వేలకోట్లు తృణీకరించతరమా?
posted on Apr 21, 2014 6:38AM
తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎవరూ ఊహించలేని కొత్త కొత్త ఐడియాలతో తెలంగాణా రాజకీయాలకు అనేక ట్విస్టులు ఇస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ సెట్లర్స్ ఓట్ల కోసమే తెలంగాణా ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆరోపించిన ఆయన, తరువాత ఆంద్ర పార్టీ నేతలు, తెలంగాణాలో ఓట్లు కోనేయడానికి డబ్బు సంచీలతో దిగుతున్నారని ఆరోపించారు. ఆ తరువాత కేవీపీ రామచంద్ర రావు దయతోనే పొన్నాల లక్ష్మయ్యకి తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని, కేవీపీయే తెలంగాణా కాంగ్రెస్ నేతలందరినీ వెనుక నుండి నడిపిస్తున్నారని మరో అసంబద్దమయిన ఆరోపణ చేసారు. ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా కేవీపీ తనకు కూడా వేల కోట్లు ఆఫర్ చేసారని కానీ తానే ‘చ్చీ’ పొమ్మన్నాని తాజాగా ప్రక్రటించారు.
తెరాసతో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఏదోవిధంగా ప్రలోభపెట్టడానికే ప్రయత్నిస్తాయనేది ఎవరూ కాదనలేని చేదు నిజం. ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో వివిధ పార్టీల అభ్యర్ధులు తమ తమ నియోజక వర్గాలలో ఓట్ల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటే అర్ధం ఉంది. కానీ, సీమాంధ్రలో నేతలు తెలంగాణాలో తమ పార్టీలను, అభ్యర్ధులను గెలిపించుకోవడానికి కూడా డబ్బు ఖర్చు పెట్టేందుకు వస్తున్నారనడం చాలా అసంబద్ధంగా ఉంది. అంతకంటే, తమ రాజకీయ ప్రత్యర్ధులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంటే అర్ధం ఉంటుంది. ప్రజలు ఆయన మాటలు నమ్మే అవకాశం ఉంటుంది.
ఇక, ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా పూర్తి స్థాయి ఎన్నికలను ఎదుర్కోవడం తెరాసకు కొత్తేమో కానీ, కాంగ్రెస్, బీజేపీ, తెదేపాలకు కొత్తేమీ కాదు. తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ ఇటువంటి ఎన్నికలను చాలానే చూసారు. వారు గెలుపోటములు తట్టుకొని నిలబడగల సత్తా గలవారు. వారు ఎన్నికల అధికారులకు సమర్పించిన తమ ఆస్తుల వివరాల ఎఫిడవిట్లను చూసినట్లయితే వారు ఆర్ధికంగా ఎంత బలవంతులో అర్ధమవుతుంది. అటువంటి వారికి ఆంధ్రా నుండి ఎవరో డబ్బు సంచులతో వచ్చి ఆర్ధికంగా మద్దతు ఇస్తున్నారని కేసీఆర్ ఆరోపించడం హాస్యాస్పదం.
ఇక కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఏడాది అంత కష్టపడితే ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు స్వయంగా చెప్పుకొన్నారు. కొన్ని కోట్లు సంపాదించేందుకు ఆయన అంత ప్రయాసపడుతున్నపుడు, ఏమీ చేయకుండా ఉండటానికే కేవీపీ ఆయనకు వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తే దానిని తాను తిరస్కరించానని కేసీఆర్ చెప్పుకోవడం మరో పెద్ద జోక్ అని చెప్పవచ్చును. తెలంగాణా కోసం తెరాస చేసిన ఉద్యమాలను ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ అదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల బలవంతపు వసూళ్ళ గురించి బహిరంగ చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపిస్తున్న సందర్బంగా కేసీఆర్ కుమార్తె కవిత నడిపిస్తున్న తెలంగాణా జాగృతి సంస్థకు విదేశాల నుండి వచ్చిన భారీ విరాళాల గురించి ప్రశ్నించడం, మాజీ తెరాస నేత శ్రావణ్ కుమార్ కేసీఆర్ టికెట్స్ అమ్ముకొన్నారని చెపుతున్న మాటలు ఇందుకు చిన్న ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.
కేసీఆర్ పదవీ కాంక్ష వల్లనే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదన్న సంగతీ అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు, అసలు ఏ కష్టమూ లేకుండానే వేలకోట్లు కేసీఆర్ ఒళ్లో అప్పనంగా వచ్చిపడుతుంటే, తెలంగాణా కోసం దానిని తృణప్రాయంగా భావించి ‘చ్చీ కొట్టానని ఆయన చెప్పుకోవడం హాస్యాస్పదం.
ఆయనకి డబ్బు, పదవీ కాంక్ష లేనప్పుడు ముందు చెప్పినట్లుగానే, తెలంగాణా ఏర్పడగానే తెరాసను రద్దు చేసి, తెలంగాణకు కాపాలాగా నిలిచి ఉండి ఉంటే, నేడు ఆయన చెపుతున్న మాటలను ప్రజలు కూడా నమ్మి ఉండేవారేమో. ఇక మున్ముందు ఆయన ఇటువంటి కబుర్లు ఇంకెన్ని చెపుతారో మరి!