ఇస్లాంలోకి మారతామంటున్న బ్రాహ్మణులు

బ్రాహ్మణులేంటి? ఇస్లాం మతంలోకి మారతాననడం ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే? ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో 150మంది బ్రాహ్మణులు... తామంతా ఇస్లాంలోకి మారిపోతామంటున్నారు? అయితే ఇస్లాంపై ప్రేమతోనే, ఆ మత సంప్రదాయాలు నచ్చో...అందులో చేరతామనడం లేదు, పోలీసులపై కోపంతోనే ఆ పని చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు తమ బాలికను దళిత యువకుడు కిడ్నాప్ చేశాడని ఫిర్యాదుచేసి, పదిరోజులు కావొస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న సింఘావలీ అహిర్ గ్రామ బ్రాహ్మణులు... ఖాకీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించకపోతే, తామంతా ఇస్లాం మతంలోకి మారిపోతామంటూ పోలీసులకు విచిత్రమైన హెచ్చరిక జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేపట్టిన బ్రాహ్మణులు...తమ ఫిర్యాదుపై అధికారులు స్పందించకపోతే, ఇస్లాంలోకి మారిపోతామంటూ కలెక్టర్ కు వినతిపత్రం కూడా ఇచ్చారు. అయితే బాలిక ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఏఎస్సీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు.

రెండు రాష్ట్రాల సమస్య.. ఉల్లిపాయ తీర్చిందా?

  రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రాంతీయ బేధాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఉండేవి. కాని రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడూ ఏదో గొడవ. ప్రతి చిన్నవిషయానికి గిల్లి కజ్జాలు చేసుకుంటున్నాయి. నీటి విషయంలో.. ఉద్యోగుల పంపిణీ విషయంలో ఇంకా అనేక విషయాల్లో రెండు రాష్ట్రాలు తరుచూ గొడవ పడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న సమస్యలను తీర్చడానికి అటు గవర్నర్.. ఇటు కేంద్రం కూడా ప్రయత్నించింది కాని లాభం లేకుండా పోయేది. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒక సమస్యను ఉల్లిపాయ తీర్చింది. ఉల్లిపాయ ఏంటీ సమస్యను తీర్చడమేంటి అనేగా డౌట్. అసలు విషయం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ పై రవాణా పన్ను విధించిన సంగతి తెలిసిందే. దానికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి పన్ను విధించవద్దని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా పన్ను విధించింది. దాంతో ఏపీ కూడా తెలంగాణ ప్రభుత్వంపై రవాణా పన్ను వేసింది. దీంతో ప్రభుత్వాల సంగతేమో కాని దీనివల్ల రెండు రాష్ట్రాల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాని ఇప్పుడు రాష్ట్రంలో ఉల్లిపాయ ధరలు పెరుగడంతో తెలంగాణ ప్రభుత్వం రావాణా పన్నుతో ఇబ్బందులు పడుతోంది. అదెలా అంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉల్లి విక్రయాలు దాదాపు కర్నూలు రైతుల నుండే జరుగుతాయి. ఈనేపథ్యంలో ఏపీకీ రవాణా పన్ను వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వచ్చిన సమస్యల్లా తెలంగాణా ప్రభుత్వానికే..  కిలో ఉల్లి పై రూ.6 వరకు రవాణా భారం పడుతోందట.. కానీ రైతు బజార్లలో రూ.20 కే ప్రభుత్వం కిలో ఉల్లిని ఇస్తుండడంతో ఈ రవాణా భారం కూడా నేరుగా ప్రభుత్వంపైనే పడుతోంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వానికి జ్ఞానోదయమై ఏపీ ప్రభుత్వంతో రవాణా పన్నుపై సంప్రదింపులు జరిపారు. ఏపీ అధికారులతో చర్చించి ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ఒక రాష్ట్ర వాహనం రెండో రాష్ట్రంలో ప్రవేశిస్తే రూ.5 వేలు చెల్లించాలి.. ఆఖరికి ఏడాదికి మొత్తం మీద ఎన్నివాహనాలు తిరిగాయో లెక్కించి దాని ప్రకారం ఆ సొమ్మును రెండు రాష్ట్రాలూ సమానంగా పంచుకోవాలి.. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం. అయితే ప్రస్తుతానికి రెండు రాష్ట్రల అధికారులు చర్చించుకున్నా ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. అంతా ఒకే అయితే అక్టోబరు 1 నుంచి ఈ ప్రోసెస్ ను రెండు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను ఎవరూ తీర్చలేకపోయినా ఉల్లిపాయ తీర్చింది.

