పగడాల నగేష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆనందభాస్కర్ ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన ఆర్థిక సాయం చేయడానికి ఎంపీ రాపోలు ఆ గ్రామంలో భిక్షమెత్తారు. అలా భిక్షాటన చేయగా వచ్చిన రూ. 50వేల రూపాయలను నగేష్ కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన చెప్పారు. మొత్తానికి కాంగ్రెస్ నేతలు రైతు ఆత్మహత్యల వల్ల ఎవరికి నచ్చినట్టు వాళ్ల పోకడను చూపిస్తున్నారు.

పవన్ పొలిటికల్ టూర్.. మూహూర్తం ఖరారు..!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర్రపదేశ్ పర్యటనలో భాగంగా ప్రజల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రరాష్ట్రంలో పర్యటనకు గాను ఆయన మూహూర్తం కూడా ఖరారు చేశారని.. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పర్యటనలో శ్రీకాకుళం నుండి తన పర్యటనను ప్రారంభిస్తారని.. ఈ పర్యటనలో ఆయన ప్రజలు బాధపడుతున్న అనేక అంశాలపై వారితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ భూసేకరణ అంశంపై ప్రభుత్వంపై పోరాడి వారి తీసుకున్న నిర్ణయాన్నే వెనక్కితీసుకునేలా చేశారు. ఒక రకంగా దీనివల్ల పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో కొంత నమ్మకం ఏర్పడిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా బీజేపీ టీడీపీ మిత్రపక్షాలని అందరికీ తెలిసిందే. ఈ పార్టీలకి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలికారు. అయితే ఇప్పుడు టీడీపీ సంగతమే కాని పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని.. పవన్ కళ్యాణ్ మద్దతు ద్వారా ఎపిలో పాగా వేయాలని బిజెపి చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో లేదో చూడాలి.

సైకో సూదిగాడిలా జగన్

  ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఈ మధ్య అందరికి ఇంజక్షన్ ఇస్తూ గుబులు పుట్టిస్తున్న సైకో సూదిగాడితో వైఎస్ జగన్ ను పోల్చి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన లారీ ప్రమాదంలో గాయపడిన కురందాసు రాజును పరామర్శించడానికి వెళ్లి జరిగిన ప్రమాదం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. అతను పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో సూదిగాళ్ల సమస్య ఎక్కవైందని.. జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఓ పెద్ద సైకో సూదిగాడిగా తయారయ్యాడని.. ఎక్కడ ఎప్పుడు గుచ్చుతాడో తెలియడం లేదని.. అతని మానసిక పరిస్థితి బాలేదని ఉమా ఎద్దేవ చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులు ఏమి జగన్ కు కనపడవని.. ప్రతి విషయాన్ని విమర్శించమంటే మాత్రం ముందుంటారని అన్నారు.

టీడీపీ, బీజేపీ.. కలిసుండలేమంటున్న నేతలు

  టీడీపీ, బీజేపీ పార్టీలు రెండూ మిత్రపక్షాలని అందరికి తెలిసిందే. ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలైనప్పటికీ అప్పుడప్పుడూ తమ విభేదాలను మాత్రం బయటపెడుతూనే ఉంటారు. ఏదో కేంద్రం ఒకపక్క.. చంద్రబాబు మరోపక్క ఉంటున్నారు కాబట్టి నేతలు ఒకరిపై ఒకరికి ఎంత కోపమున్నా వాటిని మనసులో దాచుకుంటూ కాలం నెట్టుకొస్తున్నారు. అయితే పశ్చిమగోదావరిలో జరిగిన సంఘటనతో ఇది పైపైన నేతలు చేస్తున్న మెరుపులే అని స్వచ్ఛంగా అర్ధమయింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ, టీడీపీ నేతలు మధ్య గొడవ రాజుకుంది. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ ముదిరి ఇరు పార్టీల సభ్యలు వాదులాడుకున్నారు. దీంతో గూడెం మున్సిపల్ ఛైర్మన్.. ఇక బీజేపీతో కలిసి ఉండలేమని చెప్పేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అన్యాయ చేస్తోందంటూ బీజేపీ... బీజేపీ అన్యాయ చేస్తోందంటూ టీడీపీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారట. ఒకమెట్టెక్కి ఇక కలిసుండేది లేదని కూడా అనుకున్నారు. మొత్తానికి ఈరకంగా ఇరు పార్టీనేతలు తమ కోపమంతా కక్కేసుకుంటూ నిజాన్ని మాత్రం వెళ్లగక్కారు.

