తెదేపా-బీజేపీ సభలలో ఎవరి గోల వారిదే
posted on Apr 23, 2014 7:11AM
నిన్న నరేంద్ర మోడీ తెలంగాణాలో నిర్వహించిన నాలుగు సభలలో కొన్ని ఆసక్తికరమయిన విషయాలు కనబడుతున్నాయి. ఆయన సభలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గోవడం ఒక ఆసక్తికర ఆంశమనుకొంటే, అంతకంటే చాలా ఆసక్తికరమయిన విషయాలు మరి కొన్ని ఉన్నాయి.
తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమికి ప్రధాన శత్రువులు కాంగ్రెస్, తెరాసలు. ఆ రెండు పార్టీలను నరేంద్ర మోడీ తీవ్రంగా విమర్శిస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం కాంగ్రెస్ మీద, అది కూడా సోనియా, రాహుల్ గాంధీలపైనే సాగాయి తప్ప రాష్ట్ర నేతలని, ముఖ్యంగా తమ పార్టీ అభ్యర్ధులపై పోటీ చేస్తున్న బలమయిన కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రస్తావనే చేయలేదు. కానీ, ఆయన తన ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్ అనే మాట పలకకుండా చాలా సున్నితంగా తెరాసను ఏదో మొక్కుబడిగా తప్పదన్నట్లు విమర్శించారు.
మొన్న రాహుల్ గాంధీ తెరాస అధినేత కేసీఆర్ నమ్మక ద్రోహి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించి, అటువంటివారికి ఓటేయవద్దని ప్రజలను గట్టిగా కోరారు. కానీ నరేంద్ర మోడీ తెదేపా-బీజేపీ కూటమికి పట్టం కట్టమని కోరారే తప్ప, రాహుల్, పవన్, చంద్రబాబు మాదిరిగా తెరాసపై తీవ్ర విమర్శలు చేయకపోవడం చాలా విచిత్రం.
నిన్న జరిగిన రెండు సభలలో కూడా చంద్రబాబు మోడీ భజన చాలా గట్టిగానే చేసారు. కానీ మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ మెచ్చుకొన్నారు తప్ప, చంద్రబాబు కార్యదక్షత, సమర్ధత గురించి కానీ, తెదేపా గురించి గానీ గట్టిగా ఒక్క ముక్క కూడా చెప్పకపోవడం మరో విశేషం.
ఇక ఒకప్పుడు తెదేపాలో చంద్రబాబుకి ముఖ్య అనుచరుడిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి, పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఆయనను తిట్టడమే వృత్తిగా పెట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి పోటీ చేస్తున్న మెహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో చంద్రబాబు పాల్గోవడం, ఆయన పక్కనే కూర్చొని ఏదో మాట్లాడటం చాలా ఆసక్తి కలిగిస్తోంది.
ఇక, మోడీతో కలిసి రెండుసభలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి, మోడీకి ఓటేయమని కోరారు తప్ప, తెదేపాకు ఓటేయమని ఎక్కడా కోరలేదు. ఆయన రెండు ప్రసంగాలలో తెదేపా ఊసే లేదసలు. ఆయన కూడా చంద్రబాబులాగే మోడీ భజనలో తరించిపోయారు, కానీ ఎక్కడా తన ప్రసంగంలో చంద్రబాబు పేరు కూడా ఎత్తలేదు.
ఇక తెలంగాణాలో ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ తన ప్రసంగంలో తెలుగుజాతి ఔనత్యం గురించి, కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని ఏవిధంగా అవమానించింది వివరించి, తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా వేరయినా ఒకే జాతిగా కలిసి ఉండాలని ప్రభోదించడం కూడా కొంచెం ఆశ్చర్యకరమే. సాధారణ సమయాలలో ఇటువంటి ప్రభోదం సహజంగానే అనిపించవచ్చు. కానీ ఎన్నికల సమయంలో ఈ ప్రస్తావన కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ చేస్తున్న వేర్పాటువాదం గురించి పవన్ ఆయనకి చెప్పినందునే, మోడీ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని ఈవిధంగా వ్యక్తపరిచారని భావించవలసి ఉంటుంది. కానీ మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ లాగ కేసీఆర్ మరియు ఆయన కుటుంబసభ్యులపై ఎటువంటి విమర్శలు చేయలేదు.
ముగ్గురు ముఖ్యమయిన వ్యక్తులు చేతులు కలిపి ఒకరికొకరు అండగా నిలబడి, తమ రాజకీయ ప్రత్యర్ధులను బలంగా ఎదుర్కొంటారని అందరూ భావించారు. కానీ ముగ్గురూ కూడా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం వలన, ఈసభలు వారి మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టుకొనేందుకే ఏర్పాటు చేసుకోన్నట్లుంది తప్ప, తమ ఐక్యతని చాటి చెప్పి, తమ కూటమిని బలపరుచుకొని, ప్రత్యర్ధులను గట్టిగా ఎదుర్కొనేలా మాత్రం లేదనే చెప్పక తప్పదు. (అందుకు గల కారణాలను వేరే శీర్షికలలో ప్రత్యేకంగా విశ్లేషించుకొందాము).