వాజుపేయి కల.. చంద్రబాబు ద్వారా తీరింది

  ఏపీ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానంలో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు పట్టిసీమ పంపు నుండి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫైలాన్ ను ఆవిష్కరించారు. దీనికి కృష్ణ-గోదావరి నదుల పవిత్ర సంగమం అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నదుల అనుసంధానం పై మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి చంద్రబాబును ప్రశంసించారు. ఈ సందర్భగా కేంద్రమంత్రి వెంకయ్య మట్లాడుతూ నదుల సంధానం అనేది వాజుపేయి కల చంద్రబాబు ద్వారా అది నెరవేరిందని.. నదుల అనుసంధానికి పట్టిసీమ తొలి అడుగు అని.. గంగా, కావేరీ నదుల అనుసంధానానికి పట్టిసీమ స్ఫూర్తి అని అన్నారు.

పవన్ తో సినిమా తీస్తానంటున్న యంగ్ హీరో

యువ హీరో నితిన్...పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ పట్ల తనకున్న అభిమానాన్ని, పిచ్చిని గతంలో ఎన్నోసార్లు బహిరంగంగా చాటుకున్న నితిన్...ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ అవకాశమిస్తే, ఆయనతో సినిమా తీస్తానంటూ ప్రకటించాడు. పవన్ తో సినిమా నిర్మించే అవకాశం వస్తే, అది తన కెరీర్ లోనే చాలా స్పెషల్ అవుతుందంటున్న నితిన్...ఇతర పనులేమీ పెట్టుకోకుండా దానిపైనే ఫోకస్ పెడతానంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే అక్కినేని అఖిల్ హీరోగా లాంఛింగ్ ఫిల్మ్ ను నిర్మిస్తున్న నితిన్... ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. అంతేకాదు అఖిల్ ఆడియో ఫంక్షన్ కి తన అభిమాన హీరో పవన్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచాడు. అయితే పవన్ కు నితిన్ వీరాభిమని అన్న మాట నిజమే అయినా, అఖిల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా పవర్ స్టార్ కు  సోపేస్తున్నాడని అంటున్నారు. తన సినిమాల రిలీజ్ టైమ్ లోనూ ఏదోరకంగా పవన్ ను పొగుడుతూ, మెగా అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాడని, ఇది కూడా అలాంటిదేనని గిట్టనివాళ్లుంటున్నారు.

పవన్ సాహసం.. తమిళనాడులో దీక్ష?

కారణమేదైనా కావచ్చు ప్రతిపక్షనేతలకు వ్యతిరేకంగానే.. తమ డిమాండ్లు తీర్చాలనో ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు.. ఎన్నో రకాల దీక్షలు చేసుంటారు. అయితే అవి మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య చేసుంటారేమో కాని పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న మన ప్రజల కోసం చేసి ఉండరు. ఇప్పుడు ఎవరు పక్క రాష్ట్రంలో దీక్ష చేస్తున్నారు అనుకుంటున్నారా. సినీ రంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని.. పదవి కోసం నేతలను ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే తాను ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు నేతలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదాపైనా.. భూసేకరణ విషయంలో ప్రజలలో పవన్ కళ్యాణ్ మీద కాస్తంత నమ్మకం కలిగిందనే చెప్పాలి. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ కి చేసే సన్నాహంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మూహూర్తం కూడా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడుగు ముందుకేసి తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో నిరసన చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరో అడుగు వేయనున్నారు. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా నటుడు చేయని సాహసం చేయనున్నారు. తెలుగు కోసం.. తెలుగు భాషపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ.. తమిళనాడు రాష్ట్రంలో నిరసన చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్భంధ తమిళం చట్టం కారణంగా తమ మాతృభాషను చదువుకునే అవకాశం కోల్పోతున్నామని అక్కడి తెలుగు సంఘాలు వాపోతున్న కారణంగా దీనిపై నిరసన చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తమిళనాడులోని హోసూరులో దీక్ష చేయాలని పూనుకున్నారట. అయితే ఈ దీక్ష తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా.. కేవలం తెలుగు ప్రజలకు సంఘీభావం తెలిపే విధంగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. మొత్తానికి ఏ నాయకుడు చేయని..  ఏ హీరో చేయని పెద్ద సాహసాన్నే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అర్దమవుతోంది. మరి ఈ దీక్ష సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ఎంతో సంతోషంగా ఉందంటున్న లోకేష్

వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కి రెండో స్థానం దక్కడంపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక తమలో కొత్స ఉత్సాహాన్ని నింపిందని, ఇది కేవలం చంద్రబాబు పనితీరుకు లభించిన గౌరవమని అన్నారు. అలుపెరగకుండా చంద్రబాబు కష్టపడటం వల్లే...ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం దక్కిందన్న ఆయన, త్వరలో టాప్ ప్లేస్ చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. సొంత రాష్ట్రం నుంచి పూర్తిస్థాయిలో పాలన ప్రారంభమైతే, ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని, త్వరలో అదికూడా జరుగుతుందన్నారు. పైగా ఫోన్ ట్యాపింగ్ లు చేయించుకునే బాధ కూడా తప్పతుందంటూ లోకేష్ సెటైర్లు కూడా వేశారు. మొత్తానికి ప్రపంచ బ్యాంక్ నివేదిక బూస్టింగ్ లాగా పనిచేసి ఇటు చంద్రబాబులోనూ, అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపింది

కేసీఆర్ చైనా టూర్.. 9 రోజుల నుండి ఒకటే మాట

  మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ పదిరోజుల చైనా పర్యటన విజయవంతంగా ముగిసింది. పదిరోజుల చైనా పర్యటనలో కేసీఆర్ అనేక ప్రదేశాలు.. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలను తెలంగాణ ప్రభుత్వం ఎలా ఆదరిస్తుంది తదితర అంశాలపై కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తొమ్మిది రోజులు చైనాలోనే పర్యటించిన కేసీఆర్.. అక్కడ ప్రసంగించిన అన్ని రోజులు దాదాపుగా ఒకే అంశం కావడం ఆశ్చర్యకరమైన విషయం. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని ఎర్ర తివాచీతో స్వాగతిస్తామని.. చెప్పిన మాటలనే తొమ్మిది రోజుల నుండి చెప్పడం.. ఆమాటలు కూడా విసిగిపోకుండా వినేలా చేయడం ఆక్రెడిట్ ఒక్క కేసీఆర్ కే దక్కింది. మొత్తానికి చెప్పిన విషయాన్ని తొమ్మి రోజుల నుండి మార్చి మార్చి చెపుతున్నా కేసీఆర్ ఆ పర్యటనలో సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి కేసీఆర్ బృందం హైదరాబాద్ చేరుకోనున్నారు.

మరో కొత్త యాత్రకు రెడీ అవుతున్న జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. హోదా ఉద్యమంలోకి యువతను లాగాలనుకుంటున్న జగన్... యూనివర్సిటీల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈనెల  26న గుంటూరులో తలపెట్టిన దీక్షకు ముందే, అన్ని యూనివర్సిటీలను చుట్టేయాలని షెడ్యూల్ రెడీ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి...నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీతోపాటు అన్ని విశ్వవిద్యాలయాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. విద్యార్ధుల మద్దతు ఉంటేనే, తాను చేపట్టే హోదా దీక్ష సక్సెస్ అవుతుందని భావిస్తున్న జగన్, స్వయంగా వెళ్లి మద్దతు కోరాలనుకుంటున్నారు. మరోవైపు  13 జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించడంతోపాటు, పెద్దఎత్తున యువతను దీక్షాస్థలికి తీసుకురావాలని పార్టీ నేతలకు జగన్ ఆదేశించారట. మరి జగన్ ఆశిస్తున్నట్లుగా విద్యార్ధి లోకం...కదిలి వస్తుందో లేదో చూడాలి

ఏపీకీ పెట్టుబడుల ప్రవాహం.. మూడు సెల్ కంపెనీలు

  ఏపీకి అరుదైన ఘనత దక్కడంతో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది.  దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఉన్న ప్రదేశాల్లో రెండో స్థానం దక్కించుకోవడం రాష్ట్రానికే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఆనందాన్నిచ్చే అంశం. ఒకపక్క చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి.. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో  చంద్రబాబు సర్కారుకు తీపి కబురును అందించింది. దీనిలో భాగంగానే చంద్రబాబు విజయవాడలోని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మూడు ముబైల్ కంపెనీలు తమ పెట్టుబడులను ఏపీ పెట్టడానికి గాను ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఏర్పాటు చేసిన వేదిక మీదే మైక్రోమ్యాక్స్.. సెల్ కాన్.. కార్బన్ కంపెనీలు తమ పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చారు. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో తమ ఫ్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు రావడం.. కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు ఎంవోయూలు కుదుర్చుకోవటం వెంటవెంటనే జరిగిపోవడం విశేషం. ఇప్పటికే ఏపీలో ప్రముఖ మొబైల్ కంపెనీ జియోమీ తన ఉత్పత్తిని ఏపీలో స్టార్ట్ చేసింది. దీంతో మొత్తం నాలుగు మొబైల్ కంపెనీలు ఏపీకి వచ్చాయి. మొత్తానికి ప్రపంచ బ్యాంకు నివేదిక పుణ్యమా అని ఏపీలోకి పెట్టుబడులు రావడం ఆనందాన్నిచ్చే అంశమే.

శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం

రైళ్లలో దోపిడీ దొంగల ఆగడాలు పెచ్చిమీరిపోతున్నాయి, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని రైల్వే అధికారులు చెబుతున్నా, దొంగల ఆగడాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. రెండ్రోజుల క్రితం సింహపురి ఎక్స్ ప్రెస్ లో లేడీ ఐపీఎస్ పై జరిగిన దాడిని మరిచిపోకముందే, మరో ట్రైన్ లో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. కాకినాడ నుంచి బెంగళూర్ వెళ్తున్న శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో చొరబడిన దొంగలు... నెల్లూరు జిల్లా మనుబోలు దగ్గర చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్-2, ఎస్-7, ఎస్-8 కోచ్ లలో ప్రయాణికులను కత్తులతో బెదిరించిన దొంగలు...నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు.ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రామ్ చరణ్... భయపెట్టాడంటున్న మహేష్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి నిద్రపట్టకుండా చేశాడట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ప్రిన్స్ మహేశ్ బాబే వెల్లడించారు. శ్రీమంతుడు సినిమా రిలీజ్ కి ముందు రామ్ చరణ్ మగధీర సినిమాను తలచుకుని, తెగ భయపడ్డానని చెప్పుకొచ్చారు. మగధీర లాంటి బిగ్ హిట్ తర్వాత రెండు మూడు నెలలపాటు ఏ సినిమా కూడా విజయాన్ని చవిచూడలేదని, అలాగే శ్రీమంతుడి విషయంలోనూ జరుగుతుందని భయపడ్డానన్నారు. బాహుబలి తర్వాత కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని, దాంతో శ్రీమంతుడు రిజల్ట్ ఎలా ఉంటుందోనని రిలీజ్ కు ముందు టెన్షన్ పడినట్లు తెలిపారు. కానీ తన టెన్షన్ ను పటాపంచలు చేస్తూ, శ్రీమంతుడు సూపర్ హిట్ అయ్యిందని ప్రిన్స్ సంతోషం వ్యక్తంచేశారు.

