వైకాపా ఓటమికి సాక్షి కూడా కారణమేనా?

  వైకాపా పుంగనూరు యం.యల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, “సాక్షి మీడియా వైకాపా విజయం తధ్యం అన్నట్లు చేసిన ప్రచారం కారణంగానే తమలో అతి విశ్వాసం పెరిగి చివరికి ఓడిపోయామని” చెప్పడం ఆ పార్టీ ఓటమికి గల మరో కొత్త కారణం ఆవిష్కృతమయింది. కొన్ని పత్రికలు, టీవీ చాన్నాళ్ళు తమపై విష ప్రచారం చేస్తూ, తెదేపా గెలుపుకు గట్టిగా కృషి చేశాయని వైకాపా నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు ఆరోపించారు. అయితే ఆయనకు చెందిన సాక్షి మీడియా కూడా వారి పద్దతిలోనే విమర్శలకు చాలా ఘాటుగా ప్రతివిమర్శలు చేస్తూ వైకాపా విజయానికి చాలా కృషి చేసింది. కానీ ఇప్పుడు ఆ ‘సాక్షి’ కారణంగానే తమ పార్టీ ఓడిపోయిందని వైకాపాకు చెందిన పెద్దిరెడ్డి చెప్పడం విశేషం. సాక్షి కధనాలు తామందరినీ గెలుస్తామనే ఒక భ్రమలో ఉంచి తప్పుదారి పట్టించినట్లు ఆయన ఆరోపిస్తున్నారు.   సాక్షి పత్రిక వైకాపా గెలుపు కోసం చాలా కష్టపడింది. సీబీఐ కేసులతో జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యి జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని ఒక త్యాగమూర్తిగా, మడమ తిప్పని ఒక గొప్ప సమరయోధుడిగా అభివర్ణిస్తూ చాలా చక్కగా వెనకేసుకు రావడమే కాకుండా, ఆయనను వైకాపా అభిమానులకు చేరువ చేయడానికి విశేష కృషి చేసింది. నిజానికి జగన్ వెనుక ‘సాక్షి’ మీడియా లేకపోయి ఉంటే ఆయన పరిస్థితి, పరపతి వేరే విధంగా ఉండేదేమో? కానీ వైకాపాకు, జగన్మోహన్ రెడ్డికి సాక్షి మీడియా ఒక రక్షణ కవచంగా నిలిచి, తనొక మీడియా సంస్థననే విషయం కూడా మరిచిపోయి అచ్చు ఒక రాజాకీయ నాయకుడిలాగానే, వారి ప్రత్యర్ధులను తన ప్రత్యర్దులుగా భావించి శత్రువులతో, చివరికి సాటి మీడియాతో కూడా అలుపెరగని పోరాటం చేసింది.   జగన్, విజయమ్మ, షర్మిల, భారతి మరియు ఆ పార్టీలో ఇతర నేతలు చెప్పిన మాటలు పొల్లుపోకుండా ప్రచురించింది, ప్రసారం చేసింది. వారి ప్రతీ మాటకు, చర్యకు చాలా చక్కటి బాష్యం చెప్పేది. పనిలోపనిగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని, ఆయన పరిపాలనను, జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రజలను ఉద్దరించేందుకే దివి నుండి భువికి దిగివచ్చిన దైవ దూతలన్నంతగా డప్పుకొట్టింది. ఆ తమకంలోనే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకపా తిరుగులేని మెజార్టీతోరాష్ట్రంలో అధికారం లోకి వస్తుందని బల్ల గుద్ది మరీ సాక్షి మీడియా వాదించింది. కానీ ఆ డప్పుకు ఇంకో బలమయిన కారణం కూడా ఉందని చెప్పవచ్చును.   జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు వినరని, పార్టీలో ఎవరినీ ఏ విషయంలో కూడా సంప్రదించరని, తనకు తోచిందే పార్టీ శిలాశాసనంలా అమలుచేయాలని భావిస్తారని, పార్టీలో తనకు భిన్నంగా ఎవరయినా ఆలోచనలు చేసినా,సలహాలు ఇచ్చినా సహించలేరని, ఆ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు, సబ్బం హరి వంటి అనేక మంది సీనియర్ నేతలు చెప్పారు. అటువంటప్పుడు ‘సాక్షి’ మాత్రం పిల్లి మెడలో గంట కట్టే సాహసం ఏవిధంగా చేస్తుంది? బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డి మాటలకు, ఆలోచనలకు, కోరికలకు సాక్షి అద్దంపట్టాలని చూసింది తప్ప ఆయనకు వాస్తవ పరిస్థితి వివరించి అప్రమత్తం చేసే సాహసం చేయలేకపోయి ఉండవచ్చును. లేకుంటే రాష్ట్రంలో విస్త్రుతమయిన నెట్ వర్క్ ఉన్న సాక్షికి వైకాపాకు వ్యతిరేఖంగా మారుతున్న ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను పసిగట్టలేదని అనుకోలేము. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సాక్షిని తన రాజకీయ ఆలోచనలకు, కోరికలకు, వ్యూహాలకు, కార్యక్రమాలకు, పర్యటనలకు సాక్షిగా కాక, ఒక మీడియా సంస్థగా భావించి స్వేచ్చనిచ్చి ఉండి ఉంటే బహుశః సాక్షి తప్పకుండా వాస్తవ పరిస్థితులను, ప్రజలలలో మారుతున్న ఆలోచనా ధోరణిని, ప్రజలపై చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, తెదేపా-బీజేపీల ఎన్నికల పొత్తుల ప్రభావం వంటివన్నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్లు వివరించి ఉండేది. కానీ ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్...’అనే పద్ధతిలో కలం కదపవలసి రావడంతో సాక్షి జగన్మోహన్ రెడ్డిని ఎన్నడూ అప్రమత్తం చేసే దైర్యం చేయలేకపోయింది. తన పార్టీ విజయం సాధించడం తధ్యమని అతివిశ్వాసంతో వ్యవహరించబట్టే తమ పార్టీ ఓడిపోయిందని జగన్ స్వయంగా చెప్పారు. అందుకే సాక్షి కూడా ఆయన సారధ్యంలో వైకాపా తిరుగులేని విజయం సాధిస్తుందని బాకా ఊదవలసి వచ్చింది. ఆ బాకా చెవులకింపుగా ఉన్నందున జగన్ దానిని నమ్మారు. కానీ ప్రజలు మాత్రం దానిని నమ్మకపోవడంతోనే చిక్కు వచ్చిపడింది.

మహాత్మునిపై అరుంధతీ రాయ్ అనుచిత వ్యాఖ్యలు

  సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకొన్న రచయితలు, రాజకీనాయకులు, కళాకారులు, సినీరంగానికి చెందినవారు అప్పుడప్పుడు నోరు జారి చిక్కుల్లో పడుతుంటారు. కానీ కొందరు కుహానా మేధావులు అహంకారంతోనో లేక తమ గొప్పదనం గురించి ప్రజలందరికీ చాటుకోవాలనే దురదతో ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అనుచితమయిన మాటాలు మాట్లాడుతుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ప్రముఖ రచయిత్రిగా పేరుపొందిన అరుంధతీరాయ్. ఆమె గొప్ప రచయిత, సామజిక కార్యకర్తే కావచ్చును. కానీ కేవలం భారతీయులే కాక యావత్ ప్రపంచమూ గౌరవించే మహాత్మాగాంధీనే విమర్శించే హక్కు ఆమెకు లేదనేచెప్పవచ్చును.   రెండు రోజుల క్రితం ఆమె ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు మహాత్మాగాంధీని జాతిపిత అనడమే చాల తప్పు అని ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. అది ఇంకా చల్లారక మునుపే మొన్న తిరువనంతపురంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మన దేశంలో అనేకమంది మహానుభావులు ప్రజల దృష్టిలో హీరోలుగా చలామణి అవుతున్నారు. కానీ వారందరూ నకిలీ హీరోలేనని మహాత్మాగాంధీని ఉద్దేశ్యించి అన్నారు. మహాత్మాగాంధీ కులతత్వాన్ని సమర్దించారని, ఆ విషయం అయన 1936లో స్వయంగా వ్రాసిన ‘ఆదర్శనీయ భాంగి’ అనే వ్యాసంలో పారిశుద్ధ పనివారు (ఆ కాలంలో ఆ పనిని హరిజనులు చేసేవారు) ప్రజలు విసర్జించిన మూత్రాన్ని, మలాన్ని ఎరువుగా మార్చాలని వ్రాయడం గాంధీజీ కులాహంకారానికి, దేశంలో కులతత్వాన్ని సమర్ధించే విధంగా ఆయన ఆలోచనలు సాగాయని చెప్పడానికి అదే ఒక నిదర్శనమని, అటువంటి వ్యక్తి పేరు సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు పెట్టుకోవడం అనుచితమని, వాటిని మార్చుకొనే రోజులు దగ్గర పడుతున్నాయని ఆమె అన్నారు. గాంధీజీ గురించి మనం వ్రాసుకొన్న పాటాలన్నీ అబద్దాలతో నిండి ఉన్నవేనని ఆమె అన్నారు.   అరుదంతీ రాయ్ గొప్ప మేధావే కావచ్చును. కానీ ఆనాటి పరిస్థితులను బట్టి గాంధీజీ వ్రాసిన వ్యాసాన్ని పట్టుకొని దానికి తన తెలివితేటలతో వక్ర బాష్యం చెప్పి ఆయనకు కులతత్వాన్ని ఆపాదించాలని చూసి ఆమె తనొక కుహానా మేధావని రుజువు చేసుకొన్నారు. గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడారో అదేవిధంగా హరిజనుల గౌరవం కోసం పోరాడిన సంగతి భారతీయులు అందరికీ తెలుసు. ఆయన కులమతాలకు అతీతంగా భారతీయులందరూ అన్నదమ్ములవలె కలిసిమెలిసి సుఖంగా జీవించాలని కోరుకొన్నారు. మన దేశం నుండి పాకిస్తాన్ వేరే దేశంగా విడిపోతున్నపుడు ఆయన పడిన ఆవేదన గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది.   భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కావాలనుకొంటే ఆయనే స్వయంగా ప్రభుత్వాధినేతగా పగ్గాలు చెప్పట్టగలిగేవారు. కానీ ఆయన అటువంటి ఆలోచన చేయలేదు పైగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ, ఆఖ్యాతిని ఉపయోగించుకొని అధికారం చెప్పట్టకుండా ఉండేందుకు దానిని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన మాటను మన్నించలేదు. అయినప్పటికీ ఆయన అందుకు ఎవరినీ నిందించలేదు. దేశానికి మొట్ట మొదటి ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నెహ్రూజీతో చాలా మర్యాదగా వ్యవహరించారు.   ఆ తరువాత కూడా ఆయన నిరాడంబర జీవనశైలిలో ఎటువంటి మార్పులు రాలేదు. ఇదంతా చరిత్ర పాటాలలో వ్రాయబడింది గనుక గుడ్డిగా నమ్మనవసరం లేదు. ఆనాడు జరిగిన ఈ సంఘటనలన్నీ సినిమాలు, వీడియోలు, ఫోటోలు తదితర దృశ్యరూపంలో నేటికీ మన కళ్ళెదుట సజీవంగానే ఉన్నాయి. అవి చూస్తే గాంధీజీ ఎందుకు మహాత్ముడయ్యారో అర్ధమవుతుంది. ఆ మాహాత్ముడి గొప్పదనం గురించి ఇటువంటి కుహానా మేధావులకి అర్ధం కాకపోవచ్చునేమో కానీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఉన్నకోట్లాది భారతీయులకు మాత్రం బాగానే తెలుసు. అందుకే ఆయన నేటికీ వారి హృదయాలలో కొలువయ్యున్నారు.   అరుంధతీ రాయ్ వంటి కుహాన మేధావులు తమ తెలివితేటలను దేశ అభివృద్ధికి, ప్రజలమధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడానికీ ఉపయోగించి ఉంటే అందరూ సంతోషించి ఉండేవారు. కానీ భారతీయుల హృదయాలలో సమున్నత స్థానం పొందిన మహాత్ముని గురించి ఇలా చెడు ప్రచారం చేసేందుకు తన తెలివితేటలను ఉపయోగించడం ఆమె అహంకారానికి, అజ్ఞానికి అద్దం పడుతోంది. ఆవిధంగా మాట్లాడటం వలన ఆమె పేరు తాత్కాలికంగా మీడియాలో నానవచ్చునేమో కానీ దానివల్ల పోయేది ఆమె పరువే తప్ప గాంధీ మహాత్ముడిది కాదు.

మలేషియా విమాన దుర్ఘటనకి ఎవరిని నిందించాలి?

  మలేషియా విమాన దుర్ఘటనలో 293 మంది చనిపోయారు. అందుకు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడమో లేక ప్రకృతి వైపరీత్యమో కారణం కాదు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం అందుకు కారణం. అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతీన్ ప్రయాణిస్తున్న విమానం అనుకొని పొరబడి ఉక్రెయిన్ సైనిక దళాలు పేల్చివేసాయని రష్యా దేశం ఆరోపిస్తుంటే, అది ఉక్రెయిన్ కి చెందిన విమానమని పొరబడి రష్యా వేర్పాటువాదులు కూల్చివేసారని ఇరు దేశాలు ఒకదానినొకటి నిందించుకొంటున్నాయి. ఏమయినప్పటికీ వారి పొరపాటుకు ఇతరులు భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఈ నేరం చేసినవారికీ, ఇటువంటి తీవ్ర నేరాలు చేసే తాలిబాన్ తీవ్రవాదులకి తేడా ఏమిటంటే తాలిబన్లు కనీసం ఆ నేరం తామే చేసామని దైర్యంగా చెప్పుకొంటారు. కానీ వీరు చెప్పుకోవడం కాదు కనీసం ఒప్పుకోవడం లేదు కూడా. అందువల్ల ఈ ఘోర సామూహిక హత్యా నేరానికి పాల్పడినవారు ఏ దేశానికి చెందినవారయినప్పటికీ బహుశః తాలిబాన్లలాగే శిక్ష నుండి తప్పించుకొనే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.   ఇక ఈ దుర్ఘటనకు ఆ రెండు దేశాలనే కాక మలేషియన్ ఎయిర్ లైన్స్ సంస్థను కూడా నిందించకతప్పదు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొని ఉందని గ్రహించగానే కొరియన్ ఎయిర్, ఏషియానా(దక్షిణ కొరియా), క్వంటాస్(ఆస్ట్రేలియా), చైనా ఎయిర్ లైన్స్ (తైవాన్),క్యాతీ పసిఫిక్ (హాంగ్ కాంగ్), పాకిస్తాన్ ఇంటర్ నేషనల్ (పాకిస్తాన్) వంటి అనేక దేశాలకు చెందిన విమానయాన సంస్థలు తమ విమానాలను ఆ ప్రాంతం మీదుగా నడపకుండా జాగ్రత్తపడ్డారు. కానీ మలేషియా, భారత్, అమెరికాతో సహా అనేక దేశాల విమానాలు నేటికీ ఆ ప్రాంతం మీదుగానే పయనిస్తున్నాయి.   బ్రెజిల్ దేశం నుండి స్వదేశానికి తిరుగు ప్రయాణమయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ పయనించిన విమానం కూడా ఆ ప్రాంతం మీద నుండే రావలసి ఉంది. కానీ ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమయిన అధికారులు మోడీ విమానాన్ని వేరే సురక్షిత మార్గానికి మళ్ళించారు. అంటే ఎంత సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, ఏదయినా ప్రమాదం లేదా దుర్ఘటన జరిగితే తప్ప ఎవరూ మేల్కొనరని అర్ధమవుతోంది. ఇప్పుడు అమెరికా కూడా తన విమానాలను ఆ మార్గం గుండా నడిపించబోమని ప్రకటించింది. బహుశః భారత్ తో సహా మిగిలిన దేశాలు కూడా అదేపని చేయవచ్చునేమో.   ఈ గుణపాఠం నేర్చుకొనేందుకు293 మంది బలికావలసి రావడమే దురదృష్టం. దానిని దురదృష్టం అనుకోవడం కంటే నిర్లక్ష్యం అనుకోవడమే సమంజసం. ఎందువలన అంటే వేరే మార్గం గుండా విమానాలను నడిపినట్లయితే, దూరం పెరిగి ఇంధన ఖర్చు మరికొంత పెరుగుతుంది. గనుకనే ఆ ప్రాంతంపై నుండి ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా విమానాలు నడుపుతున్నారు. సాధారణంగా ఆ స్థాయి ప్రయాణికులు భద్రత కోసం అవసరమయితే మరికొంత భారం భరించగల స్తోమత గలవారే అయి ఉంటారు. కానీ చౌక ధరల విషయంలో పోటీలు పడుతున్న విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రతను గాలి కొదిలిపెట్టి ప్రమాదకరమయిన యుద్ద ప్రాంతం మీదుగా విమానాలు నడపడం చాలా దారుణం.   అందుకు వారి వద్ద గొప్ప సంజాయిషీ కూడా సిద్దంగా ఉంది. ఆ ప్రాంతంలో 10,000 మీటర్లు లేదా 33,000 అడుగుల ఎత్తులో విమానాలు ఎగిరేందుకు సురక్షితమని, కానీ అంతకంటే తక్కువ ఎత్తులో అంటే 32, 0000 అడుగుల ఎత్తులో విమానాలు ప్రయాణించడం నిషేదించబడిందని, ఈ దుర్ఘటన జరిగినప్పుడు తమ విమానం ఖచ్చితంగా 33,000 అడుగుల ఎత్తులో పయనిస్తోందని మలేషియా అధికారుల వాదన. ఆయితే వారి వాదనలేవీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేవు, కనీసం ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వవని తేలిపోయింది.   ఈ దుర్ఘటన పొరపాటునే జరిగి ఉండవచ్చు, కానీ ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి అనేక దేశాలలో నేటికీ ఉగ్రవాదుల దాడులతో, విమాన దాడులతో ఉద్దేశ్యపూర్వకంగానే మారణ హోమం జరుగుతూనే ఉంది. అందులో వేలాది అమాయక ప్రజలు, అన్నెం పున్నెం తెలియని పసిపిల్లలూ నిత్యం చనిపోతూనే ఉన్నారు. అటువంటి దుష్క్రత్యాలను అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తాయి. కానీ ఈ నేరానికి పాల్పడిన వారిని మాత్రం ఎవరూ వేలెత్తి చూపరు. కేవలం ఖండిస్తారు, దిగ్భ్రాంతి ప్రకటిస్తారు అంతే.   

రాజధాని అక్కడే...కానీ మిగిలిన జిల్లాల మాటేమిటి?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తరువాత ఎందుకో మౌనం వహించడంతో ఈ విషయమై పునరాలోచనలోపడిందేమో అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి. అంతకు ముందు ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సానుకూలంగా ఉన్న ఇతర జిల్లాల నేతలు, ఈ జాప్యం చూసి ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్లు వారు కూడా భావించడంతో తమ జిల్లాలలోనే రాజధాని నిర్మించాలని డిమాండ్స్ చేయడం మొదలుపెట్టారు. జిల్లా పర్యటనలకు వచ్చిన రాజధాని ఎంపిక కమిటీ-శివరామ కృష్ణన్ కమిటీ ముందు అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు, యంపీలు, శాసన సభ్యులు సైతం తమ వాదనలు వినిపించడం, కమిటీకి వినతి పత్రాలు సమర్పించడం గమనిస్తే, ఈ విషయంలో జాప్యం జరిగితే రాజధాని విషయంలో కూడా జిల్లాల మధ్య వివాదం మొదలయ్యే ప్రమాదం ఉందని అర్ధమవుతోంది.   అన్ని జిల్లాల ప్రజలు, నేతలు తమ ప్రాంతంలోనే రాజధాని లేదా రెండవ రాజధాని ఏర్పాటుకావాలని కోరుకోవడంలో అసహజమేమీ లేదు. కానీ, వారందరూ కూడా ఆ విధంగా అయినా తమ జిల్లా అభివృద్ధి చెందుతుందనే ఆశతోనే రాజధాని కోసం పట్టుబడుతున్నారు తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. వారి ఆందోళనకు బలమయిన కారణాలే ఉన్నాయి. ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విద్య, వైద్య సంస్థలు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ పరిశ్రమలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటిస్తున్నాయి. అయితే వాటిలో అత్యధికం మళ్ళీ రాజధాని నిర్మితమవుతుందని భావిస్తున్న విజయవాడ-గుంటూరు సమీప ప్రాంతాలలో, వైజాగ్, రాజమండ్రీ, కాకినాడ ప్రాంతాలలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు మీడియాలో వస్తున్నవార్తలు, మంత్రుల ప్రకటనలు మిగిలిన అన్ని జిల్లాల ప్రజలకు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. అందువలన ప్రభుత్వం ఒకవేళ రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య నిర్మించదలచినట్లయితే, మిగిలిన అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేవిధంగా వాటికి ఏమేమీ కేటాయించబోతోందో స్పష్టమయిన ప్రకటన చేసి హామీ ఇవ్వడం ద్వారా వారి ఆందోళన నివారించవచ్చును.   మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య నిర్మించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని, అక్కడయితేనే రాష్ట్రంలో 13జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇదే విషయం ఈ నెల 22న డిల్లీలో శివరామ కృష్ణన్ కమిటీతో జరిగే సమావేశంలో తాను చెప్పబోతున్నట్లు తెలియజేసారు. అంటే రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్పష్టతతో ఉందని భావించవచ్చును.   దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన నిపుణుల బృందంతో కూడిన శివరామ కృష్ణన్ కమిటీ కూడా కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఉంటేనే రాష్ట్రంలో 13జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఆ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువుగా ఉందని తనకు తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు స్వయంగా చెప్పారు.   అటువంటప్పుడు ఇంకా ఈ అంశంపై అయోమయం నెలకొని ఉండాల్సిన అవసరం లేదు. శివరామ కృష్ణన్ కమిటీతో సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అంశం, దానితోబాటే మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం ఏమేమీ కేటాయించబోతోందో తెలియజేస్తూ ఒక స్పష్టమయిన ప్రకటన చేసి ఈ వివాదాలకు, అయోమయ పరిస్థితికి స్వస్తి పలికితే బాగుంటుంది. లేకుంటే తెలంగాణా విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్పుడు ధోరణి అవలంభించినందున ఎటువంటి సమస్యలు తలెత్తాయో ఆవిధంగానే రాజధాని విషయంలో కూడా సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది.

తెలంగాణా క్యాబినెట్ నిర్ణయాలు

నిన్న సుమారు ఐదున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణా ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో 48 అంశాలపై చర్చించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. తెరాస ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు అన్నిటినీ ఈ సమావేశంలో ఆమోదించారు.   ఈ సమావేశంలో హైలైట్స్:   రుణాల మాఫీ: 1. పంట, బంగారు, పవర్ లూమ్, వ్యవసాయం కోసం తీసుకొన్న ట్రాక్టర్లు, ట్రాలీల ట్రాన్స్ పోర్ట్ పన్నుబకాయిలు అన్నీ మాఫీ చేయబడ్డాయి. వాటిలో వ్యవసాయ మరియు బంగారు నగలపై తీసుకొన్న రుణాలు మొత్తం దాదాపు రూ.17-19000 కోట్లు. పవర్ లూమ్ రుణాలు రూ. 6.50కోట్లు, ట్రాక్టర్లు వగైరాల ట్రాన్స్ పోర్ట్ పన్ను బకాయిలు రూ. 76 కోట్లు.   సంక్షేమం పధకాలు: 1. వృద్ధులు, వితంతువులు, మరియు బీడీ కార్మికులకు నెలకు రూ 1000 పెన్షన్ మంజూరు. 2. వికలాంగులకు నెలకు రూ. 1500 పెన్షన్ మంజూరు. ఈ మూడు రకాల పెన్షన్లు వచ్చే దసరా-దీపావళి పండుగల మధ్య నుండి ఇవ్వబడతాయి. అందుకోసం అర్హులందరికీ పెన్షన్ కార్డులు, బ్యాంకు అకౌంటులు ఏర్పాటు చేయబడతాయి. 3. ఫీజు రీయింబర్స్ మెంటు స్థానంలో తెలంగాణా విద్యార్ధులకు ఆర్ధిక సహాయం. ఇది విద్యార్దుల అవసరాన్ని బట్టి పెంచబడుతుంది. 4. 1969 నుండి తెలంగాణా పోరాటంలో పాల్గొని అమరులయిన వీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సహాయం, ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య, కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయాలు. ఉద్యోగానికి అర్హులు కాని గ్రామస్తులకు 3ఎకరాల భూమి. వ్యవసాయానికి అవసరమయిన అన్ని సదుపాయాల కల్పనా, ఆర్ధిక సహాయం. 5. కళ్యాణ లక్ష్మి పధకం క్రింద యస్సీ. ఎస్టీ, గిరిజన, ఆదివాసీల ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం తరపున రూ.50, 000 బహుమానం. 6. గిరిజనులు, ఆదివాసీలు, యస్సీ, ఎస్టీ ఒక్కో కుటుంబానికి 3ఎకరాల భూమి. 7. ముస్లిం ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు. 8. గల్ఫ్ వర్కర్స్ సంక్షేమం కోసం కేరళ తరహాలో ప్రత్యేక సంక్షేమ వ్యవస్థ ఏర్పాటు. 9. అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు తెలంగాణా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం. వారిలో వయసు మీరినవారి కోసం నిబంధనలు సడలింపు. 10. తెలంగాణా ప్రభుత్వోద్యోగులకు తెలంగాణా స్పెషల్ ఇంక్రిమెంటు 11. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతనాలు. దీని కోసం ఒక ప్రత్యేక కమిటీ వేయబడుతుంది. దాని నివేదిక ఆధారంగా జీతభత్యాలు పెంచబడతాయి.   కొత్త కమిటీలు, కమీషన్ల ఏర్పాటు: 1. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్. 2. తెలంగాణా పర్యాటక కార్పోరేషన్. 3. తెలంగాణా కాలుష్య నివారణ సంస్థ. 4. తెలంగాణా ఎన్నికల కమీషన్. 5. తెలంగాణా వ్యవసాయ విద్యాలయానికి స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఖరారు. 6. తెలంగాణా పశు విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహ రావు పేరు ఖరారు. 7. జ్యూడిషియల్ అధికారాలతో కూడిన వక్ఫ్ బోర్డు ఏర్పాటు. 8. యస్సీ కమీషన్ ఏర్పాటు. 9. మేధావులు, జర్నలిస్టులు తదితరులతో కూడిన ప్రజా సలహా సంఘం ఏర్పాటు (రాష్ట్ర సలహా సంఘం). ఇది ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రయోగం విజయవంతం అయినట్లయితే జిల్లా స్థాయిలో కూడా ఇటువంటి ప్రజా సలహా సంఘాలు ఏర్పాటు చేయబడతాయి.   పోలీసు విభాగం: 1. హైదరాబాదులో పోలీసు భద్రత పెంచేందుకు అవసరమయిన కార్లు, మోటార్ సైకిళ్ళు కొనుగోలుకు రూ 343 కోట్లు మంజూరు. 2. ఈ కొత్త వాహనాలు నడిపేందుకు 3620 డ్రైవర్లు, పోలీసు కానిస్టేబుళ్ల నియామకం 3. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నష్టపోయిన డీ.యస్పీ.ల గౌరవం కాపాడేందుకు సూఒపార్ న్యూమరరీ పోస్టులు కల్పించి వారందరికీ అదే స్థాయిలో ఉద్యోగభద్రత, హోదా కల్పించేందుకు ఆమోదం. 4. హైదరాబాదు జంట నగరాలలో అడుగడుగునా సీసీ కెమెరాల్ ఏర్పాటు. 5. జంట నగరాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు విదేశీ కన్సల్టెంట్ తో ఒప్పందానికి అనుమతి మంజూరు. 6. గతంలో జంట నగరాలలో బలవంతంగా మూయించి వేసిన కళ్ళు దుఖాణాలను మళ్ళీ తెరిపించేందుకు చర్యలు.   ఇతర నిర్ణయాలు: 1. కోయ, చెంచు మొదలయిన గిరిజన, ఆదివాసీలు నివసించే తండాలు 500కి మించి జనాబా ఉన్నవాటిని గ్రామ పంచాయితీలుగా మార్పు. 2. వారికి ఒక్కో కుటుంబానికి 3 ఎకరాల భూమి. 3. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణా రాజముద్రలో చిన్న మార్పులు. 4. బ్రతుకమ్మ, బోనాలు పండుగలు ఇకపై రాష్ట్ర పండుగలు. 5. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న ఆర్.యంపీ. పీ.యంపీలకు అవసరమయిన వైద్య శిక్షణ ఇచ్చి, వారు నిర్భయంగా వైద్య సేవలు అందించేందుకు గాను సర్టిఫికెట్లు కూడా ఇవ్వబడతాయి. 6. పరిశ్రమలకు అవసరమయిన అన్ని అనుమతుల మంజూరు కొరకు సింగిల్ విండో పద్ధతి అమలు.

ప్రజల వద్దకే ప్రభుత్వం, పరిపాలన

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో హైదరాబాదు నుండే పరిపాలన కొనసాగించవలసివస్తున్నందున, ప్రభుత్వం తమకు అందుబాటులో లేదనే భావన రాష్ట్ర ప్రజలలో కలుగుతోందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కో జిల్లాలో వారానికి రెండు రోజులు చొప్పున మొత్తం 13జిల్లాలలో ‘సంచార రాష్ట్ర పరిపాలన’ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.   ఈ ప్రయోగంలో భాగంగా ఈరోజు, రేపు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం 10.30గంటలకు జిల్లాలో ద్వారకాతిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకొన్న తరువాత కామవరపుకోట, దేవులపల్లి, గురువాయి గూడెం తదితర ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు ప్రజలు, రైతులను కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకొంటారు. సాయంత్రం జంగారెడ్డి గూడెం చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. ఈ రెండు రోజుల పర్యటనలలో ఆయన వెంట వ్యక్తిగత సిబ్బందితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు ఉంటారు. జిల్లాల పర్యటనలో ఉన్న రెండు రోజులలో సచివాలయంలో సాగే రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను ఆ అధికారి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ, అక్కడి నుండే పర్యవేక్షిస్తుంటారు. ఈవిధంగా వారానికి రెండు రోజులు రాష్ట్రంలో, ఐదు రోజులు సచివాలయంలో ఉంటూ పరిపాలన చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం ఏర్పడకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.   రాష్ట్ర రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై పూర్తి స్పష్టత వస్తే కానీ ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుండే పరిపాలన సాగిస్తే, మిగిలిన జిల్లాల ప్రజలలో అపోహలు మొదలవుతాయనేది కూడా ఈ ప్రయోగానికి మరో కారణమని తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రజలందరినీ మెప్పించడానికి ప్రతీ జిల్లాలో ఒక రాజధాని ఏర్పాటు చేయడం అసాధ్యం. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు రాష్ట్ర ప్రజలు చాల మంది సానుకూలంగానే ఉన్నారు గనుక, ముందే ప్రకటించినట్లుగా అక్కడే తాత్కాలికంగా సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకొని, మిగిలిన జిల్లాలలో వివిధ విద్యా, వైద్య, రవాణా, పారిశ్రామిక, సాఫ్ట్ వేర్ తదితర సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చును.   రాష్ట్ర ప్రజలందరూ తమ తమ జిల్లాలలో మంచి అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతోనే తమ జిల్లాలలో రాజధానిని ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నారు తప్ప కేవలం రాజధాని కోసం కాదు. అందువల్ల విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయడంలో ఎటువంటి సమస్యలు లేనట్లయితే, అక్కడికే రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలను తరలించి, మిగిలిన అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేవిధంగా ప్రణాళికలు రూపొందించుకొని ప్రకటిస్తే మంచిదేమో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పూర్తి అందుబాటులో ఉండాల్సిన అవసరం చాలా ఉంది కనుక పరిపాలనా వ్యవస్థలను వీలయినంత త్వరగా రాష్ట్రానికి తరలించడమే మంచిదని మిత్రపక్షానికి చెందిన బీజేపీ నేతలు, ప్రతిపక్ష నేతలు, ప్రజలు కూడా భావిస్తున్నారు.

కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్ధతకు పరీక్షగా పోలవరం

    ఈరోజు రాజ్యసభ కూడా పోలవరం బిల్లును ఆమోదించింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం కేవలం లాంఛనప్రాయమే. అయితే ఇల్లలకగానే పండగ కాదన్నట్లు ఇప్పటి నుండి మళ్ళీ తెలంగాణాలో ఉద్యమాలు, ఆందోళనలు మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణా ప్రభుత్వం ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా టీ-జేఏసీ కూడా మళ్ళీ ఆందోళన బాట పట్టవచ్చును. బహుశః ముంపు గ్రామాలలో గిరిజనులను కలుపుకొని ఉద్యమించినా ఆశ్చర్యం లేదు. అందువలన ప్రాజెక్టుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంలో చాలా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.   కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ఈ సమస్యలను ఎదుర్కొంటూనే మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది. తెలంగాణా రాష్ట్ర సరిహద్దులను మార్పుపై ఏర్పడిన న్యాయ వివాదం గురించి సుప్రీంకోర్టు చూసుకొంటుంది. గనుక మిగిలిన సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పరిష్కరించుకొని ముందుకు సాగవలసి ఉంటుంది.   దాదాపు రెండు లక్షల మంది గిరిజనులకు పూర్తి సంతృప్తి కలిగే విధంగా పునరావాసం కల్పించాలంటే కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే కాదు. అందుకు స్థానిక ప్రజలు, నేతలు, స్వచ్చంద సంఘాలు, పర్యావరణ, పునరావాస చర్యలలో అనుభవం ఉన్ననిపుణుల సలహాలు, సహాయ సహకారాలు తీసుకోవడం కూడా చాలా అవసరం.   అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో, దేశాలలో ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించడానికి తీసుకొన్న చర్యలు, జాగ్రత్తలు, పునరావాసచర్యలు వంటి అనేక అంశాలను లోతుగా అధ్యయనం చేయడం వల్లకూడా చాల మేలు జరుగుతుంది. ఈ విషయంలో నిపుణుల సలహాలనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రజల, నిర్వాసితుల సూచనలు, సలహాలు, అభిప్రాయలు, సహాయసహకారాలు కూడా తీసుకొనే ప్రయత్నం చేసినట్లయితే అనేక క్లిష్ట సమస్యలకు ఎవరూ ఊహించలేని అద్భుత పరిష్కారాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది.   పోలవరం ముంపు గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులకు మంచి పునరావాసం కల్పించి, వారిలో ఆసక్తి ఉన్నవారికి తగిన సాంకేతిక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం మరియు నిర్వహణలో భాగస్వాములను చేసి తగిన ఉపాధి కల్పించగలిగితే సమస్యలు కొంత వరకు పరిష్కారం కావచ్చును. అంతేగాక వారి జీవనవిధానం, ఆచార వ్యవహారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు, సమీప ప్రాంతాలలోనే వారికి అనుకూలమయిన చోట పునరావాసం కల్పించడం ద్వారా కూడా వారిని శాంతింపజేయవచ్చును.   అదేవిధంగా ప్రాజెక్టు క్రింద కోల్పోతున్న అటవీ ప్రాంతాలకు ప్రతిగా మరొకచోట మళ్ళీ అంతే పరిణామం గల అటవీ ప్రాంతాలను పెంపొందించి, పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా కాపాడటం కూడా అంతే అవసరం. ఆ బాధ్యత కూడా గిరిజనులకే అప్పగించినట్లయితే వారు సంతోషంగా స్వీకరించవచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా వారి సంక్షేమం, పునరావాసం కోసం తగిన ఏర్పాటు చేయగలిగినట్లయితే వారూ సంతోషంగా ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వహణకి సహకరించే అవకాశం ఉంది.అప్పుడే వారు తమను రెచ్చగొట్టే రాజకీయ నేతల ప్రభావానికి లొంగకుండా నిలువగలుగుతారు.   పోలవరం ప్రాజెక్టు సకాలంలో నిర్మించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమర్ధతకు, కార్యదీక్షకు ఒక పరీక్ష వంటివి. అదేవిధంగా నిర్వాసితులకు పూర్తి సంతృప్తికరంగా పునరావాసం కల్పించదదం ద్వారా పోలవరం ప్రాజెక్టును యావత్ దేశంలోనే ఒక ఆదర్శవంతమయిన నమూనా ప్రాజెక్టుగా నిలపగలిగితే, అది కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా గర్వకారణంగా నిలుస్తుంది.

పోలవరంలో రాజకీయాలు మిళితం చేయడం సబబేనా?

  పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడంపై జరుగుతున్న రగడ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య మరింత దూరం పెంచుతోంది. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర విభజన బిల్లులో చేర్చడం, ముంపు గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయాలనే నిర్ణయాలు ఈనాడు కొత్తగా తీసుకొన్నవి కావని ఇప్పుడు ఆందోళన చేస్తున్న వారందరికీ తెలుసు. ఆనాడు ప్రశ్నించని నేతలు, పార్టీలు అన్నీకూడా నేడు ఉద్యమిస్తున్నాయి. విశేషమేమిటంటే ఈ సమస్యను సృష్టించిన కాంగ్రెస్ పార్టీకూడా ఆందోళనలో పాల్గొంటోంది. అంటే ఈ అంశాన్ని కూడా అన్ని పార్టీలు ప్రాంతీయ సమస్యగా మార్చి దానిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయే తప్ప గిరిజనుల సంక్షేమం గురించి మాత్రం ఆలోచించడం లేదని స్పష్టమవుతోంది. రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేవలం రాష్ట్ర సరిహద్దులు మార్చడంపై గట్టిగా వాదిస్తున్నాయి తప్ప, ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవబోతున్న గిరిజనుల పునరావాసం గురించి కానీ వారికి దక్కవలసిన ప్యాకేజీ గురించి కానీ మాట్లాడక పోవడం చూస్తే, వారి ఈ అందోళనల వెనుక నిబద్దత ఏపాటిదో అర్ధం అవుతుంది.   “తాము ప్రాజెక్టుకు వ్యతిరేఖించడం లేదు కేవలం ప్రాజెక్టు డిజైన్ మార్చమని మాత్రమే కోరుతున్నాము. ఆవిధంగా చేసినట్లయితే గిరిజనులు నష్టపోరని” అనేకమంది రాజకీయ నేతలు వాదిస్తున్నారు. కానీ సరిహద్దులు మార్చకుండా ప్రాజెక్టు డిజైన్ మార్చడం సాధ్యమేనా? డిజైన్ మారిస్తే వేరే ప్రాంతానికి, అక్కడ ఉండే గిరిజనులకో, మరొకరికో నష్టం జరగదని ఖచ్చితంగా చెప్పగలరా? పోనీ ముంపు గ్రామాల నిర్వాసితుల బాధ్యత పూర్తిగా వారే తీసుకోగలరా? అనే విషయాల గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు.   ఇటువంటి భారీ ప్రాజెక్టులు నిర్మించిన ప్రతీసారి, ప్రతీ చోట ఎవరో ఒకరు నష్టపోతుంటారు, పల్లెలు నీట మునుగి అదృశ్యమవుతుంటాయి. ఇదివరకు ప్రాజెక్టులు కట్టినప్పుడు నిర్వాసితులకు సరయిన న్యాయం జరిగేదికాదన్న మాట వాస్తవం. కానీ, ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా పూర్తి చైతన్యవంతమయి ఉన్నందున, నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే అవకాశం ఉంది. జరగకుంటే వారి తరపున పోరాడేందుకు రాజకీయ పార్టీలున్నాయి. ప్రజా సంఘాలున్నాయి. వారి హక్కులను రక్షించి న్యాయం చేసేందుకు బలమయిన న్యాయ వ్యవస్థలున్నాయి. అందువలన నేడు ఉద్యమిస్తున్న వారందరూ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసిన తరువాతనే ప్రాజెక్టు పనులను మొదలు పెట్టాలని కోరితే సబబుగా ఉంటుంది తప్ప, ప్రాంతీయ, రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకొని, అసలు ప్రాజెక్టు కట్టకుండా అడ్డుపడతామనడం వివేకమనిపించుకోదు.   ఇంతవరకు భారతదేశంలో కట్టిన అనేక ప్రాజెక్టులకు స్థానిక ప్రభుత్వాలు, ప్రజలు, నిర్వాసితులు ఇదేవిధంగా అడ్డుపడి ఉండి ఉంటే నేడు మన దేశంలో, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఒక్క ప్రాజెక్టు కూడా ఉండేది కాదు. అందువల్ల ప్రజలు, రాజకీయ పార్టీలు ఏ ప్రాంతానికి చెందినవారయినా సరే సంకుచిత దృష్టితో కాక జాతీయ దృక్పధంతో వ్యవహరించాలి. లేకుంటే ఆ పరిధి క్రమంగా మరింత కుచించుకుపోయి ఒకే రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో ప్రజలు కలహించుకొనే దుస్థితి ఏర్పడుతుంది. రేపు ఆంధ్రాలోనో లేక తెలంగాణాలోనో కొత్తగా ఏదయినా ప్రాజెక్టు లేదా సంస్థ స్థాపించవలసి వస్తే అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇదే విధంగా రాజకీయం చేస్తూ అడ్డుపడితే రాష్ట్రాల అభివృద్ధి ఏవిధంగా సాధ్యమో అందరూ ఈ సందర్భంగా ఆలోచించాలి.   పోలవరం ప్రాజెక్టు వల్ల కొన్ని వందల గ్రామాలు నీట మునుగుతాయి, దాదాపు రెండు లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతారు. నిజమే! కానీ వారి బాగోగుల పట్ల ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, నేతలకు నిజంగానే ఆసక్తి ఉంటే, రెండు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కలిసి మాట్లాడుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వారికి ప్రస్తుతం ఉన్నజీవనపరిస్థితుల కంటే ఇంకా మంచి జీవన పరిస్థితులు కల్పించవచ్చును. వారి పునరావాసం, రక్షణ, సంక్షేమం, అభివృద్ధి వంటి బాధ్యతలను ఎవరు ఏమేరకు ఏవిధంగా ఏర్పాటు చేయాలో మాట్లాడుకొంటే బాగుంటుంది. కానీ గిరిజనుల పేరుతో రాజకీయాలు చేయడం, లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును అడ్డుకోవాలని చూడటం వివేకమనిపించుకోదు.

చంద్రబాబు చొరవతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం

    తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొని ఆ పార్టీకి మిత్రపక్షంగా మారిన తరువాత, చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోడీ మరియు ఇతర కేంద్ర మంత్రులతో గల సత్సంబంధాలు బాగా పెంపొందించుకొన్నారు. తత్ఫలితంగా కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్ ఆసుపత్రి, ఐఐటీ, పారిశ్రామిక కారిడార్, హార్డ్ వేర్ పార్క్ వంటి అనేక ప్రాజెక్టులు కేటాయిస్తోంది. తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్రానికి అదనపు విద్యుత్ కేటాయించడమే కాక, ఎన్డీయే కొత్తగా ప్రవేశపెట్టబోతున్న నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్రాన్నే ఎంచుకొంది. ఇది అక్టోబర్ రెండు నుండి అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.   రాష్ట్రానికి మరో పెద్ద వరం ఇస్తూ పోలవరం ముంపు గ్రామాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ నిన్న లోక్ సభలో బిల్లును ఆమోదింపజేసింది. సోమవారంనాడు ఈ బిల్లును రాజ్యసభ చేత కూడా ఆమోదింపజేసేందుకు సిద్దమవుతోంది. ఇక కేంద్ర ఇంధన శాఖ రూ.100 కోట్లు వ్యయం అయ్యే మరో విద్యుత్ పైలట్ ప్రాజెక్టును కూడా మంజూరు చేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. ఈ పైలట్ ప్రాజెక్టు అమలుకు వైజాగ్, విజయవాడ, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలను ఎంచుకొంది. ఈ నాలుగు జిల్లాలలో విద్యుత్ నష్టాలను అరికట్టేందుకు నాణ్యమయిన విద్యుత్ పరికరాలను కేంద్రమే అందిస్తుంది. అంతేగాక విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగయిన సేవలు అందించేందుకు, ఈ నాలుగు జిల్లా కేంద్రాలలో సూపర్వైజింగ్ సర్వీస్ మరియు డాటా కలెక్షన్ సెంటర్లను నెలకొల్పుతారు. ఈ నాలుగు జిల్లాలలో ఈ ప్రయోగం విజయవంతమయితే క్రమంగా మిగిలిన జిల్లాలకు, మరియు రాష్ట్రాలకు కూడా దీనిని విస్తరింపజేస్తారు.   ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసే శుష్క వాగ్దానాల వలే కాకుండా, చేసిన ప్రతీ వాగ్దానాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకురావడం నిజంగా చాలా అభినందనీయం, అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర వాణిజ్య శాక మంత్రి నిర్మలా సీతారామన్, ఇదే పనిమీద డిల్లీలో మకాం వేసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావు తదితరులు అందరూ చేస్తున్న చేస్తున్న కృషి కారణంగానే ఇవ్వన్నీ సాకారమవుతున్నాయని చెప్పవచ్చును. అందుకు వారందరినీ కూడా అభినందించవలసిందే.   కేంద్రం ఉదారం అందిస్తున్న ఈ సహాయ సహకారాలను రాష్ట్ర మంత్రులు, యంపీలు, యం.యల్యేలు అందరూ కూడా పూర్తిగా అందిపుచ్చుకొని తమ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలిగితే రాష్ట్రం ఊహించిన దానికంటే చాలా వేగంగానే అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

ఉజ్వల భారత్ కు మోడీ మార్క్ బడ్జెట్

  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సామాన్య ప్రజలపై కొత్తగా ఎటువంటి భారం వేయకుండా, అదే సమయంలో ఎటువంటి ప్రజాకర్షక పధకాలు ప్రకటించకుండా, దేశం సర్వతోముఖాభివృద్ధికి అత్యుత్తమ ప్రణాళిక సిద్దం చేసారు. ఈ బడ్జెటులో విద్యా, వైద్య, ఆర్ధిక, పారిశ్రామిక, వర్తక, వ్యాపార, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పనకు చాలా భారీ ప్రణాళికలు సిద్దం చేసారు. వీటన్నిటి ద్వారా దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తూనే అదే సమయంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే ప్రయత్నం చేయడం చాలా గొప్ప ఆలోచనే.   ఇక ఈ బడ్జెట్ లో మెచ్చుకోవలసిన విషయం ఏమిటంటే, గత ఆరు దశాబ్దాలలో తీవ్ర నిరాధారణకు గురయి, ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఈశాన్య రాష్ట్రాలకు, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో సముచిత స్థానం కల్పించడం. ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక వసతులు, హైవేల అభివృద్ధి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు, కాశ్మీరులో ఐఐటీ ఏర్పాటు అందుకు చక్కటి ఉదాహరణ. కాశ్మీరు మొదలు కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో సమానంగా అభివృద్ధి సాధించేందుకు అనేక వ్యూహాలు రచించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు, వ్యవస్థలకు మేలు చేకూరే విధంగా బడ్జెట్ రూపొందించారు.   ఇక వివరాలలోకి వెళితే, భారీ పెట్టుబడులు అవసరమయిన ఉత్పత్తి, మౌలికవసతులు, రక్షణ, రైల్వేలు తదితర రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, వివిధ సంస్థలలో ప్రభుత్వ పెట్టుబడులను కొంతమేర ఉపసంహరించుకోవడం, బ్యాంకింగ్ రంగంలో అదనపు వనరులను ఉపయోగించుకోవడం ద్వారా, సామాన్య ప్రజలపై ఎటువంటి భారం మోపకుండానే అభివృద్ధి సాధించేందుకు మార్గం కనుగొన్నారు. బ్యాంకింగ్ రంగంలో 2018నాటికి రూ.2.40 లక్షల కోట్ల మూలధన నిధులు సమీకరణ లక్ష్యంగా పెట్టుకొన్నారు.   వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, కాకినాడలో హార్డ్ వేర్ పార్క్, దేశంలో కొత్తగా ఆరు టెక్స్ టైల్ పార్కులు, రూ.11, 635 కోట్ల పెట్టుబడితో కొత్తగా 16 నౌకాశ్రయాల నిర్మాణం, రూ.37,850కోట్లతో దేశవ్యాప్తంగా హైవేల అభివృద్ధి, నిర్మాణం, రూ.7600 కోట్ల వ్యయంతో దేశంలో 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి, రూ.500కోట్లతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ఉపాధికి, దేశాభివృద్ధికి దోహదపడేవే!   మన దేశం ఇంతవరకు కేవలం సాఫ్ట్ వేర్ రంగంపైనే దృష్టి కేంద్రీకరించి, భారీ ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులకు అవకాశామున్న హార్డ్ వేర్ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. కానీ ఈ బడ్జెట్టులో హార్డ్ వేర్ రంగం అభివృద్ధికి కూడా ప్రణాళిక సిద్దం చేసారు.   ఇక కొత్తగా ఐఐటీలు, ఐఐయంలు, ఎయిమ్స్ వైద్య సంస్థలు, మెడికల్ కాలేజీలు, వ్యవసాయ, ఉద్యానవన, పెట్రోలియం విశ్వవిద్యాలయాలు, క్రీడా రంగానికి ప్రత్యేకంగా అకాడమీలు వంటివన్నీ కూడా ఉన్నత విద్యలకు, ఉపాధికి దారి చూపేవే.   ఇక దేశానికి వెన్నెముక వంటి గ్రామీణ భారత పరిస్థితిలో పెనుమార్పులు తెచ్చేందుకు వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా, రైతులకోసమే ప్రత్యేకంగా కిసాన్ ఛానల్ ప్రారంభిస్తున్నారు. లక్షల మంది రైతులు, ప్రజలకు జీవనాధారమయిన గంగా నదీ ప్రక్షాళనకు, ఘాట్స్ అభివృద్దికి రూ.2137కోట్లు, దేశంలో నదుల అనుసంధానంపై అధ్యయనం కోసం రూ.100 కోట్లు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు. భూసార పరీక్షల కోసం మొబైల్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు, తక్కువ వడ్డీపై స్వల్పకాలిక రుణాలు, రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెట్ ధరల స్థిరీకరణ కోసం రూ.100 కోట్లు నిధి ఏర్పాటు, ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను కేటాయించి రైతులు  సంక్షేమంపై శ్రద్ధ వహించారు.   కేవలం అభివృద్ధి పధకాలే కాకుండా సైనికులకు ఒక హోదా ఒకే పించన్, బాలికల సంరక్షణ మరియు విద్య కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్ల నిధులు, యస్సీ, ఎస్టీ మరియు గిరిజనుల సంక్షేమం కోసం ఏకంగా రూ.50, 100 కోట్ల భారీ నిధులు, రక్షిత మంచి నీటి పధకాలకు, కళాశాలలో టాయిలెట్లు, త్రాగునీరు ఏర్పాటు వంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా బడ్జెట్ లో చోటు కల్పించడం ద్వారా, విమర్శలకు తావులేకుండా చేసారు.   ఈవిధంగా దేశాభివృద్ధికి అనేక పధకాలు రచించి అదే సమయంలో వాటి ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గం కూడా కల్పించే ప్రయత్నం చేసారు. ఇంతవరకు కేవలం ప్రజాకర్షక పధకాల ప్రకటనకు, ఆచరణకు నోచుకోని అభివృద్ధి పధకాల ప్రకటనకు మాత్రమే పరిమితమవుతున్న బడ్జెట్ ను అరుణ్ జైట్లీ ఎవరూ ఊహించని విధంగా కొత్త పుంతలు త్రొక్కించి దేశంలో అన్ని వర్గాల మన్ననలు అందుకొంటున్నారు. అందుకు ప్రధాన కారకుడు ప్రధాని నరేంద్ర మోడీయేనని వేరే చెప్పనవసరం లేదు. ఉజ్వల భారత్ నిర్మాణం కోసం మోడీ వేసిన ముద్ర ఈ బడ్జెట్. క్లుప్తంగా చెప్పుకోవాలంటే దేశం మొత్తం సర్వతో ముఖాభివృద్ధికి రూపొందించిన అత్యంత తెలివయిన, ఆకర్షణీయమయిన, ఆశజనకమయిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ ను యధాతధంగా అమలుచేయగలిగితే గత ఆరు దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధిని వచ్చే ఐదు సంవత్సరాలలోనే భారత్ సాధించడం తధ్యం.

