కిరణ్ పేరు చెప్పి టీసర్కార్ నాటకాలాడుతోందా?
posted on Sep 14, 2015 @ 2:56PM
ఉద్యోగుల ప్రమోషన్ పై కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల ఇప్పుడు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.
రాష్ట్రం విడిపోకముందు కిరణ్ కుమార్ రెడ్డి 2013లో ఈ నిషేదం విధించారు. అయితే రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దాదాపు పదిహేను నెలలు గడిచిన తెలంగాణ ఉద్యోగులకు మాత్రం ప్రమోషన్లు కరువయ్యాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన నిషేదింపునే కొనసాగించడం గమనార్హం. ఎందుకంటే ఏపీ ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా చేయడమే కేసీఆర్ నైజం అలాంటిది.. మరి ఉద్యోగుల ప్రమోషన్ నిషేదం మాత్రం ఎందుకు పట్టించుకోవడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నిషేదం మూలంగానే ఇప్పటి వరకూ రిటైర్ మెంట్ అయిన ఉద్యోగులు ప్రమోషన్ లు వాటికి సంబంధించిన ప్రయోజనాలు పొందకుండానే పాపం రిటైర్ కావాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల వివాదంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టు కూడా ఈవిషయంపై సీరియస్ అవడంతో తొందరలోనే ఈ సమస్య కూడా ఓ కొలిక్కి రావచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగులు కూడా ప్రమోషన్లపై దృష్టి సారించాలని... ప్రమోషన్ల అంశం లేకుండా ఉద్యోగుల పంపిణీ చేయోద్దని కోరుతున్నారు.
అయితే అసలు విషయం ఏంటంటే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్రం విడిపోయిన తరువాత దానిని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది సమస్యగా మారింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రమోషన్లు అమలు చేస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రమోషన్లు ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి విధించిన నిషేదం అడ్డుగా ఉందని కుంటి సాకులు చెబుతుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వకుండా ఆ నెపాన్ని కిరణ్ కుమార్ రెడ్డిమీదకి తోసి నాటకాలాడుతున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. ఆంధ్రాకి అడ్డురాని నిషేదం.. టీ సర్కార్ కు అడ్డు వచ్చిందా అంటూ కొంతమంది మండిపడుతున్నారు.