మైనార్టీ కుంభకోణం డబ్బుతో టీవీ ఛానెల్ కొనేశారు
posted on Oct 19, 2012 @ 10:00AM
రాష్ట్ర మైనార్టీ శాఖ నిధులను సుమారు 55 కోట్ల రూపాయల మేర నిర్భయంగా స్వాహా చేసిన నిందితులు ఆ డబ్బుతో ఇంకా ప్రారంభంకాని తెలుగు టీవి న్యూస్ ఛానల్ను కొనుగోలు చేసినట్లు తెలుగువన్ డాట్ కామ్ పరిశోధనలో తేలింది. ఫోర్జరీ డాక్టుమెంట్లతో ఎ.పి. స్టేట్ మేనార్టీస్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరిట విజయ బ్యాంక్ లో ఎక్కౌంట్లు ఓపెన్ చేసి ప్రభుత్వం విడుదల చేసిన రూ. 80 కోట్లతో 55 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఖర్చు చేశారు. అయితే ఇలా చేసిన ఖర్చులో ఎనిమిది కోట్ల రూపాయలతో విజయవాడ కేంద్రంగా ఇంకా ప్రారంభం కాని న్యూస్ ఛానల్ కొనుగోలు చేయడం ఒక కోణమైతే ఆ ఛానల్ కు చెందిన ఒక పార్టనర్ మరో పార్టనర్ను మోసగించి ఈ ఎనిమిది కోట్లలో ఐదు కోట్లు నొక్కేయడం మరో కోణం. ఈ ప్రధాన స్కామ్ తో పాటు మినీ స్కాంలో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ( గతంలో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి ) హైదరాబాద్కు చెందిన ఇద్దరు టి.వి. జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ముగ్గురిలో ఒకరిని ఇప్పటికే సి.బి.సి.ఐ.డి. అధికారులు ప్రశ్నించగా విజయవాడ వాసి గుట్టు చప్పుడు కాకుండా అమెరికాలోని తమ కుమార్తె వద్దకు చెక్కేయడానికి టికెట్లు బుక్ చేసుకున్నాడని అతను నేడో రేపో దేశ సరిహద్దులు దాటి పోతాడని తెలిసింది.
విజయవాడ కేంద్రంగా ఒక న్యూస్ ఛానల్ ప్రారంభించి నూతన ‘అంకా‘నికి నాంది పలకాలని ఆ విజయవాడ మాజీ జర్నలిస్టు గత రెండేళ్ళుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతనికి రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తి ఒకరు అభయమివ్వడమే గాక సుమారు మూడు కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చాడు. నూతన అంకానికి తెరలేపాలనుకున్న వ్యక్తి మాత్రం తన వంతు పెట్టుబడిపై తాత్సారం చేస్తూ ఛానల్ను తేలేక చేతులెత్తేయడంతో అ్పపటికే అభయం ఇచ్చి నిధులు కూడా విడుదల చేసిన వ్యక్తి తన డబ్బు సంగతేంటని నిలదీయసాగాడు. ఈ నేపధ్యంలో మైనార్టీ స్కాంలో అప్పణంగా డబ్బు కొల్లగొట్టిన నిందితుల్ని హైదరాబాద్కు చెందిన ఇద్దరు టి .వి. జర్నలిస్టులు నూతన అంకానికి తెరలేపాలనుకున్న విజయవాడ వాసికి పరిచయం చేయడం ఇతను ఇంకా తెరలేపని ఛానల్ను ఎనిమిది కోట్లకు విక్రయించడం జరిగింది. ఈ ఎనిమిది కోట్లలో కేవలం రూ.3.02 కోట్లను మాత్రమే అభయ మిచ్చిన వ్యక్తికి ఇచ్చి మిగిలిన ఐదు కోట్లను ముగ్గురు స్వాహా చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సి.బి.సి.ఐ.డి వీరు జరిపిన లావాదేవీలపై సమాచారం ఇవ్వవలసిందిగా ఆదాయ పన్ను శాఖను కోరింది. ఈ శాఖ విచారణలో ఈ మినీ కుంభకోణం బైటపడింది.