పురందేశ్వరికి చంద్ర గ్రహణం వీడేనా
posted on Apr 18, 2014 @ 9:51AM
కాంగ్రెస్ పార్టీతో చిరకాలం కొనసాగిన మాజీ కేంద్రమంత్రి డీ.పురందేశ్వరి, సీమాంద్రాలో ఆ పార్టీకి ఉన్న తీవ్ర వ్యతిరేఖతను, దేశంలో మోడీకి, బీజేపీకి అనుకూలంగా మారిన పరిస్థితులను గమనించి, దైర్యంచేసి బీజేపీలోకి మారారు. కానీ దానివలన ఆమెకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వైజాగ్ సిట్టింగ్ యంపీ అయిన ఆమె, మళ్ళీ అక్కడి నుండే పోటీ చేస్తానని చెపుతూ వచ్చారు. బీజేపీలో చేరిన తరువాత ఆమెకు ఆ సీటు తనకే ఖాయమవుతుందని భావించారు. కానీ, ఆమెతో వైరం ఉన్న చంద్రబాబు చక్రం తిప్పడంతో, ఆమె బీజేపీకి ఏమాత్రం బలంలేని కడప జిల్లా రాజంపేట లోక్ సభ సీటుకి మారవలసివచ్చింది. కానీ అక్కడా ఆమె పోటీ చేయడానికి చంద్రబాబు అభ్యంతరం చెపుతున్నారు. ఆమె బీజేపీలో ఉన్నప్పటికీ ఆమెకు చంద్రగ్రహణం తప్పించుకోలేకపోవడం నిజంగా విచిత్రమే.
బీజేపీకి కేటాయించిన స్థానాలలో ఆ పార్టీ బలహీనమయిన అభ్యర్ధులను నిలబెట్టిందని అభ్యంతరం చెపుతున్న చంద్రబాబు, పురందేశ్వరి వంటి బలమయిన అభ్యర్ధిని ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారంటే వారి మధ్య ఉన్నవిభేదాలే కారణమని చెప్పక తప్పదు. బీజేపీ నిర్ణయం వలన రెండు పార్టీల ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుందని వాదిస్తున్న చంద్రబాబు, మరి తమ వ్యక్తిగత విభేదాల కారణంగా ఖచ్చితంగా గెలవగల పురందేశ్వరిని ఈవిధంగా అడ్డుకోవడం వల్ల నష్టం కలగదా? అని ఆలోచించుకోవలసి ఉంది.
అదీగాక బీజేపీతో పొత్తులు పెట్టుకొనే ముందే సీట్ల సర్దుబాట్లపై సుదీర్గమయిన చర్చలు జరిపిన తరువాతనే, బీజేపీకి కేటాయించిన స్థానాల నుండే ఆమె పోటీకి దిగుతున్నారు తప్ప తెదేపా స్థానం నుండీ కాదు, తెదేపా టికెట్ పైనా కాదు. అటువంటప్పుడు వేరే పార్టీకి చెందిన పురందేశ్వరిని చంద్రబాబు అడ్డుకోవడం ఏవిధంగా సబబో ఆయనే చెప్పాలి. తమ ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి ప్రతీ యంపీ సీటు చాలా కీలకమని వాదిస్తున్న చంద్రబాబు, పంతాలకు పట్టింపులకీ పోయి పురందేశ్వరిని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో దానివలన ఆయనకు, ఆయన ఎన్డీయే కూటమికి ఒరిగేదేమిటో ఆయనే చెప్పాలి.
ఒకవేళ బీజేపీతో పొత్తులు రద్దయితే, అప్పుడు బీజేపీ ఆమె కోరుకొన్నవిధంగానే ఆమెను వైజాగ్ లేదా విజయవాడ నుండి పోటీకి దింపినట్లయితే, అప్పుడు చంద్రబాబే నవ్వులపాలు అవుతారు. హరికృష్ణకి టికెట్ ఈయకుండా, జూ.యన్టీఆర్ ని పార్టీకి, ప్రచారానికి దూరంగా ఉంచుతూ ఆయన ఇప్పటికే కొంత అపఖ్యాతి మూటగట్టుకొన్నారు. ఇప్పుడు నందమూరి కుటుంబానికే చెందిన పురందేశ్వరి, వేరే పార్టీలో ఉన్నపటికీ అడ్డుపడినట్లయితే, దాని వలన ఆయనకు మరింత చెడ్డపేరు రావడం ఖాయం. అది ప్రత్యర్ధులకు ఆయుధంగా మారుతుంది కూడా. అందువల్ల చంద్రబాబు అటువంటి పరిస్థితి చేజేతులా కల్పించుకొకపోతేనే మేలు.