అది చంద్రబాబుకు మంచి వార్తనే

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో రాష్ట్ర నూతన పర్యాటక విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని.. దీనికి సంబంధించి వివిధ ప్యాకేజీలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా దీనిని రూపొందించామని తెలిపారు. ఈ నూతన పర్యాటక విధానం ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. అంతేకాదు పంచంలోనే అత్యంత ధనవంతమైన, పవర్ ఫుల్ గాడ్ శ్రీవారు అని.. వెంకటేశ్వర స్వామి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని.. ఆయనకు రూ.10,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆక్కడ ఉన్నవారిని నవ్వించారు. కాగా ఆంధ్రప్రదేశ్ కు అరుదైన ఘనత లభించింది. ఏంటంటే ప్రపంచ బ్యాంకు తాజాగా ఒక ప్రకటన చేసింది. వ్యాపార అనుకూల వాతావరణ రాష్ట్రాలను జాబితాలో గుజరాత్‌కు తొలి స్థానం లభించగా ఏపీకి రెండో స్థానం దక్కింది. మొత్తానికి ఇది చంద్రబాబుకు తీపి కబురు లాంటిదే.

ఫిటింగ్ వీహెచ్.. ఫిటింగ్ పెట్టాడా?

  రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఊహించని రీతిలో సమాధానం చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేనట్టే మళ్లీ ఏపీలో ఆపార్టీ కోలుకోవాలంటే కొన్ని సంత్సరాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాని కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఆపరిస్థితి కనిపించడంలేదు. గత కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న టీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పుడు వారికి అందివచ్చిన ఛాన్స్ లను ఏ మాత్రం వదలిపెట్టుకోకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైతు ఆత్మహత్యలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల ఆతహత్యలను పట్టించుకోకపోవడం వారికి కలిసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎవరికి తోచినట్టు వాళ్లు తమ పర్పెర్మెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు.. కనీసం రైతుల కుటుంబాలను కూడా పరామర్శించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా వీహెచ్ మరో ఫిటింగ్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. అటు టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతూనే ఇటు కాంగ్రెస్ నేతలపై కూడా తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం పై దాడి చేస్తూ యాక్టివ్ గా ఉంటే కొంత మంది మాత్రం అవేమి పట్టనట్టూ ఇంట్లోనే  కూర్చొని కాలక్షేపం చేస్తున్నారంట. దీంతో ఆయన కాంగ్రెసులో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా - పోరాడకుండా ఉన్న నాయకుల పేర్లను రాసుకొని దానిని టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డికి అందించినట్లుగా తెలుస్తోంది. ఈవిషయాన్ని ఆయనే ప్రకటించారు. అయితే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని కేంద్రంతో చెప్పే వీహెచ్ ఇప్పుడు ఈ విషయాన్ని కూడా కేంద్రంతో చెప్పి ఉంటారని.. దీంతో వీహెచ్ మళ్లీ ఫిటింగ్ పెట్టారని నేతలు అనుకుంటున్నారు.

సీఎం అవుతాడో లేదో... జైలుకైతే ఖాయం

  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో మూడేళ్లలో తానే సీఎం అవుతానని చెప్పుకుంటున్న జగన్ కలలు నెరవేరవని, మరో ముప్పై ఏళ్లయినా ముఖ్యమంత్రి కాలేడంటూ చురలంటించారు. కోర్టు అనుమతి లేకుంటే, కనీసం అసెంబ్లీకి కూడా రాలేని జగన్...ప్రతిపక్ష నేతగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమన్నారు. ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్న జగన్...ప్రజలను పక్కనబెట్టి... జ్యోతిష్యులను నమ్ముకున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎం కావాలన్న జగన్ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవన్న యనమల... మరో 20ఏళ్ల వరకూ టీడీపీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. జ్యోతిష్కుడు చెప్పినట్లు జగన్‌ సీఎం అవుతాడో లేదో తెలియదు గానీ...రేపోమాపో జైలుకెళ్లడం మాత్రం ఖాయమంటూ సెటైర్లు వేశారు.

