టీ మంత్రులు.. ఏపీ మంత్రులను చూసి నేర్చుకోండి
posted on Sep 14, 2015 @ 12:07PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు పోటీ పడి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే రోజురోజుకి వీరి సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడంలేదు. మరోవైపు రెండు రాష్ట్ర రాజకీయ నేతలు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకోవడం తప్ప ఏ కనిపించట్లేదు. అయితే ఒక రకంగా రైతు ఆత్మహత్యల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి కంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఒక రకంగా మెచ్చుకోదగ్గదేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల పట్ల పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు వెళ్లడం కాని.. వారిని పరామర్శించడం కాని చేసింది లేదు. అంతెందుకు రెండు రోజుల క్రితం చనిపోయిన లింబయ్య అనే రైతుది ఆత్మహత్యే కాదని దబాయించింది. మరోవైరు ప్రతిపక్ష పార్టీనేతలు కూడా రైతుల ఆత్మహత్యలపై అధికార ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చురకలు వేస్తున్నా.. వారి ఆత్మహత్యల గురించి పట్టించుకోవాలని చెపుతున్నా వారు మాత్రం వినీ విననట్టు ప్రవర్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు ఏపీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకుంటన్నట్టే తెలుస్తోంది. ఎందుకంటే పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రులు అక్కడి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని పరామర్సించి రైతు మృతి పట్ల సానుభూతి తెలిపారు. అంతేకాక రైతు కుటుంబానికి ప్రభుత్వం తప్పకుండా సహాయం అందిస్తుందని.. పొగాకు తక్కువ క్వాలిటీ ఉన్నా కూడా కొనుగోలు ఏర్పాట్లు ప్రభుత్వం తరఫునే చేయబోతున్నాం కాబట్టి రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి వచ్చారు.
దీనిని బట్టి కాస్తో కూస్తో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం కంటే ఏపీ ప్రభుత్వమే పట్టించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈవిషయంలో తెలంగాణ మంత్రులు ఏపీ మంత్రులను చూసి నేర్చుకోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర కలిసున్నా.. రాష్ట్రం విడిపోయినా రైతు అనే వాడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అందులోనూ రెండు రాష్ట్రాలకు వ్యవసాయమే జీవనాధారం. మరి అలాంటి రైతుల గురించి.. వారి బాగోగులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.