జగన్‌కి ఓటుతో బుద్ధి చెప్పాల్సిన తరుణమిది
posted on May 7, 2014 @ 10:46AM
రాష్ట్ర విభజన జరిగిన వెంటనే వచ్చిన ఈ ఎన్నికలు, ఇంతకాలం ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ, మోసగించిన రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి వీసమెత్తు విలువనీయకుండా, పార్లమెంటరీ విలువలను తుంగలో తొక్కి మరీ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ తీరును అందరూ గమనించారు. రాష్ట్ర విభజనతో తీవ్ర ఆందోళన చెందిన ప్రజలకు దైర్యం చెప్పి వారికి భరోసా ఇవ్వకపోగా, అటువంటి సమయంలో కూడా వారిని నిర్లజ్జగా ఓట్లు, సీట్లు కావాలని కోరుతూ బూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను ప్రజలు గమనించే ఉంటారు. చంద్రబాబుది రెండు కళ్ళు, కాళ్ళ సిద్ధాంతమని నాడు వెక్కిరించిన జగన్, షర్మిలలే ఆ తరువాత మాట మార్చి తమకు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు సమానమని చెప్పిన సంగతిని ప్రజలు గమనించే ఉంటారు.
నాడు వైకాపా చేసిన సమైక్యాంధ్ర ఉద్యమానికి విభజన తరువాత మళ్ళీ కొత్త నిర్వచనం చెప్పడం ద్వారా అంతకాలంగా తాము చేసిన ఆ ఉద్యమమంతా భూటకమని, అది సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టి, వారి ఓట్లు రాల్చుకోవడానికేనని స్పష్టమయింది. ఆ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ప్రత్యర్ధి పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసి, ఇతర పార్టీలలో బలమయిన నేతలను తమ పార్టీలోకి ఆకర్షించడాన్ని ప్రజలు గమనించే ఉంటారు. ప్రజల మనోభావాలతో ఆటలాడుకొన్న వైకాపా ఆ తరువాత ఎన్నడూ కూడా సమైక్యాంధ్ర గురించి మాట్లాడింది లేదు. కానీ ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు ఎన్నికల గంట మ్రోగిన తరువాత ఎటువంటి పాలనానుభావం కానీ, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ జాతీయ పార్టీతో సఖ్యత గానీ లేని జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవగానే రాష్ట్రాన్ని ఎవరూ చేయలేనంతగా అభివృద్ధి చేసి, రాజధాని నిర్మిస్తామంటూ హామీలు గుప్పించారు.
ఇంతకాలంగా బూటకపు ఉద్యమాలతో ప్రజలను మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఐదు సంతకాలతో వారి దశదిశ కూడా మార్చేస్తానని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కూడా రాష్ట్ర విభజన సమయంలో నిఖచ్చిగా వ్యవహరించలేకపోయారు. కానీ ఆయన రెండు ప్రాంతాలలో కూడా తన పార్టీని కాపాడుకోనేందుకే ఆవిధంగా వ్యవహరించవలసి వచ్చింది. కానీ, ఆయన కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర విభజన అనివార్యమని గ్రహించినందునే ఆయన సమన్యాయం చేయమని కోరుతూ పోరాడారు. అందుకే ఆయన పట్ల తెలంగాణా ప్రజలలో కూడా కొంత వ్యతిరేకత ఉంది. అంతే కాదు, కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించగానే రాత్రికిరాత్రి తెలంగాణా నుండి వైకాపాలలాగా మూటాముల్లె సర్దుకొని బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిలాగా బూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయలేదు. తనకు 30యంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని హామీలు కూడా ఇవ్వలేదు. ఆయన మొదటి నుండి మాట మీదనే నిలబడి వైకాపా పెట్టిన అగ్నిపరీక్షలు ఎదుర్కొని నిలువగాలిగారు. కానీ విశ్వసనీయతకు మారుపేరని చెప్పుకొన్న వైకాపా దాని అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికాగానే మళ్ళీ తెలంగాణాలో పోటీ చేసేందుకు ఏవిధంగా సిద్దమయిపోయారో ప్రజలే స్వయంగా చూశారు.
అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబు మొదటే కొంచెం ధైర్యం చేసి, తెలంగాణా ప్రజల ఆకాంక్షలు, వారి సమస్యలు, అవసరాలు, అక్కడి రాజకీయ సమస్యలు సీమాంధ్ర ప్రజలకు వివరించి, రాష్ట్ర విభజన అనివార్యమని నచ్చజెప్పి ఉండి ఉంటే, నేడు రెండు రాష్ట్రాలలో కూడా తేదేపాకు ఎదురే ఉండేది కాదేమో! కానీ ఆయన ఎందుకో ఆ నాడు ధైర్యం చేయలేకపోయారు. అది ఆయన బలహీనతగా భావించాల్సి ఉంటుంది తప్ప ప్రజలను మోసపుచ్చడానికి కాదని ప్రజలకూ తెలుసు. ఇక మంచికో చెడుకో, కష్టమో, నష్టమో రాష్ట్రవిభజన జరిగిపోయింది. ఇటువంటప్పుడు అన్నివిధాల అనుభవజ్ఞుడు, కేంద్రంతో చక్కటి స్నేహ సంబంధాలు కలిగి రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులను తేగలవాడికే ప్రజలు ఓటు వేసి గెలిపించుకోవలసి ఉంది. అలాకాదని ఏబీసీడీలు నేర్చుకొంటున్న వ్యక్తుల చేతికి రాజ్యాధికారం కట్టబెడితే, ఆవ్యక్తి అన్నీ నేర్చుకొనేవరకు చేసే తప్పులకు, తప్పుడు నిర్ణయాలకు ప్రజలే మూల్యం చెల్లించవలసి ఉంటుంది.
అందువలన కులం,మతం, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగిపోకుండా సరయిన వ్యక్తికి, పార్టీ చేతుల్లోనే రాష్ట్రాన్ని పెట్టాల్సి ఉంటుంది. అదికూడా తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టినప్పుడే కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదేళ్ళపాతు సుస్థిరమయిన పాలన జరిగి, రాష్ట్రం త్వరిత గతిన అభివృద్ది చెందే అవకాశం ఉంటుందని ప్రజలు గుర్తుంచుకోవాలి.