వైసీపీ పోయింది.. టీడీపీలోకి

  ఇప్పటి వరకూ చాలా మంది నేతలు వైసీపీ పార్టీలోకి చేరిన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు వైసీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలోకి చేరనున్నట్లు.. అందుకు రంగం సిద్దమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదిరెడ్డిని ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ పదవి నుండి తప్పించి అతని స్థానంలో  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును నియమించారు. నిజానికి ఆదిరెడ్డి ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆతర్వాత ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కడం ఊహించని రీతిలో జరిగాయి. అయితే ఇప్పుడు తనను కాదని ఆపదవి వేరే వాళ్లకి కట్టబెట్టడంతో ఆసంతృప్తికి గురైన ఆదిరెడ్డి టీడీపీలోకి మారనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి వేరే కారణం లేకపోనూలేదు. ఏంటంటే గత కొద్దికాలంగా ఆదిరెడ్డి టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆదిరెడ్డి అప్పారావుకి టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా ఆదిరెడ్డి మాత్రం వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు ఆదిరెడ్డి ఎర్రన్నాయుడు తమ్ముడైన అచ్చెన్నాయుడితో రాజకీయ రాయబారాలు నడుపుతున్నారని అనుమానంతో జగన్ అతనిని పదవిని తప్పించినట్టు చెబుతున్నారు. దీంతో ఆదిరెడ్డి కూడా ఎలాగూ టీడీపీ మంత్రి వర్గంలో అచ్చెన్నాయుడు కీలకంగానే ఉన్నారు.. మరోవైపు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు కూడా ఎంపీ గా ఉండటంతో వాళ్ల అండతో అండతో టీడీపీలో ఎదగొచ్చని ఆలోచించి తాను కూడా టీడీపీలోకి చేరడానికే సముఖత చూపినట్టు తెలుస్తోంది.

నేను పోటీచేయట్లేదు.. గద్దర్

వరంగల్ లోక్‌సభ సిట్టింగ్ ఎంపీగా ప్రజాగాయకుడు గద్దర్ పోటీచేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వామపక్షాలు అతనిని పోటీ చేయమని అందుకు ఆయన కూడా సముఖత చూపించారని అన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. వరంగల్ వరంగల్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని గద్దరే స్వయంగా ప్రకటించారు. ఈ రోజు గద్దర్ దళిత సంఘాలతో భేటీ అయన నేపథ్యంలో వారితో మాట్లాడిన అనంతరం తాను ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి తాను ఉద్యమపాటగానే ఉంటానని తెలిపారు. కాగా వరంగల్ లోక్‌సభ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

కిరణ్ పేరు చెప్పి టీసర్కార్ నాటకాలాడుతోందా?

