తనపై కుట్ర జరుగుతోందంటున్న కేఈ
ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మినిస్టర్ గా ఉన్న తనను అసలు పట్టించుకోవడం లేదని, ఇటు ప్రభుత్వం, అటు పార్టీ నిర్ణయాల్లోనూ కనీసం తనను లెక్కలోకి తీసుకోవడం లేదని కేఈ వాపోతున్నారట. పైగా రెవెన్యూశాఖలో అవినీతి బాగా పెరిగిపోయిందంటూ సీఎం చంద్రబాబు తనను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేబినెట్ మీటింగ్స్ లోనూ, కలెక్టర్ల సమావేశాల్లోనూ...పదేపదే అవినీతి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమంటూ బాధపడుతున్నారట. సీనియర్ ను అయన తన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలపై తాను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ నాలుగుసార్లు రద్దుచేశారని, రాజధాని భూసమీకరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణ, మచిలీపట్నం పోర్ట్ వంటి కీలక నిర్ణయాల్లోనూ తనను పక్కనబెట్టారని ఆవేదన చెందుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకున్నా అదేరీతిలో అవమానిస్తున్నారని, ఇవన్నీ దేనికి సంకేతమో తెలియడం లేదని, కానీ ఆలోచించాల్సిన అవసరమైతే ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారట.