నటి హేమశ్రీ హత్యకేసు, డ్రైవర్ అరెస్ట్
posted on Oct 18, 2012 @ 5:35PM
కన్నడనటి హేమశ్రీ హత్యకేసులో కీలక వివరాలు ఒక్కొటొక్కటిగా బైటపడుతున్నాయి. బుధవారం రాత్రి డ్రైవర్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. హేమశ్రీ భర్త సురేంద్ర బాబు ఆమెను తరలించడానికి డ్రైవర్ సతీష్ సహరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసుకి సంబంధించిన మరిన్ని వివరాల్ని సేకరించేందుకు పోలీసులు హేమశ్రీ తల్లిని ప్రశ్ని౦చారు. క్లోరో ఫామ్ ఎక్కువగా ఇచ్చినందువల్లే హేమశ్రీ మృతి చెందిందన్న నిజాన్ని ఆమె భర్త సురేంద్ర పోలీస్ ఇంటరాగేషన్ లో ఇప్పటికే బైటపెట్టేశాడు. సురేంద్ర ఇచ్చిన సమాచారంతో తీగలాగిన బెంగళూరు పోలీసులకు హత్య వెనక మాజీ కార్పొరేటర్ మురళి హస్తం కూడా ఉందన్న విషయం తెలిసిపోవడంతో కేసులో చిక్కుముడి వీడిపోయింది. హేమశ్రీ మృతికి సంబంధించి ఆమె మిత్రుడు మంజునాథ్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. హేమశ్రీ హత్యకు ముందు అతను ఆమెతో మాట్లాడిన సిడీని విడుదల చేశాడు. తన భర్త సురేంద్ర నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని హేమశ్రీ చెబుతున్నట్లు ఉన్న సీడిని అతను మీడియాకు విడుదల చేశాడు. ఈ నేపథ్యంలోనే మంజునాథ్‌ను పోలీసులు విచారించి, పంపించి వేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు అతనికి చెప్పారు.