ఇంకా వేర్పాటువాదం అవసరమా?
posted on Apr 19, 2014 9:22AM
తెరాస నేతలు తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకొంటున్నప్పటికీ, అధికారమే లక్ష్యంగా సాగే ఇతర రాజకీయ పార్టీల వలే అది కూడా ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉంది. రాజకీయ పార్టీలు స్థానిక సమస్యలో, అభివృద్ధి నినాదమో మరొకటో అందిపుచ్చుకొని ఎన్నికలను ఎదుర్కొంటుంటే, తెరాస మాత్రం ప్రధానంగా తెలంగాణా సెంటిమెంటుని, దానితో ముడిపడున్న ప్రజల భావోద్వేగాలపైనే ఆధారపడి నెట్టుకొస్తోంది. అందుకు ప్రధాన కారణం గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం జరుగకపోవడమే. తెరాస తరపున పనిచేసేందుకు గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు, నాయకులతో కూడిన సరయిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం వలన, ప్రజలని తనవైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ వారిని తెలంగాణా పేరుతో రెచ్చగొడుతుంటారు.
ప్రతీసారిలాగే ఈసారి కూడా మాటల మాంత్రికుడు కేసీఆర్ తన మాటకారితనమంతా తెలంగాణా ప్రజల మీద ప్రయోగిస్తున్నారు. తమ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్, తెదేపా-బీజేపీలను అసలు నమ్మరాదని ప్రజలకు నూరిపోస్తున్నారు. ఇతర పార్టీలు వేటికీ కూడా తెలంగాణాతో ఎటువంటి అనుబందమూ లేదని, కేవలం తెరాస మాత్రమే తెలంగాణా ప్రజల పార్టీ అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆంధ్రా బూచోళ్ళు’ మిమ్మల్ని దోచుకోనేందుకు వస్తున్నారని ప్రజలను భయపెడుతూ వారిలో అభద్రతాభావం రేకెతిస్తూ, అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో మొత్తం యంపీ, యం.యల్యే. సీట్లన్నీతెరాసకే ఇస్తే తప్ప ప్రజలను ఆ దేవుడు కూడా ఈ ‘బూచాళ్ళ’ నుండి కాపడలేడన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. తమ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి మరీ నీళ్ళు, నిధులు తీసుకువచ్చి బంగారి తెలంగాణా నిర్మిస్తుందని కేసీఆర్ నమ్మబలుకుతున్నారు.
ప్రజలను భయపెడుతూ, రెచ్చగొడుతూ, ఊరిస్తూ కేసీఆర్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇది కూడా ఎన్నికలలో గెలిచేందుకు ఒక రకమయిన వ్యూహమేనని అర్ధమవుతోంది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని కోరిక ఉండటం తప్పు కాదు. కానీ అందుకోసం తెలంగాణా ప్రజల మనసులను ఇంకా ఈవిధంగా కలుషితం చేయడం, వారిలో విద్వేషభావాలు రెచ్చగొట్టడం చాలా హేయమయిన ఆలోచన.
నేటికీ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మరియు పార్టీ యం.యల్యేలు చాలామంది తమ తమ పదవులలోనే కొనసాగుతున్నారు. కానీ వారందరూ ఇంతవరకు తెలంగాణా కోసం ఉద్యమాలు చేయడం, ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప తెలంగాణా ప్రజల సమస్యలను తీర్చడానికి చేసిందేమీ లేదు. ఆ సంగతి ఇతరుల కంటే తెలంగాణా ప్రజలకే బాగా తెలుసు. అయినప్పటికీ తెరాస నేతలు తాము అధికారంలోకి వస్తే ఏవో అద్భుతాలు చేస్తామని ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు.
ప్రజలను మభ్యపెట్టడం రాజకీయ నాయకులకు, పార్టీలకు కొత్తేమి కాదు గనుక, కేసీఆర్ ఆయన పార్టీ నేతలు కూడా తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రజలలో ఇంకా విద్వేష భావాలు రెచ్చగొట్టే బదులు, మిగిలిన పార్టీలు, నేతలు లాగే ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించుకొంటే కనీసం ఎవరికీ నష్టం ఉండదు.