తెలంగాణా ప్రజల విజ్ఞతకు పరీక్ష
posted on Apr 30, 2014 7:31AM
తెలంగాణా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. వారి కలలు పండించుకొనే రోజు ఇది. ఈరోజు వారు వేస్తున్న ఓటు కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రం యొక్క దశ,దిశలని దానితో ముడిపడి ఉన్నతమ భవిష్యత్తుని కూడా నిర్దేశించబోతోంది. అందువల్ల ఈసారి తెలంగాణా ప్రజలు మరింత లోతుగా ఆలోచించి ఓట్లు వేయవలసి ఉంటుంది. నిజానికి ఇది వారి విచక్షణ జ్ఞానానికి రాజకీయ పార్టీలు పెడుతున్న పెద్ద పరీక్ష అని భావించి, ఓటుతో తమ సత్తా చాటి చెప్పాలి.
ఇంతవరకు వివిధ పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలను గుప్పించారు. నానా రకాలుగా వారిని ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసారు. పరస్పర విభిన్నమైన వాదనలు వినిపించి వారిని గందరగోళ పరిచారు. తాము మాత్రమే తెలంగాణాను అభివృద్ధి పధంలో నడిపించగలమని, తాము మాత్రమే తెలంగాణా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించగలమని అందరూ చాలా గట్టిగా చెప్పుకొన్నారు. మిగిలిన పార్టీలకు ఓట్లు వేస్తే వారు ప్రజలను దోచుకొంటారని ప్రజలకు నూరిపోసేరు.
ఇన్ని రకాల ఒత్తిళ్ళను తట్టుకొని నేడు తెలంగాణా ప్రజలు ఓటు వేయబోతున్నారు. అయితే ప్రజలకు ఈ మాటలు చెపుతున్న రాజకీయ నేతలలో చాలా మంది తెలంగాణా ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే. ఎప్పుడో అప్పుడు, ఎంతో కొంత కాలమయినా సదరు నేతలందరూ అధికారంలో ఉన్నవారే. మరి వారందరూ ఇంతకాలంగా తమ నియోజకవర్గం అభివృద్దికి, అక్కడి ప్రజల సంక్షేమానికి ఏమి చేసారని ప్రజలు ఒకసారి ప్రశ్నించుకొని మరీ ఓటు వేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఏమీ చేయని నేతలు మళ్ళీ ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలు కూడా తమను మభ్యపెట్టేందుకేనని గ్రహించి, అటువంటి రాజకీయ నేతలకు మంచి గుణపాటం నేర్పించాలి.
ఎన్నికల గంట మ్రోగిన తరువాత రాజకీయ నేతలందరూ తమంతట తామే తమ నిజస్వరూపాలను బయటపెట్టుకొన్నారు. వారి స్వభావం, వారి ఆలోచనలు, వారి లక్ష్యాలు, వారి నీతినిజాయితీ ఇత్యాది అంశాలన్నిటినీ ప్రజలు గమనించే అవకాశం కలిగింది. అందువలన ఎవరు ఎటువంటివారో ప్రజలు కూడా ఈపాటికే గ్రహించి ఉంటారు గనుక ఈ వాదనలకు, భావోద్వేగాలకు, ప్రలోభాలకు, హామీలకు అతీతంగా ఆలోచించి, తమకు, తమ కొత్త రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో వారినే ఎన్నుకోవడం మేలు.
ఇది రాజకీయనాయకులకి, వారి పార్టీలకి అగ్ని పరీక్ష మాత్రమే కాదు. ఈ ఎన్నికలు తెలంగాణా ప్రజల విజ్ఞతకు కూడా ఒక పరీక్ష వంటివేనని మర్చిపోకూడదు. కేవలం అధికారం, పదవుల కోసం నిత్యం రాజకీయాలు చేసే నేతలకు కాక, ప్రజాసేవ కూడా చేయగల, చేసే ఆసక్తి ఉన్న నేతలకే ఓటు వేసి ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజలు వారి నుండి ఏమయినా ఆశించే వీలు ఉంటుంది. లేకుంటే మరో ఐదేళ్ళ పాటు పదవులు, అధికారం కోసం ప్రాకులాడే తమ ప్రతినిధులను చూస్తూ అటువంటి వారికి ఓటు వేసినందుకు తాపీగా పశ్చాతాపపడవలసి ఉంటుందని మరిచిపోకూడదు.