జనవరిలోనే టిడిపి అభ్యర్దుల తొలి జాబితా ?
posted on Dec 24, 2012 @ 12:21PM
ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్దుల తొలి జాబితాను జనవరిలోనే ప్రకటించాలని తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటి నుండే ఈ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. అభ్యర్దుల ఎంపిక కార్యక్రమాన్ని బాబు ఇప్పటికే ప్రారంభించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అభ్యర్దుల ఎంపికలో బాబు ఎలాంటి వత్తిళ్ళకూ అవకాశం ఇవ్వడంలేదని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకొనే వారు తమ పని తీరు మెరుగుపరచుకోకుంటే తాను ఎట్టి పరిస్తితుల్లోనూ వారికి అవకాశం ఇవ్వనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ‘టికెట్ ను ఆశిస్తున్నవారు కష్టపడక తప్పదు. నేను జీవితంలో అనుభావించాల్సినదంతా అనుభవించాను. అయినా, రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టడం కోసం, కార్యకర్తలను ఆదుకోవడం కోసం కష్టపడుతున్నాను. నాయకులంతా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి’, అని చంద్ర బాబు వ్యాఖ్యానిస్తున్నారు.
అభ్యర్ధి లక్షణాలే కాదు, ప్రజా సమస్యలఫై ఆయా నాయకులు పోరాడే విధానం కూడా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయని బాబు అంటున్నారు.
పలువురు నాయకులు హైదరాబాద్ లోనే తిరుగుతున్నారని, వారంలో ఐదు రోజులు తమ నియోజకవర్గాల్లో పర్యటనలు చేయాల్సిందేనని బాబు వారికి స్పష్టం చేస్తున్నారు. తమ సీటు ఎటూ పోదనే ధీమాతో నియోజక వర్గాల ఇంచార్జ్ లు ఉండరాదని కూడా బాబు సలహా ఇస్తున్నారు.