ఆర్ధిక బడ్జెట్ పై కూడా మోడీ మార్క్?

  ఆర్ధిక బడ్జెట్ పై కూడా మోడీ మార్క్? కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2013-14 సం.ల ఆర్ధిక సర్వే వివరాలను ఈరోజు లోక్ సభకు సమర్పించారు. గత ఏడాది కాలంలో యూపీఏ ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటిపై అంచనాలు, అసలు ఫలితాలు, ముఖ్యాంశాలు సభకు వివరించి, గొప్ప ఆర్దికవేత్తగా పేరు గాంచిన డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశం ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోయిందని తేల్చి చెప్పారు. యూపీఏ హయాంలో గత రెండేళ్లుగా వృద్ధి రేటు 5శాతం కంటే తక్కువగా ఉండటం చాలా ఆందోళనకరంగా మారిందని, 2014-15సం.లలో తమ ప్రభుత్వం దానిని కనీసం 5.9శాతానికి పెరిగేలా తప్పకుండా గట్టిగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.   ధరల పెరుగుదలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు స్పందిస్తూ, ఇప్పుడు కనబడుతున్న ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అనుచిత నిర్ణయాల వల్ల ఏర్పడినవేనని, తమ ప్రభుత్వం తీసుకొంటున్న కటిన చర్యల కారణంగా త్వరలోనే ధరలు తగ్గుముఖం పడతాయని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ధరల పెరుగుదల గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజాకర్షక విధానాల వలన దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుదేలయిందని దానిని తమ ప్రభుత్వం తప్పకుండా గాడిలో పెట్టి దేశాన్ని అభివృద్ధి పధంలో పరుగులు తీయించేందుకు ధృడసంకల్పంతో ఉందని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు.   ఆయన మాటలను బట్టి రేపు ఆయన ప్రవేశ పెట్టబోయే ఆర్ధిక బడ్జెట్టులో పెద్దగా ప్రజాకర్షక పధకాలేవీ ఉండకపోవచ్చని అర్ధమవుతోంది. స్వాత్రంత్రం వచ్చినప్పటి నుండి చాలా దశాబ్దాలపాటు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, బడ్జెట్ లో ప్రజాకర్షక పధకాలు తప్పనిసరి అనే భావన ప్రజలలో కల్పించి అందుకు అనుగుణంగానే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చింది. వాటి వల్ల దేశానికి ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోగా అటువంటి వాటిని అమలు చేసేందుకు మళ్ళీ ప్రజల నెత్తినే పెను భారం మోపేది.   కానీ దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలో ముందే నిర్ణయించుకొన్న మోడీ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే బడ్జెట్ తయారు చేసుకొంది. నిన్న రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్టు చూసినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది. అందువలన రేపు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే ఆర్ధిక బడ్జెట్టులో కూడా ఎటువంటి ప్రజాకర్షక పధకాలు ఉండక పోవచ్చును. అదే దేశానికి ఆరోగ్యకరం కూడా!

ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ అలుపెరుగని పోరాటం

  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత పదేళ్ళలో స్వయంగా అధికారం చెప్పట్టక పోయినప్పటికీ, ప్రధానమంత్రిని డమ్మీగా చేసి అంతా తానే అయ్యి కర్ర పెత్తనం చేస్తూ వెనక నుండి ప్రభుత్వాన్నినడిపించారు. 120కోట్ల మంది భారతీయుల జీవితాలను ప్రబావితం చేసే అనేక కీలక నిర్ణయాలు చేసారు. రాష్ట్ర విభజన చేసి మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి వదిలిపెట్టారు. ఇంతటి ప్రభావశీలి అయిన ఆమె, ఇప్పుడు లోక్ సభలో ప్రతిపక్షహోదా కోసం పడరాని పాట్లు పడుతుండటం నవ్వు తెప్పిస్తుంది. ఓడలు బళ్లవడం అంటే బహుశః ఇదేనేమో?   నిన్న మొన్నటి వరకు దేశాన్ని ఏక చత్రాధిపత్యంగా పరిపాలించిన ఆమె, తమకు ప్రతిపక్ష హోదా ఇమ్మని అధికార ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎంతగా బ్రతిమాలుకొన్నా ససేమిరా అంటుండటంతో, చేసేదేమీ లేక తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినదిగా కోరుతూ పార్టీ యంపీల చేత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఒక లేఖ వ్రాయించారు. కానీ ఆమె కూడా బీజేపీ సభ్యురాలే కనుక, సానుకూలంగా స్పందిస్తారనే ఆశలేక పోవడంతో సోనియా గాంధీ స్వయంగా వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఆయనకు తన గోడు వెళ్ళబోసుకొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆ స్థాయికి ఎదిగినవారే అయినప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని స్వయంగా అటువంటి నిర్ణయము తీసుకోలేరు. మహా అయితే కేంద్రప్రభుత్వానికి నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చును. అందువల్ల లోక్ సభ స్పీకర్ జవాబు చూసిన తరువాత, అవసరమయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.   అయితే ఈ వ్యవహారంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ, “ఏపార్టీ కయినా సభలో కనీసం 10శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగం చెపుతోంది. కానీ 545 మంది ఉన్న లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ప్రతిపక్ష హోదా కోరుకొంటోందో తెలియదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళదలచుకొంటే మాకేమీ అభ్యంతరం లేదు. రాజ్యాంగానికి బాష్యం చెప్పే సుప్రీంకోర్టుకి ఈ నియమనిబంధనలు అన్నీ తెలుసు,” అని అన్నారు.   ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే, అది ఎన్నికలలో ఓటమికంటే అవమానకరమయిన విషయం అవుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలని భావిస్తోంది. అందుకు ప్రధాన కారణం ఏమిటంటే, ప్రతిపక్ష హోదా దక్కితే తప్ప ప్రభుత్వం నియమించే పలు అధికారిక కమిటీలలో కాంగ్రెస్ కు చోటు దొరకదు. అదేవిదంగా లోకాయుక్త వంటి వ్యవస్థల నియామకాలలో వేలు పెట్టే అవకాశం కూడా లభించదు. పైగా మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి తిరిగి వస్తామో తెలియని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ నేతలు, పార్టీని అంటిపెట్టుకొని ఉండాలంటే వారికి ఇటువంటి అధికారిక కమిటీలలో పదవులేవో ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వ చర్యలను పొగుడుతుంటే, మరికొందరు సోనియా, రాహుల్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దుస్థితిలో ఉన్నందునే ప్రతిపక్ష హోదా కోసం ఇంత గట్టిగా పట్టుబడుతోందని భావించవలసి ఉంటుంది.

రైల్వే బడ్జెటులో ఆంద్ర, తెలంగాణాలకు న్యాయం జరిగేనా?

ఈరోజు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ లోక్ సభలో రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కంటే ముందే ఎన్డీయే ప్రభుత్వం రైల్వే చార్జీలను భారీగా పెంచినందువలన, ఈరోజు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో ప్రజలపై మళ్ళీ ఎటువంటి అదనపు భారం వేయబోదని అందరూ విశ్వసిస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో రైల్వేల ఆదునీకరణ, రైళ్ళలో కొత్త సౌకర్యాలు కల్పన, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.   ఆంద్ర ప్రదేశ్, తెలంగాణాలకు సంబంధించినంత వరకు చూసుకొన్నట్లయితే, ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్టేర్ (విశాఖపట్నం) డివిజన్ను దానిని నుండి విడదీసి, విశాఖ కేంద్రంగా ఆంధ్రాకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్న వైజాగ్ నుండి విజయవాడకు, విజయవాడ-గుంటూరు, తెనాలి, మంగళగిరి(వీజీటీయం) పట్టణాలను కలుపుతూ మెట్రో రైల్ ప్రాజెక్టుల మంజూరు, విజయవాడ-హైదరాబాదులను కలుపుతూ హై స్పీడ్ రైళ్ళు మంజూరు, గత బడ్జెట్ లో ఆమోదించిన కొన్ని రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, కొన్ని కొత్త రైళ్ళను ప్రకటించడం, వీక్లీ రైళ్ళను డైలీగా మార్చడం వంటివాటికి ఈ బడ్జెట్ లో ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు.   ఇక ఈసారి బడ్జెట్ పై తెలంగాణా పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందే చెప్పడం చూస్తే, తెలంగాణకు పెద్దగా కేటాయింపులు ఉండబోవని స్పష్టమవుతోంది. అయితే ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు కావచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదే జరిగితే, తెలంగాణాకు పెద్ద వరంగానే భావించవచ్చును. కోచ్ ఫ్యాక్టరీ వచ్చినట్లయితే వేలమందికి ఉపాధి దొరుకుతుంది, ఆ ప్రాంతం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రైల్వేమంత్రి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కానీ ఆంధ్ర, తెలంగాణాలకు ఆయన ఏమేమి వరాలు ప్రకటించబోతున్నారో అనే విషయం బయటపడదు.

