తెలంగాణకు మేలు చేసేదెవరు?
posted on Apr 27, 2014 @ 12:15PM
ఈసారి కేంద్రంలో, ఆంధ్ర, తెలంగాణాలలో ఏర్పడబోయే ప్రభుత్వాలను బట్టి ఆయా రాష్ట్రాల అభివృద్ధి ఆదారపడి ఉంటుంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో లేదా ఏ ఒక్క రాష్ట్రంలోనయినా తెదేపా-బీజేపీల ప్రభుత్వాలు ఏర్పడినట్లయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహజంగానే మంచి సయోధ్య ఉంటుంది గనుక ఆ రాష్ట్రాల పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమయిన నిధులు విడుదలవుతూ త్వరితగతిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.
ఒకవేళ తెలంగాణాలో తెరాస భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా, కేసీఆర్ చెపుతున్న ‘బంగారి తెలంగాణా’ నిధుల కోసం కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దాని దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలతో వ్యవహరిస్తున్న తీరువలన వారి మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడూ ఎవరితో ఒకరితో కయ్యాలే తప్ప స్నేహధర్మం పాటించడం అలవాటులేని తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణా పగ్గాలు చేపడితే, తెలంగాణాకు కేంద్రం నుండి ఆశించినంతగా సహకారం ఉండదు. పైగా తమ పార్టీ గెలిస్తే ఆ రెంటికీ మద్దతు ఇవ్వనని, ఎక్కడా కనబడని థర్డ్ ఫ్రంట్ కే మద్దతు ఇస్తానని చెపుతున్నారు. అటువంటప్పుడు ఆయన తను హామీ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టుకోవడానికి నిత్యం కేంద్రంతో గొడవపడక తప్పదు. దాని వలన తెలంగాణకు లాభం కంటే మరింత నష్టమే జరిగే అవకాశం ఉంది.
ఇక కొమ్ములు తిరిగిన సిటింగ్ కాంగ్రెస్ యంపీలతో పోలిస్తే తెరాసకు బలమయిన యంపీ అభ్యర్ధులే లేరు. పైగా తెలంగాణాలో ఉన్న 17 యంపీ స్థానాలకి కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, తెరాస, మజ్లిస్ మరియు స్వతంత్ర అభ్యర్ధులు చాల మందే పోటీ పడుతున్నారు గనుక తెరాసకు మహా అయితే ఏ నాలుగయిదు యంపీ సీట్లో మాత్రమే దక్కే అవకాశముంది. ఆ నాలుగయిదు సీట్లను కేంద్రానికి ఎరగా వేసి తెరాస సాధించగలిగేదేమీ ఉండదు. అటువంటప్పుడు తెరాస చేసే డిమాండ్లను కూడా కేంద్రంలో పట్టించుకొనే వారే ఉండరు.
అదేవిధంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, లేదా కాంగ్రెస్-తెరాసలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, వారు వ్యతిరేఖించే బీజేపీ ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఇబ్బందికరమే. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి, తెలంగాణాలో కూడా ఆ పార్టీ లేదా తెరాసతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మాత్రం తెలంగాణకు తప్పకుండా ఎంతో కొంత మేలు జరగవచ్చును. కానీ కేంద్రంలో కాంగ్రెస్, తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీఇబ్బందులు తప్పవు.
ఒకవేళ కాంగ్రెస్-తెరాసలు కలిసి సంకీర్ణానికే సిద్దపడినా, ఆ రెండు పార్టీలలో నేతలూ కీలక పదవులు, అధికారాలు తమకే కావాలని కోరుకోవడం సహజం గనుక వారిది కలహాల కాపురమే అవుతుంది. ఒకవేళ తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమి అధికారం చేజిక్కించుకొన్నప్పటికీ, అప్పుడు కూడా వారి మధ్య ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడినట్లయితే వారు కేంద్రం నుండి తెలంగాణా కోసం భారీగా నిధులు రాబట్టే అవకాశం ఉండటమే వీరికి అదనపు అర్హతవుతుంది. ఇక తెరాస నేతలు ఆరోపిస్తున్నట్లు బీజేపీ నిజంగానే చంద్రబాబు జేబు సంస్థగా మారిపోయినట్లయితే దానివలన తెలంగాణాకు మరింత మేలే తప్ప కీడు జరుగదు. ఆయన తెలంగాణకు అవసరమయిన నిధులు విడుదల చేయించగలరు.
కేసీఆర్ తను ఉద్యమాలకు సమర్ధంగా నాయకత్వం వహించారు గనుక, ప్రభుత్వాన్ని కూడా అంతే సమర్ధంగా నడపగలనని భావిస్తున్నారు. కానీ జవాబుదారీతనం లేకుండా రోడ్లమీద ఉద్యమాలు చేయడానికి, తమను ఎన్నుకొన్న ప్రజలకు జవాబు చెప్పుకోవలసిన పరిస్థితిలో కార్యాలయంలో కూర్చొని ప్రభుత్వం నడపదానికీ చాలా తేడా ఉంది. ప్రభుత్వం నడపడానికి కార్యదక్షత, పరిపాలనానుభావం, ఉద్యోగులతో, ప్రభుత్వాధికారులతో, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో మంచి సమన్వయము, సక్యత వంటి చాలా లక్షణాలు అవసరం ఉంటాయి. మరి కేసీఆర్ కి అటువంటి లక్షణాలు ఉన్నాయనుకొంటే ప్రజలు నిరభ్యంతరంగా ఆయనకే ఓటు వేసుకోవచ్చును. లేకుంటే అపార పరిపాలనానుభావం ఉన్న కాంగ్రెస్ పార్టీకో లేదా ఎంతో కొంత పరిపాలనానుభవము, తెలంగాణకు నిధులు రాబట్టగల సామర్ధ్యం ఉన్న తెదేపా-బీజేపీ కూటమికో ఓటు వేసి గెలిపించుకోవలసి ఉంటుంది.