పవన్ కళ్యాణ్ వాదనతో ఆత్మరక్షణలో పడిన జగన్
posted on May 5, 2014 @ 12:10PM
తెదేపా-బీజేపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్, మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, అతని కొడుకు జగన్మోహన్ రెడ్డిలపై చేస్తున్నఆరోపణలు, చేస్తున్న వాదనలతో వైకాపా డిఫెన్స్ లో పడింది. ఇక రాష్ట్ర విభజనకు కారణం మాజీ సీయం. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిల భూ, ధన, అధికార దాహమే కారణమని, రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణా లో విచ్చలవిడిగా జరిగిన అవినీతి, భూకబ్జాలు, తెలంగాణా వినాశనమే అస్క్కడి ప్రజలలో వేర్పాటువాదానికి బీజం వేసిందని, నాటి నుండే తెలంగాణా ప్రజలు సీమాంధ్ర పాలకులను, ప్రజలను కూడా అసహ్యించుకోవడం మొదలు పెట్టరని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఆ తండ్రీ కొడుకుల కబంధ హస్తాల నుండి బయటపడేందుకే తెలంగాణా ప్రజలు రాష్ట్రం నుండి విడిపోవాలని పట్టుబట్టారని పవన్ కళ్యాణ్ చేస్తున్న వాదనలు సీమంధ్ర ప్రజలనే కాదు తెలంగాణా ప్రజలను కూడా విపరీతంగా అక్కట్టుకొంటున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి.
పవన్ చేస్తున్న ఈ ఆరోపణలను ఖండించడానికి వైకాపా నేతలు ప్రయత్నించినా, రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి వలన అనేకమంది అధికారులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు కోర్టులు చుట్టూ నేటికీ ప్రదక్షిణాలు చేయడం ప్రజలకు కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. అయితే ఇదంతా కాంగ్రెస్, తెదేపాలు కలిసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు చేసిన కుట్ర అని వాదించవచ్చు. కానీ అమెరికా దర్యాప్తు సంస్థ యఫ్.బీ.ఐ., అక్కడి కోర్టులు కూడా టైటానియం కుంభకోణం కేసులో వైయస్స్ కు ఆత్మగా చెప్పుకొంటున్న కేవేపీ రామచంద్ర రావు అరెస్టు కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కూడా వారి కుట్రే అని జగన్, షర్మిల అనలేరు. అదే వారి అవినీతికి ఒక నిదర్శనం.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు, వాదనలతో సీమాంధ్ర ప్రజలు ఏమాత్రం ప్రభావితమయినా అది తమ తలరాతలను కూడా మార్చేసే ప్రమాదం ఉందని జగన్, షర్మిల చాలా ఆందోళన చెందడం సహజమే. అందుకే వారిరువురూ చాలా ఆవేశంతో మాట్లాడే పవన్ కళ్యాణ్ పై పిచ్చివాడి ముద్రవేసి, ఆయన మాటలను పిచ్చివాడి ప్రేలాపనలని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన ఆవేశం వారికి పిచ్చితనంగా కనబడుతుంటే, ప్రజలకు మాత్రం అందులో అయన దేశభక్తి, రాష్ట్రం, దేశం బాగుపడాలనే తపన కనబడుతోంది. ఒకవేళ వారన్నట్లు ఆయన నిజంగా అర్డంపర్ధం లేకుండా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి ఉండి ఉంటే ఆయన సభలకు ఇసుకేస్తే రాలనంత జనాలు తరలి వచ్చేవారే కాదు. ఆయనను పట్టించుకొనేవారు కూడా కాదు. అనేక సీబీఐ కేసులు ఎదుర్కొంటూ, ఈ ఎన్నికలలో ఓడిపోతే జైలు పాలయ్యే ప్రమాద స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇవి జీవన్మరణ పోరాటం వంటివి. మరోవిధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఆయన తన కేసుల నుండి బయటపడేందుకు చేస్తున్న పోరాటమని చెప్పవచ్చును. అదే మాటను పవన్ కళ్యాణ్ కుండబ్రద్దలు కొట్టినట్లు చెపితే, దానిని జీర్ణించుకోవడం చాలా కష్టమే!
రాజశేఖర్ రెడ్డి హయాంలో నిరుపేదలకు అందిన సంక్షేమ ఫలాలకు, ప్రతిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొన్ని వందల రెట్లు భారీ మూల్యం చెల్లించారు. అదంతా జగన్మోహన్ రెడ్డి వద్ద పోగుబడిందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. మరి ఇంత తార్కికంగా ఆయన చేస్తున్నఆరోపణలకు నేరుగా జవాబు చెప్పకుండా ఆయన పిచ్చివాడని ఎద్దేవా చేయడం ధనమధమే తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును.
జగన్మోహన్ రెడ్డి నేటికీ చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకొంటున్నట్లు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తాలూకు సానుభూతిని, ఆయన అమలుచేసిన సంక్షేమ పధకాలను చెప్పుకొనే ప్రజలను ఓట్లు కోరుతున్నారు. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా ఆయనపైనే చేస్తున్న విమర్శలు, ఆరోపణలు జీర్ణించుకోవడం వైకాపాకు కష్టమే కాదు నష్టం కూడా. జగన్ నేటికీ సంజాయిషీ చెప్పుకొనే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప, దైర్యంగా గుండెల మీద చేయేసుకొని తమకు ఎటువంటి అవినీతి మరకలు అంతలేదని చెప్పలేరు. ఏది ఏమయినప్పటికీ మరొక రెండు రోజుల్లో ప్రజలే అంతిమ తీర్పు చెప్పబోతున్నారు. అప్పుడే ఎవరి వాదనలలో నిజాయితీ ఉందో, ఎవరివి ఉన్మాద ప్రేలాపనలో తేలిపోతుంది.