రేవంత్, ఎర్రబెల్లి.. కోల్డ్ వార్ ముగిసిందా?

  తెలంగాణ  తెలుగుదేశం పార్టీలో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.  ఏపీ సీఎం చంద్రబాబు టీ టీడీపీ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారా లేదా ఎర్రబెల్లికి అప్పగిస్తారా అన్న నేపథ్యంలో ఈ ఆధిపత్యపోరు బయటపడింది. అసలు ఒకే పార్టీ అయినా రేవంత్ రెడ్డికి.. ఎర్రబెల్లికి ఎప్పటినుండో సఖ్యత లేదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకానొక సందర్బంలో ఈ ఇరువురు నేతలు మధ్య మాటలు కూడా తగ్గిపొయాయి. ప్రత్యక్షంగా ఒకరినొకరు తిట్టుకోకపోయినా పరోక్షంగా మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతూనే ఉండేది. అది ఇప్పుడు ఇంకోసారి బహిర్గతం అయింది. అయితే నిన్నటి వరకూ వీరిద్దరి మధ్య ఉన్న పోరు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందంటున్నాయి రాజకీయ వర్గాలు. వీరిద్దరి మధ్య రాజీ కుదిరిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి ఇచ్చినా తాను మాత్రం ఎర్రబెల్లికి ఇప్పుడున్న పెద్దరికపు హోదానే కొనసాగిస్తానని చెప్పడం.. ఆ విషయంలో తాను పోటీపడనని.. చెప్పడంతో ఎర్రబెల్లి కూడా సమాధానపడినట్టు తెలుస్తోంది. అంతేకాక టీఆర్ఎస్ పై రేవంత్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు కూడా చెప్పడంతో తాను కూడా దీనికి ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా మరోవైపు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై పోరాడినట్టు ఎర్రబెల్లి తాను పోరాడలేనని తెలిసే తాను ఈ ఒప్పందానికి అంగీకరించారని.. కేవలం రేవంత్ కు మద్దతు తెలిపేందుకు సిద్దమయ్యారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. మొత్తానికి కారణమేదైనా ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఆ ఆసఖ్యత పోవడం పార్టీకే లాభదాయకం.

పొంగులేటి అందుకే వెళ్లిపోయారా?

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. టీకాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం సాక్షిగా నేతల మధ్య అనైక్యత మరోసారి బయటపడింది. కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో ఈ మధ్య కలిసికట్టుగా ముందుకెళ్తున్నారని అనిపించినా, ఇంతలోనే విభేదాలు రచ్చకెక్కాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సమావేశమైన భేటీ నుంచి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు, ఎక్స్ గ్రేషియా, రుణమాఫీ అంశాలపై సభను స్తంభింపజేయాలని నిర్ణయం తీసుకోగా, తాను సూచించిన పోలవరం ముంపు గ్రామాల అంశాన్ని అజెండాలో ఎందుకు చేర్చలేదంటూ పొంగులేటి ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తన డిమాండ్ పై మిగతా నేతల సరిగా స్పందించకపోవడంతో  అలిగిన పొంగులేటి...సోనియా వద్దే తేల్చుకుంటానంటూ సమావేశం మధ్య నుంచి వెళ్లిపోయారు.

మహేష్ బాబుపై చంద్రబాబు పొగడ్తల వర్షం

శ్రీమంతుడు సినిమా రిలీజై...ఆరు వారాలవుతున్నా, ఇంకా సంచలనాలు స-ష్టిస్తూనే ఉంది.  బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లతో కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ శ్రీమంతుడు... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని సైతం మెప్పించింది. అత్యంత బిజీ షెడ్యూల్ లోనూ కాస్తంత తీరిక చేసుకుని...శ్రీమంతుడు సినిమా చూసిన టీడీపీ అధినేత... ఆ చిత్ర యూనిట్ ను అభినందించారు. మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజానికి ఎంతోకొంత తిరిగివ్వాలన్న కాన్సెప్ట్ చాలా బాగుందని, మహేష్ అద్భుతంగా నటించాడని మెచ్చుకున్నారు.తాను ప్రారంభించిన స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డ్ కాన్పెప్ట్ ను సినిమాను పోలి ఉందన్న చంద్రబాబు... ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ట్వీట్స్ కు స్పందించిన ప్రిన్స్ మహేష్ ...తమ సినిమా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ రిప్లై ఇచ్చారు.