  ఉద్యోగుల  ప్రమోషన్ పై కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల ఇప్పుడు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోకముందు కిరణ్ కుమార్ రెడ్డి 2013లో ఈ నిషేదం విధించారు. అయితే రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దాదాపు పదిహేను నెలలు గడిచిన తెలంగాణ ఉద్యోగులకు మాత్రం ప్రమోషన్లు కరువయ్యాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన నిషేదింపునే కొనసాగించడం గమనార్హం. ఎందుకంటే ఏపీ ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా చేయడమే కేసీఆర్ నైజం అలాంటిది.. మరి ఉద్యోగుల ప్రమోషన్ నిషేదం మాత్రం ఎందుకు పట్టించుకోవడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నిషేదం మూలంగానే ఇప్పటి వరకూ రిటైర్ మెంట్ అయిన ఉద్యోగులు ప్రమోషన్ లు వాటికి సంబంధించిన ప్రయోజనాలు పొందకుండానే పాపం రిటైర్ కావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల వివాదంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టు కూడా ఈవిషయంపై సీరియస్ అవడంతో తొందరలోనే ఈ సమస్య కూడా ఓ కొలిక్కి రావచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగులు కూడా ప్రమోషన్లపై దృష్టి సారించాలని... ప్రమోషన్ల అంశం లేకుండా ఉద్యోగుల పంపిణీ చేయోద్దని కోరుతున్నారు.   అయితే అసలు విషయం ఏంటంటే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్రం విడిపోయిన తరువాత దానిని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది సమస్యగా మారింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రమోషన్లు అమలు చేస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రమోషన్లు ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి విధించిన నిషేదం అడ్డుగా ఉందని కుంటి సాకులు చెబుతుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వకుండా ఆ నెపాన్ని కిరణ్ కుమార్ రెడ్డిమీదకి తోసి నాటకాలాడుతున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది.  ఆంధ్రాకి అడ్డురాని నిషేదం.. టీ సర్కార్ కు అడ్డు వచ్చిందా అంటూ కొంతమంది మండిపడుతున్నారు.

గృహ నిర్భందంలో బైరెడ్డి..

  రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు గృహ నిర్భందం చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాల ప్రకారం కర్నూలు జిల్లా  తంగడంచ మండలంలో ఏపీ ప్రభుత్వం పరిశ్రమల కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన రైతు బతుకు దెరువు యాత్ర, కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన తగడంచ నుంచి కర్నూలు వరకు ఈ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఈకారణంగా పాదయాత్రంలో పాల్గొనేందకు గాను పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ నేతలు బెరెడ్డి నివాసానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే కొంత మంది రైతులను అరెస్ట్ చేసి బైరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచింది. దీంతో బైరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

టీ మంత్రులు.. ఏపీ మంత్రులను చూసి నేర్చుకోండి

  రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు పోటీ పడి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే రోజురోజుకి వీరి సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడంలేదు. మరోవైపు రెండు రాష్ట్ర రాజకీయ నేతలు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకోవడం తప్ప ఏ కనిపించట్లేదు. అయితే ఒక రకంగా రైతు ఆత్మహత్యల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి కంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఒక రకంగా మెచ్చుకోదగ్గదేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల పట్ల పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు వెళ్లడం కాని.. వారిని పరామర్శించడం కాని చేసింది లేదు. అంతెందుకు రెండు రోజుల క్రితం చనిపోయిన లింబయ్య అనే రైతుది ఆత్మహత్యే కాదని దబాయించింది. మరోవైరు ప్రతిపక్ష పార్టీనేతలు కూడా రైతుల ఆత్మహత్యలపై అధికార ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చురకలు వేస్తున్నా.. వారి ఆత్మహత్యల గురించి పట్టించుకోవాలని చెపుతున్నా వారు మాత్రం వినీ విననట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఏపీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకుంటన్నట్టే తెలుస్తోంది. ఎందుకంటే పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రులు అక్కడి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని పరామర్సించి రైతు మృతి పట్ల సానుభూతి తెలిపారు. అంతేకాక రైతు కుటుంబానికి ప్రభుత్వం తప్పకుండా సహాయం అందిస్తుందని.. పొగాకు తక్కువ క్వాలిటీ ఉన్నా కూడా కొనుగోలు ఏర్పాట్లు ప్రభుత్వం తరఫునే చేయబోతున్నాం కాబట్టి రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి వచ్చారు. దీనిని బట్టి కాస్తో కూస్తో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం కంటే ఏపీ ప్రభుత్వమే పట్టించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈవిషయంలో తెలంగాణ మంత్రులు ఏపీ మంత్రులను చూసి నేర్చుకోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర కలిసున్నా.. రాష్ట్రం విడిపోయినా రైతు అనే వాడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అందులోనూ రెండు రాష్ట్రాలకు వ్యవసాయమే జీవనాధారం. మరి అలాంటి రైతుల గురించి.. వారి బాగోగులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తలసాని మాట్లాడితే.. టీడీపీ వెళ్లిపోతుందట

  టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా చెలామణి అవుతున్న తలసాని యాదవ్ పై ఇప్పటికే టీ టీడీపీ నేతలు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీచేశారు. ఆయనను బర్తరఫ్ చేయించాలని.. రాజీనామాచేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారు.. గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు మరోసారి తలసానిపై స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఈనెలలో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలలో ఏయే పాయింట్ల మీద మట్లాడాలో టీ టీడీపీ నేతలు కలిసి రైతుల ఆత్మహత్యల దగ్గర నుండి మొత్తం 20 పాయింట్లతో కలిసి ఒక జాబితాను రాసుకున్నారట. అందులో తలసాని అంశం కూడా చేర్చారట. ఈసభలో మాత్రం తలసానిని బర్తరఫ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేయాలని.. ఒకవేళ తలసాని కనుక తన శాఖకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడినట్టయితే సభ నుండి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారంట. అయితే టీ టీడీపీ నేతల ప్లాన్ బాగానే ఉన్నా అధికార ప్రభుత్వం మాత్రం వీరి డిమాండ్ కు ఒప్పుకుంటుందా? టీడీపీ నేతలు సభ నుండి బయటకు వెళ్లినంత మాత్రానా స్పీకర్ తలసానికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉంటారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి తలసాని పై టీడీపీ వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

రఘువీరా పై రాళ్లు ఇసుకతో దాడి

  రైతులకు మద్దతు పలికేందుకు కృష్ణాజిల్లా వెళ్లిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నేపథ్యంలోగానూ మచిలీపట్న పోర్టుకు కూడా భూసేకరణ ప్రకటించింది. అయితే దీనికి వ్యతిరేకంగా బందరు మండలం, కోన గ్రామ సెంటర్‌ లో రైతులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు పలికేందుకు వెళ్లిన ఆయన అక్కడ మాట్లాడుతుండగా కొంతమంది ఆయనపై దాడి చేశారు. ఇసుక, కంకర రాళ్లు విసురుతూ రఘువీరాపై గొడవకు దిగారు. ఒకపక్క పోలీసులు వారిని అదుపు చేసే పయత్నం చేసినా వారిమీద కూడా కొందరు యువకులు తిరగబడ్డారు. దీంతో చేసేది లేక రఘువీరా.. ఆయనతో పాటు వెళ్లిన కాంగ్రెస్ నేతలు వెను తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఉరిము ఉరిమి మంగల మీద పడినట్టు... ఈ సంఘటనకు కారణం టీడీపీయే అని రఘువీరా రెడ్డి అంటున్నారు.  సభ సజావుగా జరగకూడదనే ఉద్దేశ్యంతోనే గ్రామానికి చెందిన  యువకులను ఉసి కొల్పి మాపై దాడిచేయించారని ఆరోపించారు. ఏడాదికి రెండు పంటలు పండే భూములను రైతల దగ్గర నుండి ఎలా తీసుకుంటారని అన్నారు. ఒకవేళ రైతుల దగ్గర నుండి భూములు తీసుకున్న వారికి మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి అంత సీన్ లేదు కాబట్టి భూసేకరణ జరిగే ప్రసక్తి లేదు.. రైతులంతా ధైర్యంగా ఉండాలని అన్నారు

మళ్లీ ప్రధాని.. చంద్రబాబు అభినందనలు

  ఒకటి కాదు రెండు కాదు దాదాపు కొన్ని సంత్సరాల నుండి ఎన్నికల్లో పోటీ చేస్తూ అప్పటి నుండి గెలుస్తూనే ఉంది సింగపూర్ లోని పీపుల్స్ యాక్షన్ పార్టీ. 1965లో ఏర్పాటైన ఈపార్టీ అప్పటినుండి ఇప్పటివరకూ గెలవడం ఆశ్చర్యకరమైన విషయమే. ఒక్కసారి గెలవడమే కష్టం అనుకుంటున్న రోజుల్లో ఈ సారి కూడా ఈ పార్టీ విజయఢంకా మోగించింది. మొత్తం 89 సీట్లకు గాను 83 సీట్లు గెలిచి ఈసారి కూడా లిసీన్ లూంగ్ మళ్లీ ప్రధానిగా ఎంపికయ్యారు. అయితే ఈసారి కూడా లూంగ్ ప్రధాని కావడంతో ఏపీలో టీడీపీ నేతలు పండగ చేసుకుంటున్నారు. ఆయన ప్రధాని అయితే ఇక్కడ వీళ్లు చేసుకోవడం ఏంటనుకుంటున్నారా.. ఎందుకంటే ఏపీ అభివృద్ది దిశగా సింగపూర్ పర్యటించిన చంద్రబాబు అక్కడ పారిశ్రామిక వేత్తలతో మాట్లడటానికి.. పెట్టుబడులు పెట్టడానికి లూంగ్ ఎంతగానో సహకరించారు. ఈ నేపథ్యంలో లూంగ్ మళ్ళీ ప్రధానిగా నియమించబడటం అక్కడ సంగతేమో కాని ఇక్కడ ఏపీకి మాత్రం ఒక రకంగా తీపి కబురు లాంటిదే. అందుకే లూంగ్ ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో చంద్రబాబు కూడా తనను అభినందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. లూంగ్ నాయకత్వంపై నమ్మకం ఉంది కాబట్టే సింగపూర్ ప్రజలు మళ్లీ అతనిని ప్రధానిని చేశారని కొనియాడారని ట్విట్టర్ లో పేర్కొన్నారు..

గ్యాస్ సిలిండర్ పేలి, 82మంది మృతి

మధ్యప్రదేశ్ లోని జబువాలో జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఊహించినదానికంటే...చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఇద్దరే చనిపోయారని అనుకున్నా, శిథిలాల కింద చిక్కుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వార్తలు అందుతున్నాయి. ఇఫ్పటివరకూ అందిన సమాచారం మేరకు 82మంది మృతిచెందారని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలి మరణించిన వారి కంటే, ఆ భవనం కింద చిక్కుకుని చనిపోయినవారే ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి రెండంతస్తుల బిల్డింగ్ కూలిపోయిందని, ఆ సమయంలో దాన్లో ఉన్నవారంతా దాదాపు మృత్యువాత పడ్డారని జాతీయ ఛానళ్లు చెబుతున్నాయి.

ఉండవల్లి అందుకే జగన్ డ్రమ్స్ వాయిస్తున్నాడా?

ఉండవల్లి కామెంట్స్ ను చూస్తుంటే... జగన్ డైలాగ్స్ నే కొద్దిగా అటూఇటుగా మార్చి చెబుతున్నట్లు అనిపిస్తుంది. పట్టిసీమ ప్రాజెక్టు అయినా, రాజధాని అంశమైనా...సేమ్ టు సేమ్ ఇద్దరి వెర్షనూ ఒకేలాగా ఉంటుంది. జగన్ చెబుతున్నదే కరెక్ట్ అన్నట్లుగా, ఉండవల్లి వ్యాఖ్యలు ఉంటున్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదంటూనే, ప్రభుత్వంపైనా, పార్టీపైనా ఉండవల్లి విమర్శలు చేస్తుండటంతో అప్రమత్తమైన తెలుగుదేశం నేతలు...ఎదురుదాడి మొదలుపెట్టారు. వైసీపీలో చేరే ఉద్దేశంతోనే ఉండవల్లి...జగన్ డ్రమ్స్ వాయిస్తున్నాడని, పైగా రాయలసీమ అభివృద్ధి చెందడం ఇద్దరికీ ఇష్టంలేదని, అందుకే పట్టిసీమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని గాలి ముద్దుకష్ణమనాయుడు ఆరోపించారు. అయితే గాలి ఆరోపించినట్లుగా ఉండవల్లి వైసీపీలో చేరతారో లేదో తెలియదు గానీ, ఉమ్మడి శత్రువైన టీడీపీని దెబ్బకొట్టేందుకు పరోక్షంగా సహకరించుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.