మోడీ-రాహుల్ ప్రసంగాలలో వ్యత్యాసం
posted on May 1, 2014 @ 9:34AM
నిన్న ఒకేసారి ఇద్దరు ప్రధాని అభ్యర్ధులు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ సీమాంధ్రలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఇద్దరూ కూడా రాష్ట్ర విభజన, సీమాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. అయితే వారిరువురిలో రాహుల్ ప్రసంగం సగటు ఎన్నికల ప్రసంగంలాగే ఆకర్షణీయమయిన హామీలతో సాగింది. కానీ మోడీ మాత్రం చాలా నిర్మాణాత్మకంగా ప్రసంగించారు.
సీమాంధ్రకు ఉన్నఅపారమయిన సహజ వనరుల నుండి సంపద ఏవిధంగా సృష్టించుకొనే అవకాశాలున్నాయో ఉదాహరణలతో సహా విశదంగా వివరించిన మోడీ, తమకు ఓటేస్తే వాటిని వెలికి తీసేందుకు సీమాంధ్రకు తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ షరా మామూలుగా తమకు ఓటేస్తే ఆంధ్రాలో ఉన్నత విద్యాసంస్థలు నిర్మిస్తామని గాలిమేడలు కట్టి చూపించే ప్రయత్నం చేసారు. ఆయన ప్రసంగం యావత్తు మూస ఎన్నికల ప్రసంగంగానే సాగింది. కాపులను బీసీలో చేర్చడం, వాల్మీకి, వడ్డెర, రజకులను ఎస్సీలో చేర్చడం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పేదలకు ఇళ్ల నిర్మాణం, వద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ సౌకర్యాలు, పేదవారికి ఉచిత వైద్య సౌకర్యం వగైరాలనీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్న హామీలే.
తగినంత విద్యుత్ ఉత్పత్తి లేని కారణంగా పెద్ద పెద్ద పట్టణాలలో సైతం నేడు రోజుకు ఆరేడు గంటలు విద్యుతో కోతలు విధిస్తూ, మరోపక్క నిత్యం పెంచే విద్యుత్ చార్జీలతో గత ఐదేళ్ళుగా తమ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలను చావగొడుతున్న సంగతి తెలియనట్లు, రాహుల్ గాంధీ గృహాలకు వంద యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడం ప్రజలను అపహాస్యం చేయడమే.
కానీ మోడీ మాత్రం అటువంటి హామీలు ఏవీ ఇవ్వకుండా, సమర్దుడయిన చంద్రబాబు రాష్ట్రాభివృద్దికి చేసే ప్రయత్నాలకు తాను కేంద్రం తరపున పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో కూడా చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని చెపుతూ అందుకు మోడీ కొన్ని సూచనలు కూడా చేసారు. వాజపేయి ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రధాన నగరాలను, పట్టణాలను, పల్లెలను కలుపుతూ రోడ్లు నిర్మించారని, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో రైతులందరి పొలాలకు నీరు అందించేందుకు నదుల అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక మోడీ తన ప్రసంగంలో కాంగ్రెస్ అధిష్టానం, జగన్మోహన్ రెడ్డిలపై తీవ్రంగా విమర్శలు గుప్పించగా, రాహుల్ మాత్రం జగన్ గురించి పల్లెత్తు మాటనకపోవడం గమనార్హం. ఇది వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణలు చేస్తున్న పవన్, చంద్రబాబు వాదనలకు బలం చేకూరుస్తోంది. తాను అధికారంలోకి వస్తే అవినీతి పరులను ఒక్కొకరినీ ఏరిపారేస్తానని మోడీ చెప్పడం, వైకాపాకు ఓటేసి రాష్ట్రాన్ని ‘స్కాం ఆంధ్రా’గా మార్చుకొంటే తను రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందించలేనని చెప్పడం ద్వారా మోడీ ఆంద్ర ప్రజలకు తన మనసులో మాటను చాల స్పష్టంగానే చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం జరగవలసి ఉన్నందున, మోడీ చెప్పిన మాటలు వైకాపాకు ఓటేద్దామని భావిస్తున్నప్రజలను పునరాలోచింపజేయవచ్చును.
మోడీ ప్రజలను ఆక్కట్టుకోనేందుకు చేసిన రాజకీయ విమర్శలను పక్కనబెట్టి చూసినట్లయితే, ఆయన ప్రసంగంలో చాల వరకు నిర్మాణాత్మకమయిన ప్రతిపాదనలే కనిపిస్తాయి. కానీ రాహుల్ తన రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేయకపోయినా, కేవలం గాలిమేడలు కట్టి చూపడం తప్ప కనీసం మోడీలా నిర్మాణాత్మకమయిన మాట ఒక్కటీ చెప్పలేకపోయారు. ఈ ఇరువురు ప్రధాని అభ్యర్దుల ప్రసంగాలు వారి మానసిక, రాజకీయ పరిపక్వత, దూరదృష్టి, ఆలోచన స్థాయిలలో వ్యత్యాసాన్ని ప్రజలకు పట్టి చూపుతున్నాయి.