జగన్ వారికి చిల్లిగవ్వ ఇవ్వలేదు

  టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని విమర్శించారు. తన కంపెనీలకు పెట్టుబడి పెట్టిన వారికి చిల్లిగవ్వకూడా జగన్ ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అనువైన ప్రదేశాల ఎంపికలో ఏపీ రెండవ స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఈ సందర్బంగా ఆయన పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం చాలా సంతోషకరమైన వార్త అని అన్నారు. రాష్ట్రం విడిపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏపీకి ఇలాంటి అరుదైన ఘనత దక్కడం చాలా అభినందనీయమని అన్నారు. చంద్రబాబు కూడా ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నారని.. అవినీతి పేరిట వైఎస్ లూటీ చేసిన డబ్బును ప్రజలకు అప్పగిస్తే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని సోమిరెడ్డి విమర్శించారు.

రేవంత్ రెడ్డిని చూడాలని ఉంది

  నల్గొండ జిల్లా చంద్రపేట మండలంలోని ఓ భూమి వివాదంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు.. టీడీపీ నే తకు చందూలాల్ మధ్య వివాదం జరిగింది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు చందూలాల్ పై దాడి చేయగా ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చందూలాల్ ను హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే చందూలాల్ తనకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చూడాలనిపిస్తుందని కోరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తాను వస్తున్నట్లుగా చందూలాల్ కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి చెప్పారు. తాను వెంటనే బయలుదేరి వస్తున్నానని.. ధైర్యంగా ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా రేవంత్, ఇతర టిడిపి నేతలు ఉదయం చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లారు.

టీ సర్కార్ కు మరోసారి సుప్రీం చురక

ఇప్పటికే ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వం తమ సొంతగా తీసుకున్న నిర్ణయాలకు గాను అటు హైకోర్టులో కాని.. ఇటు సుప్రీంకోర్టులో కాని మొట్టికాయలు తింటునే ఉంది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలవల్లనో లేక.. కావాలని ఒంటెద్దు పోకడని అనుసరిస్తూ తీసుకున్న నిర్ణయాలే కావచ్చు కాని మొత్తానికి పలుమార్లు ధర్మాసనాల చేతిలో టీ సర్కార్ చురకలు వేయించుకుంది. ఇప్పుడు కూడా తాజాగా టీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కళింగులు బీసీల వర్గానికి చెందేవారిగా చట్లాలు అమల్లో ఉండేవి. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కళింగ సామాజిక వర్గం లేనందున రాష్ట్రం ఆ వర్గాన్ని బీసీ జాబితా నుండి తీసేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వైద్య విద్యాకోర్సుల్లో తాము రిజర్వేషన్లు కోల్పోతున్నామంటూ ఇద్దరు వైద్య విద్యార్ధినులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి తలంటింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాల అమలు ప్రకారం వారికి రిజర్వేషన్లు ఉన్నప్పుడు  ఏ ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు తీసేస్తారని ప్రశ్నించింది. ఏపీకి చెందిన విద్యార్థులు రిజర్వేషన్లు ఉందని వస్తారు.. లేవని మీరెలా చెప్తారు అని గట్టిగా అడిగింది. విభజన వల్ల కొన్ని జిల్లాలు ఒక రాష్ట్రానికి వెళ్లినంత మాత్రాన రిజర్వేషన్లు చెల్లవని చెప్పటం సమంజసం కాదని అభిప్రాయపడటం గమనార్హం. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల పలు అంశాల్లో ఇలా చురకలు అంటించుకోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.