అఖిల పక్షానికి ఉండవల్లి, సురేష్ షెట్కార్ ?
posted on Dec 22, 2012 @ 1:28PM
ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై జరగనున్న అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రా నుండి ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణా నుండి సురేష్ షెట్కార్ లను పంపించవచ్చని తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ తరపున ఎవరిని పంపించాలనే విషయాన్ని చర్చించడానికి ముఖ్య మంత్రి, పిసిసి అధ్యక్షుడు నిన్న సమావేశం అయ్యారు.
గతంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి కావూరి సాంబశివ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. అయితే, ప్రస్తుతం కావూరి పార్టీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనను పంపిస్తారా అనే ప్రశ్న పార్టీ వర్గాల్లో ఉంది.
ఉండవల్లి ఈ విషయంలో తన అభిప్రాయాలను వెల్లడించడం తప్ప, సమైక్యాంధ్ర ఉద్యమంలో పెద్దగా పాల్గొనలేదు. షెట్కార్ కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెలంగాణా ఎంపి లకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో పెద్దగా క్రియాశీలకంగా లేని వీరిద్దరినీ పార్టీ అధిష్టానం ఎంపిక చేయవచ్చని సమాచారం.
అయితే, రాష్ట్ర మంత్రి జానా రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది.