ప్రజలను మభ్యపెడుతున్న జగన్
posted on May 4, 2014 @ 10:24AM
ఎటువంటి పరిపాలనానుభావం లేని జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర దశదిశ మార్చేస్తానని హామీలు గుప్పిస్తున్నారు. జిల్లాకో విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతీ గ్రామంలో పదిమంది మహిళా పోలీసుల ఏర్పాటు, స్థానికంగా అన్ని రకాల సేవలను అందించే ఒక కార్యాలయం, కోట్లాది రూపాయలు అవసరమయ్యే అనేక సంక్షేమ పధకాలు, అన్ని ఆధునిక హంగులతో రాజధాని నిర్మాణం ఇలా చాలా ఆకర్షణీయమయిన రంగుల కల వేసి జనాలకి చూపిస్తూ తమకే ఓటువేసి గెలిపించమని కోరుతున్నారు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దయనీయ స్థితి వస్తుందని మన రాజకీయ నాయకులే స్వయంగా చెపుతున్నారు. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గుప్పిస్తున్నఈ హామీలన్నిటినీ అమలుచేసేందుకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? అని ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం కేంద్రం ఇస్తుందని. కేంద్రంలో ఏ కూటమి ఆధికారంలోకి వస్తే దానికే మద్దతు ఇచ్చి నిధులు తీసుకువస్తామని చెపుతున్న జగన్, ప్రస్తుతం అవే కాంగ్రెస్, బీజేపీలతో ఎన్నికల యుద్ధం చేస్తున్నారు.
ఆ రెండు పార్టీల నేతలు జైరామ్ రమేష్, నరేంద్ర మోడీ ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళడం తప్పదని విస్పష్టంగా చెపుతున్నారు. విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నబీజేపీ, రాష్ట్రంలో తెదేపాతో జత కట్టినందున తమకు జగన్ మద్దతు అవసరంలేదని, తమ పార్టీ అధికారంలోకి రాగానే అతనిపై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేస్తామని ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ విస్పష్టంగా ప్రకటించారు. ఆయనకు మద్దతు తెలుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురూ కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే జగన్ జైలుకి వెళ్ళడం తధ్యమని బల్లగుద్ది చెపుతున్నారు. పోనీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినా, అది ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేదు. థర్డ్ ఫ్రంట్ పరిస్థితి అంతే.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయినట్లయితే తాను గుప్పిస్తున్న ఈ హామీలన్నిటినీ అమలుచేయడానికి అవసరమయిన లక్షల కోట్ల నిధులు ఎక్కడి నుండి తీసుకువస్తారు? ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వం మారగానే ఆయనపై సీబీఐ విచారణ మళ్ళీ మొదలయి, జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఏమి చేస్తారు? కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగా రాష్ట్రంలో వరదలు, తుఫానులు వచ్చినప్పుడు కేంద్రం అరకొరగా సహాయం అందించి చేతులు దులుపుకొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. మరి తనను జైలుకి పంపుదామనుకొంటున్న కేంద్ర ప్రభుత్వం నుండి జగన్ ఏవిధంగా నిధులు రాబట్టగలరు? అని ప్రశ్నిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఏమి సమాధానం చెపుతారో?