రాహుల్ జీ! జర సునీయే...
posted on Apr 25, 2014 @ 10:04PM
రాహుల్ గాంధీ ఇదివరకోసారి మీడియాతో మాట్లాడుతూ దేశంలో అన్ని సమస్యలను రాత్రికి రాత్రి మటుమాయం చేసేందుకు తన వద్ద మంత్రం దండం ఏమీ లేదని అన్నారు. కానీ ఇప్పుడు ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోవాలని కమిట్ అయిపోయిన తరువాత దేశంలో అన్ని సమస్యలనీ చిటికవేసి పరిష్కరించేస్తానని హామీ ఇస్తున్నారు. అందువలన ప్రజలను చిరకాలంగా వేదిస్తున్న కొన్ని ధర్మ సందేహాలకు ఆయన సమాధానాలు ఇవ్వగలిగితే చాలా సంతోషిస్తారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి దాదాపు నేటి వరకు కూడా దేశాన్ని పాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. అదేవిధంగా తెలంగాణా సమస్య కూడా 60 ఏళ్ల నాటిదని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. అయితే నాటి నుండి ఈ సమస్య ఉందని తెలిసి కూడా నేటివరకు దానిని పరిష్కరించకుండా ఎందుకు నాన్చవలసి వచ్చింది? అని రాహుల్ గాంధీని ఎవరూ ప్రశ్నించబోరు. కానీ 14 ఏళ్ల క్రితమే తెరాస కంటే ముందుగా తమ పార్టీ నేతలే తెలంగాణా ఇమ్మని కోరినా ఎందుకు ఇవ్వలేకపోయారు? కానీ ఇప్పుడు ఆ నేతల కోరిక మీదనే ఎందుకు ఇవ్వవలసి వచ్చింది?
పదేళ్ళ క్రితం తెలంగాణా ఇస్తామని ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణా ఇచ్చారని గొప్పగా చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ, ఈ నిర్ణయం తీసుకోవడానికి పదేళ్ళు ఎందుకు పట్టిందో, అన్నేళ్లలో చేయలేని పనిని కేవలం ఆరేడు నెలలో ఎందుకు, ఎలా, ఎవరి ప్రయోజనం కోసం చేయగలిగారో ఆయనే స్వయంగా శలవిస్తే బాగుంటుంది.
ఈ పదేళ్ళ కాలంలో తెరాస చేసిన తెలంగాణా ఉద్యమాలతో రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంటే, వందలాది మంది యువకులు బలిదానాలు చేస్తుంటే, అప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? తెలంగాణా ప్రజల ఆకాంక్షల మేరకే నేడు తెలంగాణా ఏర్పాటు చేస్తున్నామని గర్వంగా చెప్పుకొంటున్న ఆయన, దాదాపు మూడు నాలుగు సం.లపాటు లక్షలాది తెలంగాణా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు వారి ఆకాంక్షలు ఎందుకు అర్ధం చేసుకోలేదు? అసలు అన్నేళ్ళలో ఆయన ఎన్నడు ఎందుకు స్పందించలేదు? పదేళ్ళ సుదీర్గ కాలంలో తెలంగాణా ఏర్పాటు చేయలేనప్పుడు, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇవ్వగానే ఎలా సాధ్యం అయింది? అటువంటప్పుడు ఇది ప్రజల ఆకాంక్షల మేరకే ఇస్తున్నామని చెప్పుకోవడం అబద్దం కాదా?
తమ పార్టీ ప్రజలందరినీ కలుపుకుపోతుందని సగర్వంగా చెప్పుకొన్న రాహుల్ గాంధీకి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంద్రాలో లక్షలాది ప్రజలు రోడ్లమీదకు వచ్చి దాదాపు రెండున్నర నెలల పాటు ఉద్యమాలు చేస్తుంటే వారినెందుకు కలుపుకు పోలేకపోయారు? వారి ఘోష ఎందుకు వినలేకపోయారు? అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ ఏమి సమాధానం చెపుతారు?
ఇక ‘మేడ్ ఇన్ తెలంగాణా’ వాచ్ పెట్టుకోవాలని ఉందని చెపుతున్న ఆయన, ఇంతకాలంగా చైనా ఉత్పత్తులు మనదేశ ఆర్ధిక వ్యవస్థను, మన దేశీయ పరిశ్రమలను చిన్నాభిన్నం చేస్తున్నసంగతి తెలిసి ఉన్నపటికీ ఆయన ఇంత కాలం మిన్నకుండి ఇప్పుడు ఎన్నికల ముందు మేడ్ ఇన్ తెలంగాణా వాచ్ పెట్టుకోవాలని ఉందని అనడం అపహాస్యం కాదా?
కొంప అంటుకొన్నాక నుయ్యి త్రవ్వడం మొదలుపెట్టినట్లు, తెలంగాణా ఏర్పాటు చేసిన తరువాత విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందని ఇప్పుడు 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థాపిస్తామని ప్రకటించడం వివేకమనిపించుకొంటుందా? ఇదే పని ఇంతకాలం ఎందుకు చేయలేకపోయారు? ఆయన జవాబు చెప్పగలిగితే ఇటువంటి అనేక యక్ష ప్రశ్నలున్నాయి.