కేసీఆర్ని తిడదాం.. ఆంధ్రాలో నిలబడదాం!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అడ్డంగా విభజించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో అడ్డంగా ఆరిపోయింది. ఏదో బావుకుందామనుకున్న తెలంగాణలో కూడా అడ్రస్ గల్లంతయింది. సరే, తెలంగాణలో గౌరవప్రదమైన స్థానాలు పొందిన కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో ఓ పాతికేళ్ళ తర్వాత అయినా అధికారంలోకి వస్తామన్న ఆశ వుండి వుండొచ్చు. అయితే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి యాసిడ్, ఫినాయిల్ వేసి కడిగినట్టుగా అయిపోయింది. ఒక్క పార్లమెంట్ సీటుగానీ, అసెంబ్లీ సీటుగానీ గెలవలేక మటాషైపోయింది. తెలంగాణలో మాదిరిగా ఏ పాతికేళ్ళకో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదన్న విషయం స్పష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పరువు నిలపడానికి ‘జీరో’ పాయింట్ నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర విభజనకు కారణమైన ప్రధాన వ్యక్తి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత వుంది. ఆ వ్యతిరేకతను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌‌ ప్రజల నుంచి సానుభూతిని పొందాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు భావిస్తు్న్నట్టు తెలుస్తోంది. మామూలుగానే కేసీఆర్ నిరంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు కాలే మాటలు మాట్లాడుతూ వుంటారు, అలాంటి పనులే చేస్తూ వుంటారు. వాటిని అంది పుచ్చుకుని రాజకీయంగా మైలేజ్ పొందాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని రాజకీయ పరిశీకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మీద భారీ స్థాయిలో మాటల దాడి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సానుభూతి పొందాలన్నది కాంగ్రెస్ నాయకుల యోచనగా తెలుస్తోంది. ఏ విషయం మీద అయినా కేసీఆర్‌ మీద మితిమీరిన మాటల దాడి చేయాలని, కేసీఆర్ ఎంత పచ్చిగా మాట్లాడతారో అంతే పచ్చిగా కేసీఆర్ని విమర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు ఎవరిమీద అయినా హద్దులు మీరి మాట్లాడరు. ఇక జగన్ పార్టీ నాయకులైతే కేసీఆర్ అభిమానులు.. ఆయన్ని పల్లెత్తు మాట కూడా అనరు. ఇలా కేసీఆర్ని తిట్టే విషయంలో ఏర్పడిన గ్యాప్‌లో దూరిపోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోక తప్పదా?

  తెరాస ప్రభుత్వం దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. మూడు నాలుగు రోజుల క్రితమే జీ.హెచ్.యం.సి అధికారులు నాగార్జున కు చెందిన యన్. కన్వెన్షన్ సెంటరు అక్రమ నిర్మాణమని ప్రకటించారు. దానిపై నాగార్జున కోర్టుకు వెళ్ళినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆయనకీ చట్టబద్దంగా నోటీసులు జారీ చేసి చర్యలు చెప్పట్టవచ్చని హైకోర్టు సూచించింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పోరేషన్ కు చెందిన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నిన్న తెలంగాణా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించింది.   ఇదివరకు తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో ఉన్నపుడు దానిని హైదరాబాదుకు రప్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ యన్టీఆర్ హైదరాబాదులో 40 ఎకరాల భూమిని సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. అందులో 9 ఎకరాలలో సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ స్టూడియోని నిర్మించగా, 5 ఎకరాలలో రామానాయుడు ఒక స్టూడియో నిర్మించి నాటి నుండి నేటి వరకు కూడా వాటిలో షూటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిగిలిన భూములను మరికొందరు సినీ ప్రముఖులకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు వాటిలో 20ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించింది. ఇది తెలుగు సినీ పరిశ్రమకు నిర్ఘాంతపరిచింది.   ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుపై తీవ్రంగా విరుచుకుపడటంతో, అది తెలంగాణాలో కూడా ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణా గడ్డపై సినిమాలు నిర్మిస్తూ, ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించుకొంటున్న సినీపరిశ్రమ, తమకు వ్యతిరేఖంగా పనిచేస్తోందనే తెలంగాణా ప్రభుత్వం భావించేందుకు ఇదీ ఒక కారణమని బహుశః అందుకే తెరాస అధికారంలోకి రాగానే తెలుగు సినీపరిశ్రమపై కొరడా జుళిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారి అంచనాలు నిజమయితే బహుశః త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సహా అనేకమందికి టీ-సెగ తగలవచ్చును.   ఇక మరోపక్క ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి విడిపోయి కొత్తగా తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్న తెలంగాణా సినీ పరిశ్రమకు చెందిన కొందరు, తాము ఇకపై ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పనిచేయదలచుకోలేదని, అందువల్ల ఆ భవనంలో తమ వాటా తమకు వెంటనే అప్పగించమని కోరుతూ ఆందోళనచేస్తున్నారు. అందుకు ఆంధ్రాకు చెందిన సినీ పెద్దలు అంగీకరించినప్పటికీ, రెండు ఫిలిం చాంబర్లు కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ క్రింద కలిసి పనిచేద్దామనే చేస్తున్న ప్రతిపాదనను తెలంగాణా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు నిర్ద్వందంగా తిరసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందువలన అంటే ఇంకా ఆంధ్రాకు చెందిన నిర్మాతలు, దర్శకుల పెత్తనంలో తాము పనిచేయవలసిన అవసరం లేదని, ఆంధ్రా నిర్మాతలు, దర్శకులు నిర్మిస్తున్న సినిమాలు తెలంగాణాలో ప్రదర్శింపజేసుకోనేందుకే ఈ ఏర్పాటు ఉపయోగపడుతుంది తప్ప, తెలంగాణా సినిమాలు ఆంధ్రాలో రిలీజ్ చేసే ఆలోచనలు, అవకాశాలు లేనందున, ఈ ప్రతిపాదనను వ్యతిరేఖిస్తున్నాట్లు చెపుతున్నారు.   ఈ సమస్య ఇలా నలుగుతుంటే మరోపక్క ఆంధ్రాకు చెందిన నిర్మాతలు, దర్శకులు అక్కడి హీరోలతో నిర్మించుతూ, తెలంగాణా(నైజాం ఏరియా)లో కూడా వందలాది సినిమా హాళ్ళను తమ గుప్పెట్లో పెట్టుకొని తెలంగాణా ప్రజల నుండి లక్షల కొల్లగొడుతున్నారని కొందరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటువంటి వారు కొందరు ఇటీవల హైదరాబాదు శివార్లలో జరుగుతున్న (రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న) బాహుబలి సినిమా షూటింగును అడ్డుకొన్నట్లు సమాచారం. అదేవిధంగా రజనీకాంత్ నటించిన విక్రమసింహ సినిమా ప్రదర్శనను కూడా అడ్డుకోన్నట్లు తెలుస్తోంది.   తెలుగు సినీపరిశ్రమ ఎక్కడికీ వెళ్ళదు. హైదరాబాదులోనే ఉంటుంది అని మా అధ్యక్షుడు మురళీ మోహన్ వంటి వారు ఎంత గట్టిగా చెపుతున్నప్పటికీ, ఈ సమస్యలన్నీ చూస్తుంటే తెలంగాణా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను నోటితో పొమ్మని చెప్పకుండా పొగపెట్టి బయటకు పంపేప్రయత్నం చేసినట్లే కనిపిస్తోంది గనుక త్వరలోనే సినీ పరిశ్రమ మూటాముల్లె కట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరవలసిన సమయం దగ్గర పడుతున్నట్లే ఉంది. ఇందుకు తెలుగు ప్రజలు సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి.

ఎందుకీ అకారణ ద్వేషం?

  ఆంధ్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి కనీసం నెల రోజులు గడవక మునుపే అప్పుడే విద్యుత్, జల వివాదాలు మొదలయ్యాయి. ప్రతీసారి కేంద్ర జల, విద్యుత్ సంఘాలు జోక్యం చేసుకొంటే తప్ప అడుగు ముందుకుపడటం లేదు. విభజన కారణంగా ఉభయ రాష్ట్రాలు అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో అవి సరిపోవన్నట్లుగా మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం అవివేకమే అవుతుంది.   రాష్ట్ర విభజన మొదలు మొన్న ఎన్నికల వరకు జరిగిన రాజకీయాలతో ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా విసుగెత్తిపోయి ఉన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి జరగాలని కోరుకొంటున్నారు తప్ప ఇంకా ఈ విద్వేషాలను కొనసాగించాలని కోరుకోవడం లేదనే సంగతిని రెండు ప్రభుత్వాలు గ్రహించాలి. ప్రజల దృష్టిలో హీరోలుగా నిలిచేందుకో, లేక సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికో అధికారంలో ఉన్నవారు ఇతరుల గురించి చులకనగా మాట్లాడటం, నిందించడం, దుందుడుకుగా వ్యవహరించడం వలన తాత్కాలికంగా కొందరు ప్రజల మెప్పు పొందవచ్చునేమో, కానీ చిరకాలం ప్రజలందరినీ మెప్పించలేరు. మభ్యపెట్టలేరు. వారు ఇదే ధోరణి ఇంకా కొనసాగించినట్లయితే ఆ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో ప్రజలు కూడా గ్రహించగలరు.   రాష్ట్ర విభజన జరగడం కోసం తెరాస నేతలు ఆంధ్ర, తెలంగాణా ప్రజలను మానసికంగా విడదీసారు. చివరికి వారు కోరుకొన్నట్లే భౌగోళికంగా కూడా రెండు రాష్ట్రాలు విడిపోయాయి. అయినా ఇంకా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, వ్యవహరించడం వల్ల ఏమి ప్రయోజనం ఆశిస్తున్నారో వారికే తెలియాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయనం పాటిస్తూ, తెలంగాణా ప్రభుత్వానికి స్నేహహస్తం అందిస్తుంటే, తెరాస నేతలు మాత్రం అందుకు ఏ మాత్రం సానుకూలంగా స్పందించకపోగా, దానిని ఆయన బలహీనతగా భావిస్తున్నట్లు చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏమాత్రం సంమయమనం కోల్పోకుండా వ్యవహరిస్తుండటం అభినందనీయం.   మాటకారితనం ప్రదర్శించడం వలన రెండు ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య కూడా దూరం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. ‘రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ములుగా కలుసుందాము,’ అని తెరాస నేతలు పదేపదే చెప్పిన నిన్నటి మాటలను ఒక మారు గుర్తుకు తెచ్చుకోవాలి. నిన్న మొన్నటి వరకు ఒకటిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా మారినపుడు అన్నదమ్ములవలె మెలగాలి తప్ప దాయాదులుగా మారి కుమ్ములాడుకోవడం తగదు. దాని వలన రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప వేరే ప్రయోజనం ఉండదు. అందువల్ల ఇప్పటికయినా తెరాస నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల పట్ల తమ అకారణ విద్వేష వైఖరిని విడనాడి, స్నేహసంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేయగలిగితే, రాష్ట్ర విభజన కారణంగా తలెత్తుతున్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చును. రెండు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ వేగంగా అభివృద్ధి చెందవచ్చును. కానీ ఇప్పుడు కూడా రెండు ప్రభుత్వాలు విజ్ఞతతో వ్యవహరించకపోతే, కేంద్రం దృష్టిలో, దేశ ప్రజల దృష్టిలో తెలుగుజాతి చులకనవుతుంది. నవ్వులపాలవుతుంది.

