టీ-కాంగ్రెస్ అనైక్యతే తెరాసకు శ్రీరామరక్ష
posted on Apr 21, 2014 @ 10:26PM
ఈరోజు రాహుల్ గాంధీ మెహబూబ్ నగర్ సభలో ప్రసంగిస్తూ తెలంగాణా ఏర్పాటు కేవలం తన తల్లి సోనియాగాంధీ పట్టుదల, తమ పార్టీ దృడనిశ్చయం వల్లనే సాధ్యమయిందని, అందులో తెరాస, బీజేపీలకు ఎటువంటి పాత్ర, ప్రాధాన్యత లేవని చెపుతూ, తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ తమదేనని గట్టిగా పదేపదే నొక్కిచెప్పారు.
గతేడాది దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు చేప్పట్టిన తరువాత, అంతకాలంగా కేసీఆర్ చేతిలో ఉన్న తెలంగాణా అంశాన్ని, ఆయన ప్రోద్బలంతో టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా హైజాక్ చేసి తమ అధిష్టానం చేతికి అప్పజెప్పారు. నాటి నుండి కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ని పక్కన పెట్టేసి, తెలంగాణా అంశాన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని చకచకా పావులు కదుపుతుంటే, అప్పుడు కేసీఆర్ కూడా ఏమిచేయాలో పాలుపోక చాలా కాలంపాటు తన ఫారం హౌసులోకి మాయమయిపోయారు.
ఆ తరువాత కొన్ని నెలలకు కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి చేస్తున్నప్పుడు మాత్రమే, ఆయనకు అందులో వేలెట్టే అవకాశం ఇచ్చింది. కానీ అందుకు ప్రతిగా తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయాలని తీవ్ర ఒత్తిడి కూడా చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కొంచెం పట్టు విడుపులు ప్రదర్శిస్తూ కేసీఆర్ ని లొంగదీయాలని గట్టిగానే ప్రయత్నించింది. అయితే ఆయన కూడా చివరి వరకు కూడా కర్ర విరగకుండా, పాము చావకుండా అనే రీతిలో వ్యవహరిస్తూ, కాంగ్రెస్ అధిష్టానాన్నినమ్మించడానికి ఎంతగా డ్రామా ఆడారంటే, ఆయన తన కుటుంబ సభ్యులందరినీ వెంటేసుకొని సోనియాగాంధీతో గ్రూప్ ఫోటో కూడా దిగారు. కానీ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందగానే, ఆయన వెంటనే హైదరాబాదు బయలుదేరి వచ్చేసారు. ఆ సందర్భంగా ఆయనకు ‘నభూతో న భవిష్యత్’ అన్నట్లుగా తెరాస ఘనంగా స్వాగతం పలికింది. ఆ క్షణం నుండే కేవలం ఆయనే తెలంగాణా రాష్ట్రం సాధించారనే ప్రచారం చాలా ఉదృతంగా సాగింది.
నిజానికి టీ-కాంగ్రెస్ నేతలు అప్పుడే ఆవిధంగా, అదే స్థాయిలో ఉదృతంగా ప్రచారం చేసుకొనిఉండాల్సింది. కానీ వారందరూ తెరాస శ్రేణులు కేసీఆర్ ని ‘తెలంగాణా పిత’ ఇత్యాది బిరుదులతో కీర్తిస్తూ విస్తృతంగా ప్రచారం చేసుకొంటుంటే, చేతులు ముడుచుకొని కూర్చొన్నారు. అంతేగాక ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవి, ఇతరత్రా పదవుల కోసం వారిలో వారు కుమ్ములాడుకొంటూ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగారు. ఇదే అదునుగా కేసీఆర్ ఆంధ్ర, తెలంగాణా అంటూ అగ్గి రాజేసి, పరిస్థితిని మళ్ళీ పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆ తరువాతే ఆయన కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా హ్యండిస్తున్నట్లు ప్రకటించేశారు.
అయితే అప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలు పూర్తిగా మేల్కొనలేదు. ఈలోగా ఎన్నికల గంట కూడా మ్రోగేయడంతో, టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ తమ బంధు మిత్రులందరికీ పార్టీ టికెట్స్ సాధించే పనిలో పడిపోయారు. అయితే కేసీఆర్ కూడా ఆవ్యవహారాలతో, క్షణం తీరిక లేకపోయినప్పటికీ ఆయన వీలుచేసుకొని ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు రెచ్చగొడుతూ, తెలంగాణా పునర్నిర్మాణం అంశం తెరపైకి తీసుకువచ్చి, ఆ పని కూడా తెలంగాణా సాధించిన తెరాస వల్లనే సాధ్యమని ప్రజల మనస్సులో నాటుకొనేలా గట్టిగా ప్రచారం చేయగలిగారు.
తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన నాటి నుండి నేటివరకూ కూడా కేసీఆర్ అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక వైఖరి వల్లనే, టీ-కాంగ్రెస్ నేతలకి దక్కవలసిన క్రెడిట్ మొత్తం కేసీఆర్ మరియు ఆయన పార్టీ స్వంతం చేసుకోగలిగాయి. అందువల్లే నేడు రాహుల్ గాంధీ ఆ క్రెడిట్ కోసం ఇంతగా నొక్కి చెప్పుకోవలసి వస్తోంది. అయితే టీ-కాంగ్రెస్ నేతలందరూ నేటికీ ఒక్క త్రాటిపైకి రాలేకపోవడమే కేసీఆర్ మరియు తెరాసకు శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చును.
టీ-కాంగ్రెస్ లో ఎందరో హేమాహేమీలు ఉండగా ఊహించని విధంగా పొన్నాలకు పీసీసీ అధ్యక్షపదవి కట్టబెట్టినందుకు సీనియర్లు అందరూ ఆయనపై గుర్రుగా ఉన్నందునే ఆయనకు సహకరించడం లేదు. వారు ఆ విధంగా ఉన్నంత కాలమే తెరాస ఆటలు సాగుతాయి. బహుశః వారి మధ్య ఆ అంతరం నిలిపి ఉంచే ప్రయత్నంలోనే తెరాస నేతలందరూ కూడా పొన్నాలనే లక్ష్యంగా చేసుకొని మాటల తూటాలు పేలుస్తున్నారు. పొన్నాల డబ్బిచ్చి పీసీసీ అధ్యక్షపదవి కొనుకొన్నారని అందుకే కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారు.
టీ-కాంగ్రెస్ నేతల అనైక్యతే తెరాసకు శ్రీరామరక్ష వంటిది. ఆ విషయం కేసీఆర్ కి తెలిసినంత బాగా టీ-కాంగ్రెస్ నేతలకి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు రాహుల్ గాంధీయే కాదు, స్వయంగా ఆ దేవుడే దిగివచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు.