సీఎం అవుతాడో లేదో... జైలుకైతే ఖాయం
posted on Sep 14, 2015 @ 4:42PM
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో మూడేళ్లలో తానే సీఎం అవుతానని చెప్పుకుంటున్న జగన్ కలలు నెరవేరవని, మరో ముప్పై ఏళ్లయినా ముఖ్యమంత్రి కాలేడంటూ చురలంటించారు. కోర్టు అనుమతి లేకుంటే, కనీసం అసెంబ్లీకి కూడా రాలేని జగన్...ప్రతిపక్ష నేతగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమన్నారు. ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్న జగన్...ప్రజలను పక్కనబెట్టి... జ్యోతిష్యులను నమ్ముకున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎం కావాలన్న జగన్ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవన్న యనమల... మరో 20ఏళ్ల వరకూ టీడీపీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. జ్యోతిష్కుడు చెప్పినట్లు జగన్ సీఎం అవుతాడో లేదో తెలియదు గానీ...రేపోమాపో జైలుకెళ్లడం మాత్రం ఖాయమంటూ సెటైర్లు వేశారు.