తెలంగాణాలో అధికారం కోసం వాద ప్రతివాదాలు
posted on Apr 25, 2014 7:05AM
కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది తామేనని సగర్వంగా చెప్పుకొంటున్నారు. తమ వల్లనే 60 ఏళ్ల తెలంగాణా ప్రజల కల సాకారమయ్యిందని చెప్పుకొంటున్నారు. అందుకోసం తమ అధినేత్రి సీమాంద్రా(కాంగ్రెస్ పార్టీ)ను బలిపెట్టుకొందని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. తెలంగాణా ఇచ్చిన ఘనత, క్రెడిట్ అంతా తమ ఖాతాలోనే జమ అవుతుందని వారు వాదిస్తున్నారు. అందువల్ల తెలంగాణా ప్రజలందరూ తమకే ఓటేసి కృతజ్ఞత చాటుకోవాలని టీ-కాంగ్రెస్ నేతలు సవినయంగా ప్రజలను నిలదీసి మరీ అడుగుతున్నారు. తమను మోసం చేసిన కేసీఆర్ ఒక నమ్మక ద్రోహి అని, ఆయన తెలంగాణా కోసం చేసిందేమీ లేదని వాదిస్తున్నారు. బీజేపీ, తెదేపాలు కూడా చివరి నిమిషం వరకు తెలంగాణా బిల్లుకి అడ్డుపడ్డాయని అటువంటి పార్టీలకు మీరు ఓటేస్తారా? అని ప్రజలను నిలదీస్తున్నారు. అటువంటి వారందరికీ ఓటేసి గెలిపిస్తే మీకే నష్టమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. వారి వాదనలో బలం, వారి అభ్యర్ధనలో నిజాయితీ ఉందని కాంగ్రెస్ పార్టీని అభిమానించే వారందరూ అనుకోవడంలో తప్పులేదు.
కానీ, తెరాస వాదనలో కూడా చాలా బలముంది. తాము పదేళ్ళపాటు ఎండనక, వాననకా రోడ్ల మీద ఉద్యమాలు చేసి ఒత్తిడి తెచ్చినందునే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ఇచ్చింది తప్ప లేకుంటే ఎప్పటికయినా తనంతట తానుగా తెలంగాణా ఇచ్చేదా?అని ప్రశ్నిస్తున్నారు. తాము రోడ్ల మీద ఉద్యమాలు చేస్తుంటే, ఇప్పుడు తెలంగాణా ఇచ్చాము, తెచ్చాము అని చెప్పుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ మంత్రి పదవులు అనుభవిస్తూ ఏసీ గదుల్లో కాలక్షేపం చేసిన మాట యదార్ధం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా కోసం 1100 మంది యువకులు బలిదానాలు చేసినా స్పందించని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తెలంగాణా క్రెడిట్ తమదేనని చెప్పుకొంటోందని ప్రశ్నిస్తున్నారు. ఇదే పని పదేళ్ళ క్రితమే చేసి ఉండి ఉంటే ఇంతమంది అమాయకులు ప్రాణాలు పోయేవా? తాము ఈ ఉద్యమాలు చేసే పని ఉండేదా? అని నిలదీస్తున్నారు.
అప్పుడే ఇచ్చి ఉండి ఉంటే తెరాసను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేయలేదని నిలదీయవచ్చు, కానీ పదేళ్ళ కొట్లాడిన తరువాత విధిలేక ఇచ్చినప్పుడు తామెందుకు కాంగ్రెస్ లో కలవాలని తెరాస నేతల ప్రశ్న? తెలంగాణా ప్రజల ఓట్లు, అక్కడ తమ భూములు, కూడబెట్టుకొన్న ఆస్తులను కాపాడుకోవడం మీదున్న శ్రద్ధ, తెలంగాణా ప్రాంతం, ప్రజల మీద లేని ఆంధ్రా పార్టీలకు, తెలంగాణాను అడ్డుకొన్న బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని తెరాస ప్రశ్న. తెలంగాణావాదులు అందరూ నూటికి నూరు శాతం ఈ వాదనతో అంగీకరిస్తారు.
చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకొన్నట్లు, తెలంగాణా ఉద్యమాలు పేరు చెప్పి కేసీఆర్ కుటుంబం బలవంతపు వసూళ్లు చేసిన మాట నిజం కాదా? కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకొన్న మాట నిజం కాదా? తెలంగాణా ప్రజలను, వారి భూములను, నీళ్ళని, ఉద్యోగాలని అన్నిటినీ ఆంధ్రావాళ్ళు దోచుకొన్నారని వాదిస్తున్న, మీరు తెలంగాణా ప్రజలను ఎందుకు దోచుకొన్నారు? అసలు ఉద్యమంలో వేడి రగిల్చి నిలుపుకొనేందుకే, ఉడుకు రక్తంగల విద్యార్ధులను రెచ్చగొడుతూ బలిదానాలకు ఉసిగొల్పింది నిజం కాదా? అని ప్రత్యర్ధ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణా ఏర్పడితే దానికి కాపలా కుక్కగా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని పదేపదే చెప్పి తీరాచేసి ఇప్పుడు తెలంగాణా ఏర్పడగానే అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాస్తున్న మీరు, ఇంతవరకు చేసిన ఉద్యమాలన్నీ అధికారం చేజ్జిక్కించుకోవడం కోసమేనా? అందుకే ప్రజలమధ్య విద్వేష భావనలు వ్యాపింపజేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారా? యువకుల బలిదానాలు, ప్రజల త్యాగాలు, ఉద్యమాలు చేస్తే దాని ఫలాలు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు అనుభవిస్తారా? అని కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు నిలదీస్తున్నాయి. వీరి వాదనలోను బలముందని అర్ధమవుతోంది.
ఈవిధంగా ఈ మూడు బలమయిన వాదనలలో ఎవరు తమ వాదాన్ని అందరి కంటే గట్టిగా వినిపిస్తారో వారే ఈ ఎన్నికలలో విజేతలుగా నిలుస్తారని ఆయా నేతలు భావిస్తున్నారు. కానీ, అంతిమ నిర్ణయం మాత్రం తెలంగాణ ప్రజలదే. వారు ఎవరి వాదనలో నిజాయితీ ఉందని భావిస్తారో వారికే ఓట్లు వేస్తారు తప్ప గొంతు చించుకొని అరుస్తూ, ఆచరణ సాధ్యం కానీ హామీలను గుప్పించినంత మాత్రాన్నఎవరికీ గుడ్డిగా ఓట్లేయబోరని నిరూపించబోతున్నారు.