ఐటీ పాలసీలో చిన్న కంపెనీలపట్ల సవతి ప్రేమ ఏల?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాడిందే పాట అన్నట్లు, పాత నిర్ణయాలనే మరోమారు వల్లె వేశారు. గతంలో చెప్పిన అక్టోబర్ 2నుండి నిరంతర విద్యుత్ సరఫరా,వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ సరఫరా, విజయవాడ, కాకినాడ, అనంతపురం, తిరుపతిలో ఐటీ హబ్‌లు, విశాఖలో మెగా ఐటీ పార్క్ ఏర్పాటు, విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులు, సింగిల్ విండో విధానం, మొక్కలు నాటే కార్యక్రమం వంటి విషయాలనే మళ్ళీ మరోమారు చెప్పారు. కానీ, ఐటీ శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది 5 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కంపెనీలకు 60% రాయితీ ఇవ్వడం. సాధారణంగా మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి అతిపెద్ద ఐటీ కంపెనీలలో తప్ప చిన్న మధ్యస్థ స్థాయి ఐటీ కంపెనీలలో అంతమంది ఉద్యోగులు ఉండరు. అంటే ప్రభుత్వం అటువంటి పెద్ద సంస్థలకే ప్రాధాన్యం ఇస్తోంది తప్ప చిన్న కంపెనీల పట్ల దానికి ఆసక్తి లేదని ఈ పాలసీ ద్వారా స్పష్టమవుతోంది.
అయితే అటువంటి యాంకర్ కంపెనీలను ఆకర్షించ గలిగితే, వాటిని అనుసరించి అనేక చిన్న, పెద్దా కంపెనీలు అనేకం వస్తాయనేది వాస్తవమే. అందువలన అటువంటి పెద్ద సంస్థలను ఆకర్షించేందుకు రాయితీలు ఇవ్వడాన్ని ఎవరూ ఆక్షేపించరు. వచ్చే ఐదేళ్లలో రూ.12 వేల కోట్ల ఐటీ పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రాన్ని సిలికాన్ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ప్రభుత్వం, చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల కోసం ఈ పాలసీలో ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు.
నిజానికి ఒక పెద్ద సంస్థను ఆకర్షించడానికి ఈవిధంగా ప్రయాసపడటం కంటే, ప్రభుత్వం సహకారం అందిస్తే వందలకొద్దీ చిన్న మధ్యస్థ ఐటీ కంపెనీలు స్థాపించేందుకు రాష్ట్రంలో అనేకమంది పారిశ్రామిక వేత్తలు, యువ ఇంజనీర్లు సిద్దంగా ఉన్నారు. వారు తమ సంస్థలను కేవలం వైజాగ్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద పట్టణాలలోనే కాకుండా వెనుకబడిన జిల్లాలలో కూడా స్థాపించేందుకు సిద్దంగా ఉన్నారు. అటువంటి ఔత్సాహికులకు ప్రభుత్వం అండగా నిలిచి, వారికి తగిన వసతులు కల్పిస్తే ఐటీ పరిశ్రమ రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది.
పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీల స్థాపన చాలా సులభం. వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టగలవు. కనుక ఆయా ప్రాంతాలలో ఉండే యువతకు వెంటనే ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వానికి తక్షణమే ఆదాయవనరు ఏర్పడుతుంది. అదేవిధంగా యువతకు ఐటీ రంగంలో సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు విద్యాసంస్థలు ఏర్పడి వాటి ద్వారా అనేకమందికి ఉపాధి లభిస్తుంది.
ఇక ప్రభుత్వం కొత్త ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో నడుస్తున్న ఐటీ కంపెనీల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని అనేక సంస్థలు వాపోతున్నాయి. వారిని తెలంగాణా ప్రభుత్వం ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ప్రభుత్వం వారిపట్ల ప్రత్యేకశ్రద్ధ వహించి వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తక్షణమే చెపడితే వాటిని కాపాడుకోవడమే కాకుండా, అది కొత్త సంస్థలకు మంచి సంకేతం అందజేసినట్లవుతుంది.
ఇక ఐటీ కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది మంచి నిర్ణయమే. కానీ ఈ రాయితీలు అందరికీ ముఖ్యంగా చిన్న మధ్యస్థ ఐటీ కంపెనీలకు వర్తింపజేయడం వల్ల రాష్ట్రంలో త్వరగా ఐటీ పరిశ్రమ ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఐటీ రంగానికి పాలసీ ప్రకటించినప్పటికీ, చిన్న, మధ్యస్థ కంపెనీల యజమానులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వారి అవసరాల మేరకు తన పాలసీలో మార్పులు చేర్పులు చేసుకొంటూ ముందుకు సాగినట్లయితే, ఆ పాలసీ మరింత అర్ధవంతంగా మారి, ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా పూర్తి ప్రయోజనం చేకూర్చగలదు.