అజ్ఞాతంలో యరపతినేని?
posted on Dec 19, 2012 @ 2:20PM
గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అరెస్టు నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. గత సోమవారం రాత్రినుండి ఆయన అందుబాటులో లేరు. ఆయన గన్ మెన్ లు సోమవారం అర్థరాత్రి వరకూ వేచి చూసి ఆయన ఆచూకీ తెలియకపోవడంతో గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఎస్.పి. కార్యాలయంలో రిపోర్టు చేసినట్లు సమాచారం.
గతనెల 27వ తేదీన పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామానికి చెందినా కాంగ్రెస్ కార్యకర్త ఉన్నం నరేంద్ర (35) హత్యలో యరపతినేని మూడో నిందితునిగా ఉన్నారు. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ హత్యకేసులో ఇప్పటికే పోలీసులు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు.
యరపతినేనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాల్సిందేనని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గత కొంతకాలంగా పోలీసులపై వత్తిడి తెస్తూ వచ్చారు. అరెస్టు తదనంతరం పరిణామాలపై పోలీసులు సమీక్షిస్తున్నారు. గత మూడురోజుల నుండి యరపతినేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఉండటంతో ఆయనను అరెస్టు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు.