క‌మ్మ క‌మ్యూనిటీపై జ‌గ‌న్ ఫోక‌స్

కోస్తాంధ్ర‌లో బ‌ల‌మైన‌ క‌మ్మ క‌మ్యూనిటీపై జ‌గ‌న్ దృష్టిపెట్టారు. తెలుగుదేశం పార్టీకి ఆయువు ప‌ట్ట‌యిన‌ క‌మ్మ సామాజికవ‌ర్గం నుంచి త‌న‌కు కొంచెం అండ దొరికినా కొండంత బ‌లం వ‌చ్చిన‌ట్లేన‌ని భావిస్తున్న వైసీపీ అధినేత‌... ఆయా జిల్లాల్లో ప‌ట్టున్న నేత‌ల కోసం ఆన్వేషిస్తున్నార‌ట‌. 2004లో ఈ వ‌ర్గం నుంచి కూడా వైఎస్ కు మ‌ద్ద‌తు దొర‌క‌బ‌ట్టే కాంగ్రెస్ అధికారంలోకి రాగ‌లిగింద‌ని, టీడీపీకి బ‌లంగా కొమ్ముకాసే ఈ వ‌ర్గంలోనూ వైఎస్ కు చెప్పుకోద‌గ్గ స్థాయిలో అభిమానులున్నార‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. కోస్తాంధ్ర‌తోపాటు, రాయ‌లసీమ‌లోని అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో రాజ‌కీయాల‌ను శాసిస్తున్న ఈ వ‌ర్గం అండ లేక‌పోతే, వ‌చ్చేసారైనా అధికారం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌న్న అంచ‌నాకి వ‌చ్చార‌ట‌. పైగా ఆ వ‌ర్గానికి చెందిన త‌న ఎమ్మెల్యేలు గొట్టిపాటి ర‌వికుమార్, పోతుల రామారావులు....తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అదే సామాజిక వ‌ర్గం నుంచి బ‌ల‌మైన నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుని డామేజ్ కంట్రోల్ కు రెడీ అవుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ప‌లువురితో జ‌గ‌న్ స్వ‌యంగా చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, కృష్ణాజిల్లా నుంచి దేవినేని నెహ్రూ చేర‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాల్లో పట్టున్న కరణం బ‌ల‌రాంతో కూడా సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని,  టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయ‌నా వైసీపీలో చేరే అవ‌కాశ‌ముందంటున్నారు జ‌గ‌న్ పార్టీ నేత‌లు.

తెలంగాణలో రిటైర్డ్.. ఏపీలో జాబ్

  తెలంగాణలో పదవి వీరమణ పొందిన 20 మంది ఉద్యోగులకు మళ్లీ ఏపీలో ఉద్యోగ బాధ్యతలు  నిర్వహించే అవకాశం లభించింది. ఎందుకంటే రాష్ట్రాలకు ఉద్యోగులు కేటాయింపులకు ఏర్పాటు చేసిన కమల్ నాథన్ కమిటీ స్థానికత ఆధారంగా ఇరవై మంది ఉద్యోగులను ఏపీకే కేటాయించింది. అయితే తెలంగాణలో పదవీ విరమణ కాలం 58 సంవత్సరాలు.. ఏపీ లో 60 సంవత్సరాలు ఉండటంతో ఈ ఇరవై మందికి మరో రెండేళ్లపాటు ఉద్యోగ అవకాశం కలిగింది. దీనికి ఏపీ ప్రభుత్వ కూడా అంగీకరించడంతో వారికి ఏపీ జైళ్ల శాఖలో ఉద్యోగం కల్పించింది. ఇదిలా ఉండగా ఈ ఉద్యోగుల కేటాయింపులపై కమల్ నాథన్ కమిటీ కసరత్తులు చేస్తూనే ఉంది. దీనిలో భాగంగానే ఈ కమిటీ రెండు ప్రభుత్వాల సీఎస్ లతో కూడా భేటీ అయింది. అయితే 40 శాఖల్లోని ఉద్యోగుల పేర్లతో ఈ తుది కేటాయింపులో వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీ ఇప్పటికే పరిష్కరించే పనిలో పడింది. త్వరలోనే తుది కేటాయింపులు జరగబోతాయని కమిటీ తెలిపింది.

నన్ను కలువు.. ప్రేమ గురించి చెపుతా.. మంత్రి

కారణమేదైతే కాని రోజు రోజుకు ఆత్మహత్యలు చేసుకునేవారు పెరిగిపోతునే ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు అసలు లెక్కలేకుండా పోయింది. నిన్నటికి నిన్న తెలంగాణ లో లింబయ్య అనే రైతు రాజధాని నడిబొడ్డున ఉరి వేసుకొని తన ప్రాణాలను బలిగొన్నాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుతం ఒక ఉపాయాన్ని కనుగొంది. ఏదో ఒక రకంగా ఈ ఆత్మహత్యలను నివారించాలని దీనికోసం ఒక ప్రత్యేకమైన సెల్ ను ఏర్పాటు చేశారు. దీనిని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సెల్ ను ప్రారంభించిన సందర్భంగా వచ్చిన మొదటి కాల్ ను స్వయంగా లక్ష్మారెడ్డే అందుకొని మాట్లాడారు. అయితే కిరణ్ అనే కుర్రాడు తన ప్రేమ విఫలమైందని అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని మంత్రిగారికి చెప్పడంతో మంత్రిగారు తొందరపడి అలాంటి అగాయిత్యాలకి పాల్పడవద్దని.. తల్లి దండ్రుల కోసం ఆలోచించాలని హిత బోధ చేశారంట. అంతేకాదు తన ఫోన్ నెంబరు ఇచ్చి తనను వ్యక్తిగతంగా కలవాలని.. ప్రేమ గురించి తాను చెప్తానని కూడా చెప్పారంట. మొత్తానికి రాజకీయ నాయకులు సమాజం.. బాధ్యతలే కాదు ఇలా ప్రేమ పాఠాలు కూడా చెప్పాల్సి వస్తుంది.  

నేటి నుండి ఏపీ యన్.ఐ.టి. క్లాసులు ప్రారంభం

  రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా సంస్థలను కేంద్రప్రభుత్వం నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇంతవరకు రాష్ట్రంలో ఐదు ఉన్నత విద్యా సంస్థలకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ శంఖు స్థాపననలు చేసారు. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్నాలాజీ (యన్.ఐ.టి.) కూడా ఒకటి. కానీ ఈ ఉన్నత విద్యా సంస్థలన్నిటికీ శావిత భవన సముదాయాలు నెలకొల్పడానికి చాలా సమయం పడుతుంది కనుక అంత వరకు తాత్కాలికంగా వేరే సంస్థల భవనాలలో ఈ విద్యా సంవత్సరం నుండే శిక్షణా తరగతులు మొదలుపెడుతున్నారు. ఏలూరులోని పెద్ద తాడేపల్లి గ్రామంలో గల వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో నేటి నుండి యన్.ఐ.టి. శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు నిన్న ఆ భవన సముదాయాన్ని, శిక్షణా తరగతులను లాంఛనంగా ఆరంభించారు. దీనికి వరంగల్ యన్.ఐ.టి. మార్గదర్శకత్వం చేస్తుంది. విశాఖ శివార్లలో గంభీరం అనే గ్రామంలో నెలకొల్పుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (ఐ.ఐ.ఎం.) శిక్షణ తరగతులు ఆంద్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించబోతున్నారు. దీనికి చెన్నై ఐ.ఐ.ఎం. మార్గదర్శకత్వం చేస్తుంది.

నేటి నుండి తెదేపా కార్యకర్తలకు నారా లోకేష్ శిక్షణ

  తెదేపా యువనేత నారా లోకేష్ నేటి నుండి పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలను మొదట తిరుపతి నుండి మొదలుపెడతారు. ఆ తరువాత వరుసగా కందుకూరు, తాడేపల్లిగూడెం, అరుకు తదితర ప్రాంతాలలో పర్యటించి పార్టీ కార్యకర్తలకు ఆయన స్వయంగా శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నారు. పార్టీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల పట్ల వారికి అవగాహన కల్పించిన తరువాత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని మరిన్ని వివరాలను ఏవిధంగా తెలుసుకోవాలి? సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని తిరిగి ప్రజలకు ఏవిధంగా చేరవేయాలి? అనే అంశాలపై ఆయన పార్టీ కార్యకర్తలకు నిపుణులచేత శిక్షణ ఇప్పించబోతున్నారు.

తిట్టిన నోటితోనే పొగిడిన కేసీఆర్

  కేసీఆర్ గారు ఏ టైంలో ఎలా ఉంటారో ఎవరికి అర్థంకాదు. ఎందుకంటే ఆయన చేసిన ఎప్పుడు ఎవరిని తిడతారో.. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో ఆయనకే ఒక క్లారిటీ ఉండదు. ప్రస్తుతానికి కేసీఆర్ ప్రభుత్వంపైన అందరూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేంద్రంతో కూడా ఎడమొహ పెడమొహం లాగే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో కేసీఆర్ మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. మోడీ లేడు.. గీడీ లేడు.. మోడీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని విమర్శించారు. ఏ నోటితో అయితే మోడీని తిట్టాడో అదే నోటితో ఇప్పుడు మోడీని పొగడాల్సివచ్చింది. కేసీఆర్ చైనా టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన మోడీ సంస్కరణవాది అని.. మోదీ ముఖ్యమంత్రులందరినీ కలుపుకొని వెళుతున్నారని తన నోటితోనే ప్రశంసించారు. ఇందుకు కారణమూ లేకపోలేదు. ఎందుకంటే మోడీకి ఇతర దేశాల్లో ఉన్న పేరు ప్రతిష్టలు అలాంటివి. మరి తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే మోదీ పేరు ఉపయోగించుకోవాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ కు తన కంటూ ఒక బ్రాండ్ ఇంకా ఏం లేదు. ఇక చంద్రబాబు అంటారా ఆయనే ఒక బ్రాండ్.. తను మోదీ పేరు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకుంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ను తనే సృష్టించుకున్నాడు. కానీ కేసీఆర్ కు మాత్రం అలాంటి బ్రాండ్ ఏం లేకపోవడంతో మోడీ పేరు వాడుకోక తప్పలేదు.

ముఖ్యమంత్రి కోసం వాటర్ బాటిల్.. అందులో పాముపిల్ల

  చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి రమణ్ సింగ్, ఆయనతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారికి తాగడానికి వాటర్ బాటిల్స్ సిద్దం చేశారు. అయితే ముఖ్యమంత్రిగారు తాగాల్సిన బాటిల్ నీటిలో పాము పిల్ల కనిపించింది. ఇది అక్కడ ఉన్న ఓ మహిళా డాక్టర్ గుర్తించడంతో అది ఆయనకు అందకుండా చూశారు. లేదంటే అలానే పాము ఉన్న బాటిల్ ను ముఖ్యమంత్రిగారి ముందు పెట్టేవారే. కానీ మామూలు అధికారులకు చేసే ఏర్పాట్లే సరిగా ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు.. అలాంటిది ముఖ్యమంత్రికి చేసే ఏర్పాట్లలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.. కాని అలా కాకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.

వామ్మో శ్రీదేవి.. డబ్బింగుకు కోటిరూపాయలా?

  సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీదేవి రెమ్యునరేషన్ విషయంలో అస్సలు ఏమాత్రం తగ్గేలా కనపించట్లేదు. సినిమాలకు కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తూ అందరిని భయపెట్టేస్తుంది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీదేవికి ఆసినిమా తరువాత పెద్దగా ఆఫర్లు కూడా ఏం రాలేదు. అయితే బాహుబలి సినిమాకి రమ్యకృష్ణ పాత్రలో మొదట శ్రీదేవిని అనుకొని తన డిమాండ్ కు తట్టుకోలేక ఆ పాత్రలో రమ్యకృష్ణను తీసుకున్నారు. ఒక రకంగా అది కూడా సినిమాకి ప్లస్ అయిందనుకోండి. ప్రస్తుతానికి శ్రీదేవి తమిళంలో పులి సినిమాలో రాణి పాత్రలో నటిస్తుంది. అసలు ఈ సినిమాకే ఈమెకు భారీగా చెల్లిస్తున్నారు.. అదీకాక డబ్బింగ్ కు రూ కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందట. ఆశ్చర్యం ఏంటంటే శ్రీదేవి అడిగినంత ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారంట తెలుగు వెర్షన్ నిర్మాతలు. ఎందుకంటే విజయ్ తీసిన తుపాకీ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా సూపర్ హిట్ అయింది. అందుకే ఈ సినిమా కూడా సుపర్ హిట్ అవుతుందని.. అందునా శ్రీదేవి డబ్బింగ్ చెబితేనే సినిమాకు ప్లస్ అవుతుందని శ్రీదేవి అడిగిన కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోయారంట. అంతేకాదండోయ్ ఒక్క డబ్బింగ్ కే కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ గా కూడా శ్రీదేవి రికార్డులకెక్కబోతుంది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా శ్రీదేవి తవ సత్తా చాటుకుంటోందన్నమాట.

ప్రతి దానికీ గొడవే.. చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తిమ్మాపురంలో ఆయన విర్డ్స్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర విడిపోయి ఆర్ధిక సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షనేతలు మాత్రం దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒక్క పనికి అడుపడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17వేల ఎకరాల అటవీ భూమి ఉందని.. అటవీ భూములను డీనోటిఫై చేసి పరిశ్రమలను తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. భీమవరంలో అక్వా విశ్వవిద్యాలయం..గోపాలపురంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు, పేదలు సంతోషంగా ఉండలనేదే తన తాపత్రయమని అన్నారు.

మోడీకి కోపమొచ్చింది

ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందంటూ సోనియాగాంధీ చేసిన విమర్శలను ప్రధాని నరేంద్రమోడీ తిప్పికొట్టారు. సోనియా వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన మోడీ...కాంగ్రెస్ ను అవినీతి పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మనీపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిందని, అందుకే తమపై బురద చల్లుతున్నారని మోడీ ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడుగడుగునా అడ్డుకుని, కాంగ్రెస్ నేతలు చీప్ గా బిహేవ్ చేశారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమిని సోనియా ఇంకా జీర్జించుకోలేకపోతున్నారని, అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. ప్రజల నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వమ్ముచేయబోమన్న మోడీ... ఏ ఆశయంతో తమను గెలిపించారో...దాన్ని సాధించి చూపిస్తామన్నారు మోడీ.

మహేశ్ అందుకే దత్తత తీసుకున్నాడు.. తేజ

  శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహేశ్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకొని రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడయ్యాడు. ప్రకాశ్ రాజ్ కూడా తెలంగాణలో ఒక గ్రామాన్ని.. ఏపీలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నా ఏపీలో తీసుకోవాల్సి ఉంది. అయితే మహేశ్ బాబు.. ప్రకాశ్ రాజ్ లు చేసిన ఈ పనిని శ్రీమంతుడు సినిమా ఆదర్శంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు. కాని వారు గ్రామాన్ని దత్తత తీసుకున్నది అందుకు కాదంటం దీనివెనుక వేరే కారణముందట. అది ఏంటనేగా మీ డౌట్.. దర్శకుడు తేజ సెలబ్రిటీలు గ్రామాలు దత్తతపై సంచలమైన కామెంట్లు చేశారు. తేజ దర్మకత్వం వహించిన హోరాహోరీ సినిమా రిలీజ్ సందర్బంగా జరిగిన ప్రెస్ మీట్ లో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ గ్రామాల్ని దత్తత తీసుకోవడంపై మీ స్పందన ఏంటని అడుగగా దానికి ఆయన సమాధానం చెప్పకపోగా వారు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితోనే గ్రామాల్ని దత్తత తీసుకున్నారా అని ఎదురుప్రశ్న వేశారు? వారు కేవలం ఐటీ డిడక్షన్ కోసమే గ్రామాలను దత్తత తీసుకున్నారని... సామాజిక సేవ చేసే సంస్థలకు పన్ను రాయితీ ఉండదని అందుకే అందరూ ఆపనిలో పడ్డారని కామెంట్స్ చేశారు. మహేష్ బాబు గ్రామాల దత్తత కార్యక్రమం కూడా ఇదే కోవకు చెందిందేనని తేజ కామెంట్ చేశారు. నిజంగా సేవ చేయాలని వుంటే ఒక్కడు సినిమా తర్వాతే గ్రామాన్ని దత్తత తీసుకుని చేసి వుండొచ్చు కదా అని తేజ ప్రశ్నించారు. అయితే తేజ నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఎటువంటి మొహమాటం లేకుండా చెపుతాడు అని అందరూ అనుకుంటారు. మరి తేజ చెప్పినట్టు సెలబ్రిటీల దత్తత వెనుక కారణం అదేనా?

తెలంగాణకి "లియో" వెయ్యి కోట్ల పెట్టుబడులు

  తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే నేపథ్యంలో సీఎం కేసీఆర్ చైనాలో బిజీబిజీ అయిపోయారు. ఇప్పటికే ఆయన పలు రకాల పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. నిన్న ఒక్కరోజే ఆయన 3 గంటల్లో 30 మీటింగులు నిర్వహించారంటేనే తెలుస్తోంది ఆయన ఎంత బిజీగా ఉన్నారో. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు నెలకొన్న పరిస్థితులు అందుకు అనువైన వసతుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రముఖ లియోగ్రూప్ ఆఫ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల గురించి వివరించాలని ఈనేపథ్యంలోనే తమ కంపెనీలను కూడా ఒకసారి సందర్శించాలని పలు కంపెనీల నుండి కేసీఆర్ బృందానికి ఆహ్వానాలు వచ్చాయి.

ముగ్గురిని చంపాం.. ఇప్పుడు నువ్వే.. ప్రొఫెసర్ కు బెదిరింపు లేఖ

  ప్రొఫెసర్ కే.ఎస్ భగవాన్ కు తీవ్రమైన స్థాయిలో బెదిరింపు లేఖ వచ్చింది. మైసూర్ దారుడవాడలోని కల్యాణ నగర్ లో ఉంటున్న కే.ఎస్. భగవాన్ ఇంటికి ఒక ఉత్తరం రాగా అందులో తనను బెదిరిస్తూ రాశారు. అందులో ఏముందంటే నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరని అనుకోవద్దు.. ఇప్పటికే మా చేతిలో ముగ్గురు హతమయ్యారు.. నిన్నుఅంతం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము.. రోజులు  లెక్కపెట్టుకో పోలీసులు కూడా నిన్ను కాపాడలేరని రాసి ఉంది. వెంటనే భగవాన్ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే అనేక విషయాలలో భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. అందులోనూ భగవద్దీతను చులకన చేస్తూ  "భగవద్దీతను అగ్నికి ఆహుతి చెయ్యాలి అని.. నిండు గర్బిణిని అడవులకు పంపించిన శ్రీరాముడిని మీరు ఆదర్శంగా తీసుకుంటారా, 16,000 మందిని పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు పాపాత్ముడు" అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేయడంవల్లే దీంతో ఒక వర్గం వారు తనను బెదిరిస్తూ ఇలాంటి లేఖలు రాసిఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భగవాన్ ఇంటి దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

ప్రస్తుతానికి కేటీఆర్ హరీశ్ లే సీఎంలు

  తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్ ప్రస్తుతం చైనా టూర్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్దికి.. అక్కడ పెట్టబోయే పరిశ్రమలు.. వాటి అనుకూలతలు గురించి చైనా పారిశ్రామికవేత్తలకు చెప్పి వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేయడానికి ప్రయత్నించే పనిలో పడ్డారు. అయితే కేసీఆర్ పది రోజుల చైనా పర్యటనలో ఉండే ఇక్కడి పరిపాలనా బాధ్యతలు ఎవరు చూస్తున్నారు? ఈ పశ్నకు సమాధానం.. కేసీఆర్ తనయుడు.. ఐటీ మంత్రి కేటీఆర్.. నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు ఈ బాధ్యతలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ఒకవైపు  హరీష్ రావు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటుండగా మరోవైపు కేటీఆర్ పరిపాలన కార్యకలాపాల్లో ఫుల్లు బిజీగా తమ పనుల్లో నిమగ్నమైపోయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ లేకపోయిన వీరిద్దరూ పరిపాలనా కార్యక్రమాల సవ్యంగా నిర్వహిస్తున్నారని అందుకు ఇందుకు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అనేక అంశాల మీద ఇప్పటికే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలో హరీశ్ రావు కూడా వారిపై తిరిగి కౌంటర్లు వేస్తూ టీఆర్ఎస్ పై మాటపడనివ్వకుండా ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొడుతూ విలేకరులతో ఎప్పటికప్పుడూ ముచ్చటిస్తూనే ఉన్నారు. అలాగే కేటీఆర్ కూడా ప్రభుత్వ పరంగా చేయబోయే కార్యాక్రమాలపైన మంత్రి కేటీఆర్ హామీలు ఇస్తుండటం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు. అంతేకాదు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు ఉండదని సీఎం కేసీఆర్ చెప్పినా పెంపు విషయంపై ముఖ్యమంత్రి చైనా నుంచి రాగానే మాట్లాడతానని కేటీఆర్ హామీ ఇవ్వడం పై దూరమవుతున్న కార్మికుల్లో అసంతృప్తి నెలకొనకండా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు తెలంగాణలో అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గ్రామాలను అభివృద్ధి పరిచే దిశగా వారిని ప్రముఖలకు దత్తత ఇచ్చే కార్యక్రమంలో కూడా తన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు.. ప్రకాశ్ రాజ్ తమ వంతుగా ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తానికి కేసీఆర్ లేని లోటును ఈ ఇద్దరు మంత్రులు తీరుస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతానికే ఈ ఇద్దరే తెలంగాణకు సీఎంలుగా వ్యవహరిస్తున్నారు.

అన్నదాతల ఆత్మహత్యలు.. ఆపేవారెవరూ?

  ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. వర్షాలు రాక.. పంటలకు సరైన నీరు లేక.. పంటలు వేసిన సరిగా పండక పెట్టిన పెట్టుబడి కూడా రాక కడలోతు కష్టాల్లో కురుకుపోతున్న రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చావు ఒక్కటే మార్గమని తమ ప్రాణాలను బలిగొంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జిల్లాలలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు రాజదాని నడిబొడ్డున రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వాలు మాత్రం తమ వైఖరిని మార్చుకుంటున్నాయా అంటే అదీలేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి రాజకీయ నాయకులు చేసిందని ఓ పదివంతు అయితే విద్యార్ధులు రైతులు చేసిన ఆందోళనలు.. వారి త్యాగాలు అనిర్వచనీయం. మరి ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తరువాత అయినా వారి పరిస్థితులు చక్కబడ్డాయా అంటే అదీ లేదు. ఎంతవరకూ పక్క రాష్ట్రంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. వారితో వాదనలు.. వితండవాదాలు చేయడం ఇదే సరిపోయింది కాని రైతుల సమస్యలు ఏంటి వారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని ఆలోచించే ధోరణి ఏ ఒక్క నాయకుడికి పట్టడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో హామీలు చేస్తారు కాని గెలిచిన తరువాత మాత్రం వారిని పట్టించుకునే నాదుడే లేడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.. బంగారు తెలంగాణని ఏర్పాటు చేయాలి అని అంటున్నారు కాని.. అసలు రాష్ట్రంలో ఉన్నరైతుల సమస్యలే పట్టించుకోని నాయకులు ఇక బంగారు తెలంగాణ ఎలా తయారు చేస్తారు అని గుసగుసలాడుకునే వారు కూడా ఉన్నారు. ఒక్క రాష్ట్రాన్నే అభివృద్ధి చేస్తే చాలదు.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని భావిస్తున్నారు. తన ఫామ్ హౌస్ లో పండే పంటలు కూరగాయలు మంచిగా పండితే చాలదు.. రాష్ట్రంలో ఉన్న రైతల పంటలు కూడా అదే విధంగా పండేలా చూడాలి. ఇకనైనా  తమ ఒంటెద్దు పోకడని మాని రైతుల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోసి రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

విద్యుత్ ఉద్యోగులపై కమిటీ.. పేర్లు మీరే చెప్పండి.. హైకోర్టు

  తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను రీలివింగ్ చేసిన వ్యవహారంపై ఇప్పటికీ కోర్టులో వాదనలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఈ సమస్య పరిష్కారం చూడకుండా ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వాదనలకు చిరాకు పుట్టి హైకోర్టు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమస్యపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరిస్తారా సరే లేదంటే మేమే రంగంలోకి దిగాల్సి వస్తుంది అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు హైకోర్టు మరో మెట్టు ఎక్కి ఈ వ్యవహారంపై ఒక కమిటీని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ని చెప్పినా రెండు రాష్ట్రాలు ఈ విషయంలో తిట్టుకుంటూ వ్యవహారాన్ని నాన్చుతున్నాయే తప్ప సమస్యను పరిష్కరించడంలేదని.. అందుకే తామే ఒక కమిటీ వేస్తామని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఏ.శంకరనారాయణలు తెలిపారు. ఈ కమిటీ కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో నలుగురు పేర్లను సూచించాలని.. ఈ కమిటీ ఛైర్మన్ గా ఒక వ్యక్తిని నియమిస్తామని.. అవసరమైతే రెండు రాష్ట్రాలకు సంబంధంలేని వ్యక్తిని కమిటీ ఛైర్మన్ నియమించాలని యోచిస్తున్నామని చెప్పారు. కనీసం ఈ కమీటీ ద్వారా అయినా  ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.