పవన్ కళ్యాణ్ విమర్శలతో ఓట్లు రాలుతాయా?
posted on May 2, 2014 8:23AM
నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేస్తున్న ఎన్నికల ప్రచార సభలకు విశేషంగా జనాలు తరలి వస్తున్నారు. సభకు వచ్చిన వారి నుండి మంచి స్పందన కూడా కనిపిస్తోంది. ఇంతవరకు కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ చూపుతున్న ఈ తెగువ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటున్న మాట వాస్తవం. దానివలన తెదేపా-బీజేపీ కూటమికి ఓటింగ్ శాతం ఎంతో కొంత పెరగడం కూడా తధ్యం. అయితే సరిగ్గా ఇదే కారణం చేత వారి కూటమికి ఎంతో కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. అది ఆయన అభిమానులను, యువతను ముఖ్యంగా తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను కూడా చాలా ఆకట్టుకొంది. కానీ కేసీఆర్ గత పదేళ్ళుగా నిరంతర ఉద్యమాలు చేసి, చివరికి తెలంగాణా సాధించిన వ్యక్తి అని తెలంగాణా ప్రజల దృడాభిప్రాయం. అది నిజం కూడా. తెలంగాణా ప్రజల దృష్టిలో హీరోగా ఉన్న వ్యక్తిని పట్టుకొని, ఏనాడు ఉద్యమాల గురించి కానీ, రాష్ట్ర విభజన వ్యవహారం గురించి కానీ నోరు విప్పని ఆంధ్రాకు చెందిన పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడం వలన తెలంగాణా ప్రజలు ఆగ్రహించడం సహజం. “మోడీ, ఇద్దరు ఆంధ్రా వాళ్ళను వెంటేసుకొని నాపై దాడి చేస్తున్నారు. అది నాపై చేస్తున్న దాడి కాదు. అది తెలంగాణా ప్రజలపై చేస్తున్న దాడి. మోడీ కూడా తెలంగాణకు శత్రువు” అని కేసీఆర్ అనడం కూడా అందుకే. పవన్ కళ్యాణ్ విమర్శల వలన ఎన్డీయే కూటమికే కాకుండా తెరాసకు కూడా ఎంత కొంత లాభపడవచ్చును. ఇరువురికీ అంతే నష్టం కూడా జరగవచ్చును కూడా. ఈ సంగతి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే తేలుతుంది.
ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శల వలన కూడా అటువంటి మిశ్రమ ఫలితాలే కలగవచ్చును. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాల వలన సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిరుపేదలు ఎంతో కొంత ప్రయోజనం పొందారు. వారందరూ ఆయన హయాంలో ఎంత అవినీతి జరిగింది? ఎవరు ఎంత దోచుకొన్నారు? వంటి విషయాల కంటే అంతవరకు తమకు ఏ ప్రభుత్వమూ, ముఖ్యమంత్రి అందించలేని ప్రయోజనాలను నేరుగా అందించిన విషయాన్నే బాగా గుర్తు పెట్టుకొన్నారు.
ఇది గ్రహించిన జగన్ గత ఐదేళ్ళుగా తన తండ్రి నామస్మరణం చేస్తూ ప్రజలలో ఆ సానుభూతిని, ఆ పధకాలను మరుపురానీకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్లనే నేటికీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో అంత విశేష ఆదరణ కనబడుతోంది. తెలంగాణాలో కేసీఆర్ లాగే ఆంధ్రాలో రాజశేఖర్ రెడ్డికి ప్రజలలో అంతే గౌరవం ఉంది. అందువలన పవన్ కళ్యాణ్ ఆయనపై, ఆయనకు అసలు సిసలయిన వారసుడునని చెప్పుకొంటున్న జగన్ పై ఎంత తీవ్రంగా విమర్శలు గుప్పిస్తే ఎన్డీయే కూటమిపట్ల ప్రజలలో విముఖత ఏర్పడి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.
అక్కడ కేసీఆర్ తను చేసిన ఉద్యమాలను పేర్కొంటూ , పవన్ కళ్యాణ్ విమర్శలకు ఏవిధంగా ధీటుగా బదులిచ్చారో, ఇక్కడ సీమంద్రాలో జగన్, షర్మిల కూడా తమ తండ్రి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఉటంకిస్తూ అంతే ధీటుగా బదులిస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల వలన సీమాంద్రాలో కూడా లాభమూ, నష్టమూ కూడా ఉండవచ్చును. కానీ పవన్ కళ్యాణ్ వారి అవినీతిని, వారి నిబద్దతను చాలా దైర్యంగా ప్రశ్నిస్తున్న తీరు మాత్రం యువతను,ముఖ్యంగా ఆయన అభిమానులను చాలా ఆకట్టుకొంటోంది. అది ఎన్డీయే కూటమికి ఓట్లు కురిపించే అవకాశం ఉంది.