సంక్రాంతి తర్వాత కేబినేట్ విస్తరణ ?
posted on Dec 23, 2012 6:10AM
రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత కేబినేట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయని పలువురు పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతకు ముందే నామినేటేడ్ పదవుల భర్తీ జరపడానికి కూడా పార్టీ అధిష్టానం ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తనకు అనుకూలంగా లేని మంత్రులకు ఉద్వాసన చెప్పడానికి కిరణ్ ఢిల్లీ పెద్దల వద్ద అనుమతి పొందినట్లుగా సమాచారం. ముఖ్యంగా తన వారికి ఈ పదవులను కట్టబెట్టాలని ముఖ్య మంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఈ పదవుల ఫై కన్నేసిన నేతలు ప్రస్తుతం వాటిని పొందడానికి తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ వర్గానికి మరో రెండు మంత్రి పదవులు కావాలని చిరంజీవి పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి, కోమటి రెడ్డి, జూపల్లి ల రాజీనామాలతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మూడు ఖాళీలు ఉన్నాయి. మరో నలుగురు మంత్రులకు ఉద్వాసన చెపితే (పార్టీ నేతల అంచనా ప్రకారం), మొత్తం ఏడు పదవులు ఖాళీ అయినట్లు లెక్క. డి. శ్రీనివాస్ తనకు తిరిగి మంత్రి పదవి కావాలని కోరినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఎవరిని వారించినా, ఈ సారి శాఖల మార్పు మాత్రం భారీగానే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.