రాష్ట్ర విద్యుత్ పరిస్థితి నాడు-నేడు-రేపు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై నిన్న శ్వేతపత్రం విడుదలచేశారు. ఒకప్పుడు మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం, నేడు విద్యుత్ లోటుతో ఏవిధంగా అవస్థలు పడుతోందో గణాంకాలు, కారణాలతో సహా వివరించారు. 1996-2004వరకు సాగిన తెదేపా పాలనలో పరిస్థితికి, 2004-2014 వరకు సాగిన కాంగ్రెస్ పాలనలో విద్యుత్ పరిస్థితులకి మధ్య వచ్చిన స్పష్టమయిన తేడాను ఆయన వివరించారు.   తమ హయంలో ధర్మల్ విద్యుత్ ఉత్పాదకత 86శాతానికి పెరగగా, అది గత పదేళ్ళలో 78శాతానికి పడిపోయిందని తెలిపారు. తను అధికారం చెప్పట్టే సమయానికి 14.2 శాతం ఉన్న విద్యుత్ లోటును 1.5శాతానికి తగ్గించగలిగానని తెలిపారు. కానీ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వలన ఆ లోటు మళ్ళీ క్రమంగా పెరుగుతూ 2003-04 నాటికి 7.1 శాతం, 2004-14 నాటికి ఏకంగా 17.6శాతానికి చేరుకొందని తెలిపారు.   థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో కనీసం బొగ్గు నిల్వలు కూడా ఉంచుకోవాలనే విషయాన్ని కూడా పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తత్ఫలితంగా తరచూ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయాలు ఏర్పడటాన్ని ఆయన గుర్తుచేశారు. తమ హయాంలో అన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద నెల రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉంచితే నేడు ఎక్కడా కూడా ఒక్కరోజుకు సరిపోయే బొగ్గు నిల్వలు లేవని తెలిపారు.   విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినందునే నేడు ఈ దుస్థితి కలిగిందని, రాష్ట్ర విభజన కూడా జరగడంతో రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన విద్యుత్ కూడా దక్కకపోవడంతో నేడు రాష్ట్రం విద్యుత్ కోతలతో అల్లాడిపోతోందని వివరించారు. తమ హయంలో వ్యవసాయానికి 9గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తే, నేడు గృహావసరాలకు కూడా విద్యుత్ ఈయలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యలన్నిటినీ తమ ప్రభుత్వం పరిష్కరించి మళ్ళీ రాష్ట్రానికి మిగులు విద్యుత్ తప్పక సాధిస్తానని ఆయన హామీ ఇచ్చారు.   ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక మార్లు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యి రాష్ట్రానికి అనేక వరాలు రాబట్టారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి: విజయవాడ, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పతి సంస్థల ఉత్పత్తి పెంపుదల కోసం విస్తరణ పనుల నిమిత్తం రూ.10,426 కోట్లు, రాష్ట్రంలో వివిధ విద్యుత్ సంస్థల అభివృద్ధికి రూ.7842 కోట్ల రుణం సాధించారు. అదేవిధంగా కృష్ణపట్నంలో ధర్మల్ విద్యుత్ కేంద్రం విదేశీబొగ్గు ధరలు పెరిగిన కారణంగా ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలియగానే, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో మాట్లాడి మహారాష్ట్రలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ నుండి ఏడాదికి 4లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఒప్పించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకోనుంది.   వివిధ రాష్ట్రాల నుండి బొగ్గు తెచ్చుకొనేందుకు తగినన్ని వేగన్లు లేకపోవడం చేత కూడా బొగ్గు సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతుండటంతో, కేంద్ర విద్యుత్ శాఖా మంత్రితో మాట్లాడి యన్టీపీసీలకు చెందిన వేగన్లను వాడుకొనేందుకు అనుమతి పొందారు. అదిగాక కేంద్ర విద్యుత్ గ్రిడ్ నుండి రాష్ట్రానికి 177మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు, నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు క్రింద మరో 500మెగావాట్స్ సరఫరాకు కేంద్రం అంగీకరించింది. అంతే గాక రాష్ట్రంలో భారీ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.   గత పదేళ్ళలో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ అవినీతి, అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొంది. కానీ చంద్రబాబు నాయుడు అధికారం చెప్పట్టగానే, నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం అందుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుండటంతో, బహుశః మరి కొన్ని నెలలలోనే ఈ తీవ్ర విద్యుత్ సంక్షోభం నుండి రాష్ట్రం బయటపడవచ్చనిపిస్తోంది.  

అమరావతిలో కొత్త రాజధాని?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మద్య నిర్మింపబడబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అధికార పార్టీ మంత్రులందరూ ఖరారు చేసారు.దానిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు సైతం ఖరారు చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదన మారినట్లు వార్తలు వస్తున్నాయి. గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతం రాజధాని నిర్మాణానికి చాలా అనువుగా ఉన్నప్పటికీ అక్కడ సారవంతమయిన వ్యవసాయ భూములపై రాజధాని నిర్మించడం సబబు కాదని ప్రభుత్వం భావిస్తోంది. అదీగాక అక్కడ ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నందున తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించి ప్రైవేటు భూములను కొనవలసి ఉంటుంది. ఈ రెండు కారణాల వలన రాజధానిని విజయవాడ-గుంటూరు సమీపంలోనే వేరే ప్రాంతంలో నిర్మించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం.   గుంటూరు జిల్లాలో అమరావతి వద్ద లేదా ఏలూరు-విజయవాడ మధ్య హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నూజివీడు రూటులో బలుపులపాడు వద్దగానీ కొత్త రాజధాని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం.   అమరావతి వద్ద రాజధాని నిర్మాణం కోసం దాదాపు 15000 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్దంగా ఉంది. కనుక ప్రభుత్వం భూమి కొనుగోలుపై డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. కృష్ణానదికి ఇరువైపులా వ్యాపించి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో కొన్ని మండలాలను కలిపేందుకు గుంటూరులో అచ్చంపేట మండలం నుండి కృష్ణా జిల్లాలో నందిగామ వరకు ఎనిమిది లైన్ల బ్రిడ్జిని, కృష్ణా జిల్లాలో కంచికర్ల నుండి అమరావతి వరకు మరొక బ్రిడ్జి కూడా నిర్మించినట్లయితే అమరావతిలో నిర్మింపబడే కొత్త రాజధానితో ఆ రెండు జిల్లాలలో అన్ని ప్రాంతాలు పూర్తిగా అనుసంధానమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.   ఇక ప్రభుత్వ పరిశీలనలో ఉన్న మరో ప్రాంతం నూజివీడు వద్దగల బలుపులపాడు అటవీ ప్రాంతం. ఇక్కడ కూడా అటవీ శాఖకు చెందిన 15, 000 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతాన్ని డీ-నోటిఫై చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేప్పట్టినట్లు తెలుస్తోంది.   ఈ రెండు ప్రాంతాలలో ఏదో ఒక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేసి రెండవ ప్రాంతంలో ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు ప్రభుత్వం తరపున అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు కనుక ఇంకా విజయవాడ-గుంటూరు మధ్య గల ప్రాంతం కూడా రాజధాని కోసం పరిశీలనలో ఉన్నట్లే భావించవలసి ఉంటుంది. బహుశః ఈ నెలాఖరులోగా కొత్త రాజధానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కమలనాధన్ కమిటీతో ఉద్యోగుల సమస్యలు తీరేనా?

  ఇంతకాలంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కోసం పనిచేసిన ప్రభుత్వోద్యోగులను రాష్ట్రవిభజన కారణంగా రెండు రాష్ట్రాలకు పంచవలసివచ్చింది. ఈ సంక్లిష్టమయిన ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాక మునుపే రాష్ట్ర విభజన జరిగిపోయింది. రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అందువల్ల ఉద్యోగులు ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలనే సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గత యూపీఏ ప్రభుత్వం నియమించిన కమలనాధన్ కమిటీ నిన్న సచివాలయంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో, ఉద్యోగ సంఘ నేతలతో సమావేశమయింది. ఉద్యోగులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలో ఎంచుకొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.   ఆంద్ర ఉద్యోగులకు ఆప్షన్స్ ఉండవని, వారు తప్పనిసరిగా వెళ్లిపోవలసిందేనని, తెలంగాణా సచివాలయంలో కల్తీ ఉండొద్దు, ఆంద్ర ఉద్యోగులను లోనికి రానిచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెగేసి చెపుతున్నపుడు, కమలనాధన్ కమిటీ ఉద్యోగులకు ఆప్షన్ ఉంటాయని చెప్పడంతో ఈ సమస్య మరింత జటిలమయింది. ఆంద్రప్రాంతానికి చెందిన ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలనే ఆప్షన్ కోరుకొంటే ఏమవుతుంది? ఆంద్ర విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించేందుకే ఇష్టపడని కేసీఆర్, ఇప్పుడు వందల కొద్ది ఆంధ్ర ఉద్యోగులు తన ప్రభుత్వంలో పనిచేసేందుకు ఆప్షన్ ఎంచుకొని, పదవీ విరమణ చేసినట్లయితే వారందరికీ జీవితాంతం పెన్షన్ తదితర సదుపాయాలూ ఇచ్చేందుకు అంగీకరిస్తారని ఏవిధంగా భావించగలము? అప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు కమలనాధన్ కమిటీ వద్ద సమాధానం లేదు.   ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినట్లేనని భావిస్తున్న కమలనాధన్ కమిటీ నేడు కేంద్ర ప్రభుత్వానికి తన నివేదిక ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పకుండా ఉద్యోగులను విభజిస్తే వందలాది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. అనేక సం.లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవ చేస్తున్న ఉద్యోగులు ఇపుడు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణాకు కూడా కాని వారిగా మిగిలిపోయేలా ఉన్నారు. అందుకే సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.   అయితే ఈ జతిలమయిన సమస్యలకు పరిష్కారం ఏమిటి? ఎవరు చెపుతారు? అని ప్రశ్నించుకొంటే ఈ సమస్యను ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలే చొరవ తీసుకొని పరిష్కరించుకోవలసి ఉంటుందని గ్రహించవచ్చును. కమలనాధన్ కమిటీ కేవలం పరిష్కార మార్గాలను మాత్రమే చెప్పగలదు. కానీ సమస్యలను పరిష్కరించుకొనే బాధ్యత మాత్రం ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలపైనే ఉంది. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొంటూ మానవీయ దృక్పధంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చును. రాష్ట్ర విభజన కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమవుతున్న ఇటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకొనేందుకు రెండు ప్రభుత్వాలు తాత్కాలిక నివారణోపాయలు చేయకుండా, రానున్న ఐదేళ్ళ కాలం కోసం ఇరు రాష్ట్రాలకు చెందిన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకొంటే మంచిది.