పవన్ కళ్యాణ్ లోక్ సత్తాలో చేరి ఉండాల్సిందా?
posted on Apr 24, 2014 7:09AM
పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబుతో సమావేశమయ్యాక మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నందున ముందు ప్రకటించినట్లుగా మల్కాజ్ గిరి నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న లోక్ సత్తా అభ్యర్ధి జయప్రకాశ్ నారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయలేనని, అయినా ఆయనంటే తనకు చాలా గౌరవమని అన్నారు.
అందుకు జయప్రకాష్ కూడా సానుకూలంగా స్పందిస్తూ “పవన్ కళ్యాణ్ నాకు నా స్వంత తమ్ముడు కంటే ఎక్కువగా సహాయపడ్డారు. నిజానికి తానే మల్కాజ్ గిరి నుండి పోటీ చేయాలని భావించారు. కానీ నేను అక్కడి నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలుసుకొని ఆ ఆలోచన విరమించుకొన్నారు. పవన్ నీతి నిజాయితీ గల యువకుడు. ఏ విషయాన్నయినా నిర్భయంగా చెప్పగల దైర్యం కలవాడు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో, అందుకు ఆయన ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ప్రస్తుతం మల్కాజ్ గిరిలో జరుగుతున్న ఎన్నికలు ధనానికి,ధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం వంటివి. అందులో అంతిమంగా ధర్మమే జయిస్తుందని నాకు నమ్మకం ఉంది,” అని అన్నారు.
జయప్రకాశ్, పవన్ ఇరువురి మధ్య ఇంత చక్కటి అవగాహన, అనుబంధం ఉన్నపుడు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించే బదులు, భావ సారూప్యత, ప్రజలలో మంచి పేరున్న లోక్ సత్తాతో కలిసి పనిచేసి ఉండి ఉంటే నేడు ఆయనకు ఇటువంటి గందరగోళ పరిస్థితి ఎదుర్కోవలసిన సమస్య తప్పేది. జయప్రకాశ్ కూడా పవన్ కళ్యాణ్ లాగే మొదటి నుండి తెదేపా, బీజేపీలతో పొత్తులకు సిద్దమని చెపుతూనే ఉన్నారు. అవి కుదరనప్పటికీ నేటికీ ఆయన వాటికి తన మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కనీసం గతానుభవాలను దృష్టిలో ఉంచుకొనయినా, జనసేన ప్రకటించకముందు లోక్ సత్తాతో కలిసి పనిచేసే ఆలోచన చేసి ఉండి ఉంటే బాగుండేదేమో! కానీ, ఆయన తాను చాలా లోతుగా అధ్యయనం, ఆలోచన చేసిన తరువాతనే జనసేన పార్టీని స్థాపిస్తున్నానని చెప్పి, తన రెండవ సభతోనే పార్టీని అటకెక్కించి నవ్వులపాలయ్యారు.
తెదేపా అభ్యర్ధిపై పోటీ చేస్తున్న జయప్రకాశ్ కి మద్దతుగా ప్రచారం చేస్తానని వెనక్కి తగ్గడం, పొట్లూరికి టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం, ఆనక ఆయనకీ మద్దతు ఈయలేనని చెప్పడం, ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతు ఇస్తానని ప్రకటిస్తూనే అందులో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తడానికి మాత్రం ఇంకా సంకోచించడం వంటివన్నీ ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.
అదే ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు, మేధావి, నిజాయితీ పరుడని పేరున్న జయప్రకాశ్ నారాయణ్ తో చేతులు కలిపి, లోక్ సత్తా ద్వారా రాజకీయాలలోకి ప్రవేశించి ఉండి ఉంటే బహుశః పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరేలా ఉండేదేమో! ఇటువంటి అయోమయ పరిస్థితిని ఎదుర్కొనే ఆగత్యం ఉండేదే కాదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చును. బహుశః లోక్ సత్తాలో చేరి వేరొకరి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే బదులు, తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి ఉండవచ్చును. కానీ దానివలన ఆయనకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. పైగా ఆయన అయోమయ స్థితి వలన ప్రజలలో చులకన అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ వంటి ఒక నిజాయితీ కల వ్యక్తి నిజాయితీగా చేసిన ప్రయత్నం విఫలం అవడం, ఆయనకి ఇటువంటి సందిగ్ధ పరిస్థితి ఎదురవడం నిజంగా దురదృష్టకరమే. కానీ అందుకు ఆయనే భాద్యులని చెప్పక తప్పదు. ఆవేశానికి, ఆలోచనకి మధ్య పొంతన కుదరనప్పుడు ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి.