షర్మిల ప్రజాప్రస్థానం టార్గెట్ తెలుగుదేశం
posted on Oct 19, 2012 8:44AM
కడప ఎంపి వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి, వైకాపా నాయకురాలు షర్మిల పాదయాత్ర ‘మరో ప్రజాప్రస్థానం’ పేరిట ప్రారంభమైంది. ఆమె ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ఘాట్లో నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖరరెడ్డి తన రాజకీయజీవితంలో మలుపు కోసం చేపట్టిన రాజకీయప్రస్థానాన్ని తలపించేలా షర్మిల తన పాదయాత్రకు పేరు పెట్టించుకున్నారు. ఈ ప్రస్థానంతో ఆమె రాజకీయజీవితంలో ఎదగగలరో? లేదో? కూడా తేలిపోనుంది. ఈమె ఏకైక టార్గెట్ తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం వస్తున్నా పాదయాత్ర. అవకాశం దొరికినప్పుడల్లా తన తండ్రి తరహాలో చంద్రబాబుని విమర్శించడం షర్మిల స్టైల్. అయితే అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ, నేడు ఆయన ప్రతిపక్షనేత. అందువల్ల వెనుకడుగువేయాల్సిన పని లేదని చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. తాను ఎటువంటి ఆరోపణపైనైనా సమాధానమివ్వటానికి సిద్ధమన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో చంద్రబాబును ఎదుర్కోటానికి షర్మిల కూడా సిద్ధమయ్యారు. తన తల్లి, సోదరుడు ఆరోపించినట్లు కాకుండా విధానపరమైన చంద్రబాబు లోపాలపై ఆమె ఇప్పటికే పలువురు నాయకులతో చర్చించారట. ఈ చర్చల్లో తేలిన అంశాల ఆధారంగా బాబును ఇరకాటంలో పెట్టేందుకు షర్మిల సిద్ధంగా ఉన్నారు. అలానే తమ పార్టీ రాజకీయనేత, రచయిత యండమూరి వీరేంధ్రనాధ్తోనూ, సినీరచయిత, నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంతోనూ షర్మిల ఎటువంటి విమర్శలు బాగా ప్రాచుర్యం పొందుతాయో కనుక్కొన్నారు. వాటికి మాత్రమే షర్మిల ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఏదేమైనా పోటీపాదయాత్రల ఘట్టం ప్రారంభమైంది.